ప్రస్తుతం కాంగ్రెస్ చేస్తున్న “ఓటు చోరీ” ప్రచారం కేవలం ప్రజలను మభ్యపెట్టేందుకు, మోసగించేందుకు చేస్తున్న ఒక నినాదం మాత్రమే అని మాజీ మంత్రి బీజేపీ నేత డా. మర్రి శశిధర్ రెడ్డి విమర్శించారు. ఇప్పుడు రాహుల్ గాంధీ చేస్తున్న “ఓటు అధికార్ యాత్ర” అనే ఒక తమాషా చూస్తున్నాం అంటూ ఆయన ఎద్దేవా చేసారు. గత సంవత్సరం లోక్సభ ఎన్నికల సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ “చార్ సౌ పార్” అంటూ దేశాన్ని ఉత్సాహపరిచే ప్రయత్నం చేస్తున్న సమయంలో చేతిలో రాజ్యాంగ పుస్తకం పట్టుకుని రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు “రిజర్వేషన్లు తీసేస్తారు, రాజ్యాంగాన్ని రక్షించాలి” అంటూ చేసిన ప్రచారం వంటిదే అని కొట్టిపారేసారు.
ఇప్పుడ బీహార్ ఎన్నికల్లో ఓట్ చోరీ అంటూ మళ్లీ అదే తరహా ప్రయత్నం చేస్తున్నారని ఆయన విమర్శించారు. గత 35 సంవత్సరాల ఎన్నికలను పరిశీలించినా, 2024లో కాంగ్రెస్ పార్టీ గాని, ఇండీ కూటమి గాని ఇంత పెద్ద సంఖ్యలో ఎప్పుడూ ఓట్లు సాధించలేదని, అయినప్పటికీ “ఓటు చోరీ” అంటూ బీజేపీపై ఆరోపణలు చేయడం ఘోర తప్పిదం అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
2018లో తెలంగాణ రాష్ట్ర ఓటర్ జాబితాలో ఇంచుమించుగా 2.56 కోట్లమంది ఓటర్లు ఉండగా, తాముఎన్నికల సంఘానికి 68 లక్షల వ్యత్యాసాలు ఉన్నాయని నిర్ధారణతో చూపించామని ఆయన గుర్తు చేశారు. వాటిలో ముఖ్యంగా 30 లక్షల డ్యూప్లికేట్ ఓట్లు ఒకే ఇంటిలో అనేక మంది ఓటర్లుగా నమోదు, ఇంటి నెంబర్ లేకుండా పేర్లు నమోదు, ఒకే వ్యక్తి పేరు అనేక రకాలుగా నమోదు కావడం…. ఇలా కలిపి దాదాపు 60 లక్షల వ్యత్యాసాలు/తప్పులు ఉన్నాయని గుర్తించా, వివరించారు.
2025 జనవరిలో విడుదలైన ఓటర్ జాబితా ప్రకారం బీహార్లో మొత్తం 7 కోట్లు 89 లక్షల పైచిలుకు ఓటర్లు ఉంటె, రాష్ట్రవ్యాప్తంగా 77,895 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసిన నేపథ్యంలో 65 లక్షల ఓట్లు తగ్గాయని కొంతమంది కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారని డా. శశిధర్ రెడ్డితెలిపారు. ఈ 65 లక్షల తగ్గుదల అనేది కాంగ్రెస్ నాయకులు చెప్పిన అంచనా మాత్రమే అని, మొత్తం ఓటర్లలో ఇది 1% కన్నా తక్కువ అని పేర్కొంటూ ఎన్నికల లిస్టు రివిజన్లో ఇలాంటి సవరణలు సహజమైనవని ఆయన స్పష్టం చేశారు.
ఆగస్టు 1న విడుదలైన డ్రాఫ్ట్ జాబితాపై సెప్టెంబర్ 1 వరకు క్లెయిమ్స్ & ఆబ్జెక్షన్లు దాఖలు చేసుకునే అవకాశం ఉందని, రాష్ట్రవ్యాప్తంగా సగటున ఒక్కో పోలింగ్ స్టేషన్లో దాదాపు 100 ఓట్ల వ్యత్యాసం మాత్రమే ఉండొచ్చని ఆయన చెప్పారు. ఈ గడువు ఒక నెల సరిపోతుందని కాబట్టి దీన్ని పెద్ద సమస్యగా చూపించడం తగదని హితవు చెప్పారు. కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన ప్రెస్ నోట్ ప్రకారం ఇప్పటివరకు లక్షలాది క్లెయిమ్స్ దాఖలు అయ్యాయని ఆయన తెలిపారు. ఇంకా ఆరు రోజుల సమయం ఉంది. వచ్చిన వాటన్నింటిని పరిశీలించే ప్రక్రియకు సంబంధించిన గైడ్లైన్స్ చాలా స్పష్టంగా ఉన్నాయని చెప్పారు.
హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో గతంలో ఎన్నో సార్లు బోగస్ ఓట్లు ఉన్నాయని తాము ఒక్కొక్క ఇంట్లో వందల సంఖ్యలో ఓటర్లు నమోదు అయ్యారని పేర్కొంటూ ప్రత్యేకంగా ఒక కమ్యూనిటీకి చెందినవారు ఈ విధంగా చేయడం వల్ల న్యాయంగా ఎన్నికలు జరగడం కుదరదని ఆయన స్పష్టం చేశారు. తాము దీనిపై నిరంతర పోరాటం చేస్తూ వస్తున్నామని డా. రెడ్డి గుర్తు చేశారు.
హైదరాబాద్ లోక్సభ పరిధిలో పక్క జిల్లాలైన రంగారెడ్డి, మేడ్చల్ మొదలైన ప్రాంతాల్లో నివసించే వారి పేర్లను కూడా ఇక్కడ నమోదు చేశారని, ఇక్కడ నివసించని వారి పేర్లు ఉన్నాయని, ఇలాంటి అనేక పొరపాట్లు ఉన్నాయని ఆయన వివరించారు. బిజెపి మాత్రమే కాకూండా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక నాయకుడు 2024 ఫిబ్రవరిలో 6,69,000 బోగస్ ఓట్లు హైదరాబాద్లో ఉన్నాయని చెప్పారని, మళ్లీ ఆగస్టు 25న కూడా అదే మాట చెప్పారని ఆయన గుర్తు చేశారు.
ఇలాంటి పరిస్థితుల్లో, కాంగ్రెస్ పార్టీ బిజెపిపై “ఓటు చోరీ” ఆరోపణలు చేయడం చాలా హాస్యాస్పదం అని పేర్కొంటూ రాహుల్ గాంధీ గారు అసలు ఏమి జరుగుతుందో నిజంగా తెలుసుకోవాలని హితవు చెప్పారు. జిహెచ్ఎంసి పరిధిలోని 24 అసెంబ్లీ నియోజకవర్గాలపై ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) వెంటనే చేపట్టాలని మేము ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు తాము కేంద్ర ఎన్నికల సంఘానికి మెమోరాండం కూడా సమర్పించనున్నట్లు ఆయన తెలిపారు.
More Stories
తిరిగి రాజరికం వైపు నేపాల్ చూస్తున్నదా?
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు