
తెలంగాణాలో బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వికారాబాద్ జిల్లా పేరును “అనంతగిరి జిల్లా”గా మారుస్తుందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ప్రకటించారు. వికారాబాద్ జిల్లా పర్యటన సందర్భంగా పార్టీ కార్యకర్తల సమావేశంలో ప్రసంగిస్తూ అనంతగిరి `దక్షిణ ఊటీ’గా ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.
అనంత పద్మనాభస్వామి ఆశీర్వాదంతో రానున్న రోజుల్లో వికారాబాద్లో బీజేపీ మూడు అసెంబ్లీ స్థానాలు గెలుస్తుందని ఆయన భరోసా వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీజేపీని గెలిపించేలా ప్రతి కార్యకర్త పనిచేయాలని పిలుపిచ్చారు. తెలంగాణ ప్రజలు ఇప్పుడు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా బీజేపీని చూస్తున్నారని ఆయన చెప్పారు. రాబోయే రోజుల్లో ఏ శక్తి అడ్డొచ్చినా, తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం తథ్యం అంటూ భరోసా వ్యక్తం చేశారు.గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు రెండూ ఒకే తీరుగా పాలనలో వైఫల్యం చెందాయని ఆయన విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ “దళితబంధు, రైతుబంధు” అంటూ మాయమాటలు చెప్పి, సరిగ్గా అమలు చేయక మోసం చేసిందని, అందుకే ప్రజలు వారిని ఇంటికి పంపారని తెలిపారు. అదేవిధంగా, కాంగ్రెస్ పార్టీ “రైతుభరోసా” కింద ప్రతి రైతుకి రూ.15,000 ఆర్థిక సహాయం ఇస్తామని హామీ ఇచ్చి వాస్తవానికి రెండు విడతల్లో కేవలం రూ.6,000 మాత్రమే ఇచ్చి మోసం చేసిందని విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు. ఇళ్లు నిజమైన అర్హులైన పేదలకు ఇవ్వకుండా, కాంగ్రెస్ కార్యకర్తలకే కేటాయించడం సరికాదని పేర్కొంటూ అర్హులైన బీదలకు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. వికారాబాద్లో రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా బీజేపీ గెలుపు ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు.విద్యావంతులు, రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళలు – అన్ని వర్గాల ప్రజలు ఇప్పుడు కాంగ్రెస్, బీఆర్ఎస్ మోసాన్ని గుర్తించారని చెప్పారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలన్న చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీకి లేదని పేర్కొంటూ నిజంగా చిత్తశుద్ధి ఉంటే, బీసీల జాబితాలో ముస్లింలను ఎందుకు చేరుస్తున్నారు? అని రామచంద్ర రావు ప్రశ్నించారు .వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు “కేంద్రం యూరియా ఇవ్వడం లేదు” అని అబద్ధపు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ఇబ్బందులకు నిజమైన కారణం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం అని పేర్కొంటూ మార్క్ఫెడ్ ద్వారా యూరియా సరఫరా సరిగ్గా జరగడం లేదని విమర్శించారు. ఎరువుల దుకాణాల్లో యూరియా దొరక్కపోవడానికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని స్పష్టం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను కేంద్రంపై నెట్టడం సిగ్గుచేటు అని ధ్వజమెత్తారు.
More Stories
ఓట్ల కోసం చొరబాటుదారులను కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది
వైసీపీ అవినీతి పాలనకు బాబు, మోదీ చరమగీతం
వలసదారులకు వ్యతిరేకంగా లండన్లో భారీ ప్రదర్శన