
జీఎస్టీ 2.O దేశాభివృద్ధికి డబుల్ డోస్ అని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఈ సంస్కరణలతో మరింత ముందుగానే ఆత్మనిర్భర భారత్ సాకారం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపికైన వారితో సమావేశమైన ప్రధాని మోదీ, టీచర్లు విద్యాబుద్ధులు నేర్పడమే కాకుండా విద్యార్థుల భవిష్యత్తుకు దారి చూపాలని సూచించారు.
స్వదేశీ వస్తు వినియోగం, మేడిన్ ఇండియాను విద్యార్థి దశలోనే నేర్పాలని ఉపాధ్యాయులకు సూచించారు. జీఎస్టీ శ్లాబ్ల హేతుబద్ధీకరణతో వ్యాపార నిర్వహణ సులభతరమై, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. వోకల్ ఫర్ లోకల్ నినాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలాని ప్రజలను కోరారు. దేశీయ ఉత్పత్తుల వినియోగంతో దేశ రూపురేఖలు మారిపోతాయని ప్రధాని తెలిపారు.
ఒక్కతాటిపై నడిచే సమాఖ్య వ్యవస్థ మరింత బలపడుతుందని, అభివృద్ధి చెందిన దేశం కోసం ఈ సంస్కరణలు ఎంతో కీలకమన్నారు. స్వదేశీ డే, స్వదేశీ వీక్ ను పండుగగా నిర్వహించుకోవాలని చెప్పారు.
“మేడిన్ ఇండియాపై చిన్నాపెద్దా అందరూ ఆలోచించాలి. గాంధీజీ నినాదం స్వదేశీ. దాన్ని అందరం అమలుచేద్దాం. మన దేశంలో పుట్టిన, తయారైన వస్తువు ఏదైనా సరే మన దేశ కార్మికుల శ్రమతో తయారైనది, మన దేశ మట్టిలోని సువాసనతో నిండుకొని ఉన్నది నా దృష్టిలో స్వదేశీ. దేశీయ ఉత్పత్తుల వినియోగంతో దేశ రూపురేఖలు మారిపోతాయి” అని ప్రధాని చెప్పారు.
“మేడిన్ ఇండియాపై విద్యార్థి దశ నుంచే అవగాహన కల్పించాలి. స్వదేశీ డే, స్వదేశీ వీక్‌ను పండుగగా నిర్వహించుకోవాలి. దేశీయ ఉత్పత్తిదారులను మనమే గౌరవించాలి, ఆదరించాలి. ప్రతి వ్యాపారి తన దుకాణం ముందు స్వదేశీ అని బోర్డు పెట్టాలి. దేశభక్తి, ఆత్మగౌరవం, స్వయంసమృద్ధితో దేశాన్ని ముందుకు నడిపిద్దాం” అని ప్రధాని పిలుపిచ్చారు. “మనదేశంలో తయారైన వస్తువులే వాడుతున్నామని గర్వపడాలి. ‘హర్ ఘర్ స్వదేశీ, ఘర్‌ఘర్ స్వదేశీ’ నినాదాన్ని ముందుకు తీసుకెళ్లాలి. గాంధీజీ ఇచ్చిన ‘స్వదేశీ’ నినాదం అందరం పాటిద్దాం. ‘స్వదేశీ’ విధానంతోనే మరింత స్వావలంబన సాధించగలం” అని స్పష్టం చేశారు.
“చంద్రయాన్ విజయంతో సైంటిస్టులు కావాలనే కాంక్ష మన విద్యార్థుల్లో పెరిగింది. చిన్నారుల్లో డిజిటల్ దుష్ప్రభావాన్ని కూడా తగ్గించే బాధ్యత మనపై ఉంది. గ్యాంబ్లింగ్ విషయంలో ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకున్నది. యువత గ్యాంబ్లింగ్ బారినపడకుండా చర్యలు చేపట్టాం. సరైన పద్ధతిలో వెళ్తే ఆన్‌లైన్ గేమింగ్‌లో మనం ఆధిపత్యం చెలాయించగలం. ఆన్‌లైన్ గేమింగ్‌లో భారీ ఉద్యోగ అవకాశాలు కూడా ఉన్నాయి.” అని ప్రధాని మోదీ వివరించారు.
More Stories
ట్రంప్ సుంకాలతో 0.5 % తగ్గనున్న జిడిపి
రద్దైన నోట్లతో శశికళ బినామీ షుగర్ ఫ్యాక్టరీ.. సీబీఐ కేసు
ట్రంప్ బెదిరింపులతో ఐటి రంగంపై భారత్ దృష్టి