ఆప‌రేష‌న్ సింధూర్ థీమ్‌తో గ‌ణేశుడి విగ్ర‌హం

ఆప‌రేష‌న్ సింధూర్ థీమ్‌తో గ‌ణేశుడి విగ్ర‌హం

వినాయ‌చ‌వితి కోసం హైద‌రాబాద్ ముస్తాబ‌వుతోంది. గ‌ణుశుడి విగ్ర‌హాల ఏర్పాట్ల‌లో స్థానికులు తలమునకలయ్యారు. ఉప్పుగూడ‌లోని శ్రీ మ‌ల్లిఖార్జున న‌గ‌ర్ యూత్ వెల్ఫేర్ అసోసియేష‌న్ వినూత్న రీతిలో గ‌ణ‌ప‌య్య‌ను ప్ర‌తిష్టించ‌నున్నారు. ఆప‌రేష‌న్ సింధూర్ థీమ్‌తో ఉన్న గ‌ణేశుడి విగ్ర‌హాన్ని త‌యారు చేశారు.  వినాయ‌చ‌వితి న‌వ‌రాత్రి ఉత్స‌వాల్లో ఆ గ‌ణేశుడు అంద‌ర్నీ అల‌రించ‌నున్నాడు.

స్థానిక ఆర్టిస్టులే ఆ విగ్ర‌హాన్ని త‌యారు చేసిన‌ట్లు తెలుస్తోంది. సుమారు 6 ల‌క్ష‌లు ఖ‌ర్చు అయిన‌ట్లు నిర్వాహ‌కులు చెబుతున్నారు. ఆ థీమ్‌లో బ్ర‌హ్మోస్ ఎస్-400 రైఫిల్స్‌, ఆర్మీ మోడ‌ల్ థీమ్ కూడా ఉన్న‌ది. నిర్వాహ‌కుడు శ్రీకాంత్ మాట్లాడుత రెండు నెల‌ల క్రితం విగ్ర‌హం కోసం ఆర్డ‌ర్ ఇచ్చిన‌ట్లు చెప్పారు. ఆగ‌స్టు 15వ తేదీన ఆ వినాయ‌కుడు డెలివ‌రీ అయిన‌ట్లు తెలిపారు. గ‌ణేశుడి ప్ర‌ధాన విగ్ర‌హాన్ని ఎయిర్ ఫోర్స్ ఆఫీస‌ర్ త‌ర‌హాలో త‌యారు చేశామ‌ని పేర్కొన్నారు. 

ఆప‌రేష‌న్ సింధూర్ గురించి 20 నిమిషాల వీడియోను కూడా త‌యారు చేసిన‌ట్లు చెప్పారు. న‌వ‌రాత్రుల్లో ఆ వీడియోను ప్ర‌ద‌ర్శిస్తామ‌న్నారు. ఆయుధ డిజైన్ కోసం రెండు వాహ‌నాల‌ను వాడిన‌ట్లు చెప్పారు. సుమారు 8 మంది ఆర్టిస్టులు ప‌నిచేశార‌ని తెలిపారు. మ‌రో నిర్వాహ‌కుడు సుశీల్ కుమార్ మాట్లాడుతూ ప్ర‌తి ఏడాది కొత్త త‌ర‌హా వినాయ‌కుడిని ప్ర‌తిష్టిస్తామ‌ని పేర్కొన్నారు. 2023లో చంద్ర‌యాన్ మోడ‌ల్ గ‌ణేశ్‌ను ఏర్పాటు చేశామ‌న్నారు.

ఎక్కువ మంది భ‌క్తుల‌ను అట్రాక్ట్ చేసేందుకు ఆప‌రేష‌న్ సింధూర్ థీమ్‌ను ఎంపిక చేశామ‌ని తెలిపారు.  ఈ మండ‌పాన్ని ద‌ర్శించిన వాళ్ల‌కు ఆప‌రేష‌న్ సింధూర్ గురించి, మ‌న ఆయుధాల గురించి తెలుస్తుంద‌ని చెప్పారు. మొత్తం ఖ‌ర్చు 10 ల‌క్ష‌లు దాటి ఉంటుంద‌న్నారు. బుధ‌వారం వినాయ‌క‌చ‌వితి నుంచి ఆప‌రేష‌న్ సింధూర్ గ‌ణేశుడు భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నాడు.