18 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు

18 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు

ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసారు. ఈ నెల 18వ తేదీ ఉదయం 9 గంటలకు శాసనసభ ప్రారంభం కానుండగా అదే రోజు ఉదయం 10 గంటలకు శాసన మండలి ప్రారంభం కానుంది. సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనేది ఉభయ సభలు విడివిడిగా బీఏసీ సమావేశాలు నిర్వహించి నిర్ణయించనున్నాయి. 

అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదించేందుకు వివిధ బిల్లులకు, చట్ట సవరణలకు ఇప్పటికే మంత్రి వర్గ సమావేశాల్లో ఆమోదం తెలిపారు. సామాజిక మాధ్యమాలలో తప్పుడు పోస్టులు పెట్టేవారిపై కఠిన చర్యలు తీసుకునేలా చట్టం తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తుంది. ఇందుకు అనుగుణంగా నిబంధనల రూపకల్పనకు మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేశారు. 

ఈ సమావేశాల్లోనే ఈ బిల్లును తీసుకువస్తారా? లేదా? అనేది వేచి చూడాలి. అటు పులివెందుల ఎమ్మెల్యే జగన్ మోహన్ రెడ్డితో పాటు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలు చర్చించాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు హితవు పలికారు. అసెంబ్లీకి వస్తే సభ్యులు అందరికీ సమాన అవకాశాలు ఇస్తామని తేల్చి చెప్పారు.

మరోవంక, ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తున్న వైఎస్సార్సీపీ సభ్యులు అసెంబ్లీకి వస్తే ఏ అంశంపై అయినా చర్చించి వాస్తవాలు బహిర్గతం చేసేందుకు సిద్ధమని సీఎం చంద్రబాబు సైతం సవాల్ విసిరారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తామంటున్న వైఎస్సార్సీపీ అదే వాదనకు కట్టుబడి వుంటుందా? లేక అసెంబ్లీకి వస్తుందా అనేది వేచి చూడాలి.

అసెంబ్లీ గేట్ 1 నుంచి మండలి చైర్మన్, స్పీకర్, డిప్యూటీ స్పీకర్, సీఎం, డిప్యూటీ సీఎంలకు మాత్రమే అనుమతి ఉంటుంది. గేట్ 2 నుంచి మంత్రులకు మాత్రమే అనుమతి ఇస్తారు. గేట్ 4 నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మాత్రమే అనుమతి ఉంటుంది. మండలి చైర్మన్, స్పీకర్, సీఎంలు వచ్చి వెళ్లే కారిడార్లోకి ఇతరులెవ్వరికీ అనుమతి లేదు. 4వ గేట్ గన్ పాయింట్ మినహా భద్రతా సిబ్బందిని అనుమతించేది లేదు. 

మంత్రులు, సభ్యుల పీఏలను అవసరం మేరకు మాత్రమే అనుమతి ఉంటుంది.శాసనసభా వ్యవహారాలతో సంబంధం లేని ప్రభుత్వ విభాగాల సిబ్బందికి ప్రాంగణంలోకి అనుమతి లేదు. శాసనసభ, మండలిలోకి సభ్యులు ఎవరూ ఆయుధాలతో రాకూడదు. ఒక వేళ వచ్చినా అసెంబ్లీ ప్రాంగణంలో ఉన్న బెల్ ఆఫ్ ఆర్మ్లో డిపాజిట్ చేయాలి. ఆయుధాలు, లాఠీలు, ప్లకార్డులు, విజిల్స్ లాంటి వాటితో విధానపరిషత్ ప్రాంగణంలోకి ప్రవేశం లేదు.