ఉప రాష్ట్రపతి ఎన్నికకు బీఆర్ఎస్ దూరం

ఉప రాష్ట్రపతి ఎన్నికకు బీఆర్ఎస్ దూరం
ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎన్నిక మంగ‌ళ‌వారం జ‌ర‌గ‌నున్న‌ది. ఎన్డీఏ అభ్య‌ర్థిగా సీపీ రాధాకృష్ణ‌ణ్‌, ఇండియా కూట‌మి అభ్య‌ర్థిగా సుప్రీంకోర్టు మాజీ జ‌డ్జి బీ సుద‌ర్శ‌న్ రెడ్డి పోటీప‌డుతున్నారు. అయితే ఈ ఎన్నిక‌ల్లో పోటీకి దూరంగా ఉండ‌నున్న‌ట్లు బీఆర్ఎస్ ఎంపీ సురేశ్ రెడ్డి ఢిల్లీలో వెల్ల‌డించారు.  అన్ని విధాలుగా ఆలోచ‌న‌లు వేసి, ఎన్నిక‌కు దూరంగా ఉండాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు చెప్పారు. 
తెలంగాణ రాష్ట్ర రైతులు తీవ్ర సంక్షోభ ప‌రిస్థితుల్లో ఉన్నార‌ని, యూరియా కొర‌త వ‌ల్ల రైతులు ఇబ్బంది ప‌డుతున్నార‌ని, యురియా కొర‌త‌ను తీర్చాల‌ని కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌ను డిమాండ్ చేశామ‌ని, అయినా  రెండు ప్ర‌భుత్వాలు రైతుల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌డంలో విఫ‌ల‌మైన‌ట్లు సురేశ్ రెడ్డి విమర్శించారు.  ఉప రాష్ట్ర‌ప‌తి ఎన్నిక బ్యాలెట్‌పై నోటా అందుబాటులో లేదు కాబ‌ట్టి ఎన్నిక‌కు దూరంగా ఉండాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు ఎంపీ తెలిపారు. త‌మ నిర‌స‌న‌ను ఈ ర‌కంగా వ్య‌క్తం చేస్తున్న‌ట్లు ఆయ‌న చెప్పారు.
తెలంగాణ‌లోని కాంగ్రెస్ పార్టీ నేత‌లు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను వేధిస్తున్నార‌ని, ఇలాంటి ప‌రిస్థితిల్లో త‌మ పార్టీ నిర్ణ‌యం తీసుకున్న‌ద‌ని, పార్టీ అధినేత కేసీఆర్‌తో జ‌రిగిన చ‌ర్చ‌ల ఆధారంగా నిర‌స‌న వ్య‌క్తం చేసేందుకు ఎన్నిక‌కు దూరంగా ఉండాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు ఆయన వెల్లడించారు. కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు రైతుల‌ను స‌తాయిస్తున్నాయ‌ని, ఈ కార‌ణంతోనే ఉప‌రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో ఓటువేయ‌డం లేద‌ని ఆయ‌న తెలిపారు. 
అయితే, పోటీల్లో ఉన్న ఇద్ద‌రు అభ్య‌ర్థుల‌ను అమితంగా గౌర‌విస్తున్నామ‌ని, ఆ అభ్య‌ర్థులు వారివారి రంగాల్లో నిష్ణాతుల‌ని, ఓ అభ్య‌ర్థి స్వంత రాష్ట్రానికి చెందిన వ్య‌క్తే అని ఆయన స్పష్టం చేశారు. అయితే,రైతుల‌ను ప్ర‌భుత్వాలు విస్మ‌రిస్తున్న నేప‌థ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఎన్నిక‌కు దూరంగా ఉంటున్న‌ట్లు ఆయ‌న ప్రకటించారు.
కాగా, ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డికి మజ్లిస్‌ తన మద్దతు ప్రకటించింది. సీఎం రేవంత్‌రెడ్డి మజ్లిస్‌ చీఫ్‌ అసదుద్దీన్‌ ఒవైసీకి ఫోన్‌ చేసి జాతీయ ప్రయోజనాల దృష్ట్యా జస్టిస్‌ సుదర్శన్‌ రెడ్డికి మద్దతు ఇవ్వాలని కోరిన నేపథ్యంలో ఆ మేరకు పార్టీ నిర్ణయం తీసుకుందని తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల్లో జస్టిస్‌ సుదర్శన్‌ రెడ్డికి మద్దతు ఇవ్వడమే సమంజసమని భావిస్తున్నట్లు ఒవైసీ పేర్కొన్నారు. జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలిపినట్లు ‘ఎక్స్‌’ వేదికగా వెల్లడించారు.