శిల్పాశెట్టి దంపతులపై లుకౌట్‌ నోటీసులు జారీ

శిల్పాశెట్టి దంపతులపై లుకౌట్‌ నోటీసులు జారీ

బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టితోపాటు ఆమె భర్త, వ్యాపారవేత్త రాజ్‌కుంద్రాపై లుకౌట్‌ నోటీసులు జారీ అయ్యాయి. 60 కోట్ల రూపాయల ఆర్థిక మోసానికి సంబంధించిన చీటింగ్‌ కేసులో ముంబయి పోలీసు శాఖకు చెందిన ఆర్థిక నేరాల విభాగం వారిపై లుకౌట్‌ నోటీసులు జారీ చేసింది. శిల్పాశెట్టి దంపతులు తరచూ అంతర్జాతీయ పర్యటనలు చేపడుతున్నట్లు గుర్తించామని పోలీసులు తెలిపారు. 

రూ. 60 కోట్ల రుణం, పెట్టుబడులకు సంబంధించి ఆర్థిక ఒప్పందం చేసుకున్న ఒక వ్యాపారవేత్తను శిల్పా దంపతులు మోసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. దీనిపై ఆగస్టు 14న జుహూ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైందని వివరించారు.   ముంబయి చెందిన దీపక్ కొఠారీ అనే వ్యాపారవేత్త నటి శిల్పా శెట్టి, రాజ్​ కుంద్రాపై తీవ్ర ఆరోపణలు చేశారు. 2015లో రాజేశ్​ ఆర్య అనే వ్యక్తి​ ద్వారా శెట్టి- కుంద్రాతో తనకు పరిచయం ఏర్పడిందని దీపక్​ ఫిర్యాదులో చెప్పారు.

అప్పడు వీరు ఆన్​లైన్​ షాపింగ్​ ప్లాట్​ఫామ్​ అయిన బెస్ట్​ డీల్​ టీవీకి డైరెక్టర్లుగా ఉన్నారని, అప్పటికి ఆ కంపెనీలో 87 శాతం కంటే ఎక్కువ వాటా ఉందని పేర్కొన్నారు. అయితే 2015- 2023 మధ్య కాలంలో వ్యాపార విస్తరణ కోసం దీపక్​ వీరికి రూ. 60.48 కోట్లు ఇవ్వగా, ఆ నిధులను శెట్టి తన వ్యక్తిగతంగా ఖర్చు చేశారని వాపోయారు. 2015 ఏప్రిల్​లో మొదటి విడతగా రూ. 31.95 కోట్లు ఇచ్చానని ఫిర్యాదులో పేర్కొన్నారు.

2015 జులై, 2016 మార్చి మధ్య రూ. 28.54 కోట్లు అదనంగా బదిలీ చేశానని చెప్పారు. అలా మొత్తంగా రూ. 60.48 కోట్లుకు పైగా బదిలీ చేశానని చెప్పుకొచ్చారు.  ఓ సమావేశం నిర్వహించి డబ్బును సకాలంలో తిరిగి ఇస్తామని శెట్టి హమీ ఇవ్వడంతో ఒప్పందం కుదిరినట్లు దీపక్ వివరించారు. కానీ నెల తర్వాత సెప్టెంబర్​లో శెట్టి కంపెనీ డైరెక్టర్​  పదవికి రాజీనామా చేశారని తెలిపారు. ఆ తర్వాత ఆ కంపెనీపై రూ. 1.28 కోట్ల దివాలా కేసు బయటపడిందని, ఈ విషయాన్ని బయటకు చెప్పలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు.

అంతకుముందు రెండు రోజుల క్రితమే ముంబయి బాంద్రాలో ఉన్న పెద్ద రెస్టరంట్‌లలో ఒకటైన బాస్టియన్‌ను మూసివేస్తున్నట్లు శిల్పాశెట్టి సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ విషయం వైరల్‌గా మారడంతో నెట్టింట అనేక కథనాలు వెలువడ్డాయి. దీంతో స్పందించిన ఆమె, దీన్ని పూర్తిగా మూసివేస్తామనే ప్రచారంలో నిజం లేదన్నారు. దీనిని అక్టోబర్‌లో జుహులో ప్రారంభిస్తామని వివరణ ఇచ్చారు. సినిమాల్లో బిజీగా ఉన్న సమయంలోనే శిల్పా శెట్టి వ్యాపార రంగంలోకి అడుగుపెట్టి బాస్టియన్‌ పేరుతో రెస్టరంట్‌ను ప్రారంభించారు. ముంబయి నగరంలోని పలు ప్రాంతాల్లో దీనికి ఆరు బ్రాంచ్‌లు ఉన్నాయి.