నక్సల్స్ తో చర్చలు జరపాలనడం హాస్యాస్పదం

నక్సల్స్ తో చర్చలు జరపాలనడం హాస్యాస్పదం

పేదరికం ఉన్నంత కాలం నక్సలిజం ఉంటుందని, ఆపరేషన్ కగార్ ను ఆపి నక్సలైట్లతో చర్చలు జరపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ చెప్పడం హాస్యాస్పదమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు. నక్సలైట్లతో గతంలో చర్చలు జరిపిన కాంగ్రెస్ ఏం సాధించిందని ప్రశ్నించారు. అధికారంలో ఉన్నంత కాలం నక్సలైట్ల నిషేధం విధించిన కేసీఆర్ అధికారం పోగానే చర్చలంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని మండిపడ్డారు.

కరీంనగర్ లో  ఏబీవీపీ కరీంనగర్ శాఖ  శనివారం ఏర్పాటు ‘నక్సల్స్ నరమేధం-మేధోమథనం’ చర్చలో ముఖ్య అతిథిగా పాల్గొంటూ నక్సలైట్ల సమస్య సామాజిక కోణంగా చూడాలని మాట్లాడుతున్న పౌర హక్కులు, మానవ హక్కుల సంఘం నేతలు మాట్లాడటం సిగ్గు చేటని మండిపడ్డారు. నక్సలైట్ల చేతిలో వేలాది మంది అమాయక ప్రజలు చనిపోయినప్పుడు సామాజిక కోణం గుర్తుకురాలేదా? అని ప్రశ్నించారు. 

నక్సల్స్ దురాగతాలవల్ల దాదాపు 50 వేల మంది చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 9 వేల మంది పోలీసులు నక్సల్స్ తూటాలకు బలయ్యారని వాపోయారు.  ఆపరేషన్ కగార్ ను ఆపే ప్రసక్తే లేదని, నక్సలైట్లను ఏరిపారేసే కార్యక్రమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. 2026 మార్చి నాటికి దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించి ‘నక్సల్ ముక్త్ భారత్’ గా మార్చి తీరుతామని ఉద్ఘాటించారు.   

ఏబీవీపీ ప్రాంత ప్రముఖ్ మాదాసి బాబూరావు, విభాగ్ ఇంఛార్జ్ అన్నల్ దాస్ మురళి, సంయుక్త కార్యదర్శి ముత్యాల రాకేశ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్బంగా నక్సల్స్ చేతిలో బలైన ఏబీవీపీ విద్యార్థులకు నివాళి అర్పించారు. దేశం కోసం, నక్సలిజానికి వ్యతిరేకంగా ఏబీవీపీ చేసిన పోరాటాలు అసామాన్యం అని పేర్కొంటూ ఎంతో మంది బలిదానం చేశారని సంజయ్ చెప్పారు. నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసిన ఏబీవీపీ త్యాగాలు వెలకట్టలేనివని కొనియాడారు.

యూపీఏ హయాంలో 200 జిల్లాలకు విస్తరించిన నక్సలిజం మోదీ హయాంలో 12 జిల్లాలకే పరిమితమైందని, రాబోయే మార్చి నాటికి ఆయా జిల్లాల్లోనూ నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించి తీరుతామని స్పష్టం చేశారు.   దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే నక్సలైట్లు ఉన్న చోటే అత్యధికంగా పేదరికం ఎందుకు ప్రబలింది? అని ప్రశ్నించారు. నిజం చెప్పాలంటే నక్సలైట్లు ఉన్నచోటే పేదరికం, హింస ఎక్కువైందని, అందుకే నక్సల్స్ నిర్మూలనే లక్ష్యం పెట్టుకున్నామని తెలిపారు. 

నక్సలైట్ల మీద అంత ప్రేమ ఉంటే రాష్ట్రంలో నక్సలైట్లపై విధించిన నిషేధాన్ని ఎత్తేయమనండి అంటూ సవాల్ చేశారు. అర్బన్ నక్సల్స్ పేరుతో నిషేధం ఉన్న సంస్థలకు అనుకూలంగా మాట్లాడుతుంటే, వాళ్లను విద్యా కమిషన్ లో సభ్యులుగా నియమిస్తే సమాజానికి ఏం సందేశం పంపుతున్నారు? అని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు.  బాక్సైట్ తవ్వకాలు కోసమే చత్తీష్ ఘడ్ లో నక్సలైట్లను చంపుతున్నారని అర్బన్ నక్సలైట్లు కొందరు చేస్తున్న దుష్ప్రచారంను సంజయ్ కొట్టిపారేసారు. 

గనుల తవ్వకాలు 1947 నుండి జరుగుతున్నాయి కదా? నక్సలిజం తీవ్రంగా ఉన్న సమయంలో కూడా తెలంగాణ, చత్తీష్ ఘడ్ ప్రాంతాల్లో గనుల తవ్వకాలు జరిగాయి కదా? అని ప్రశ్నించారు.  బాక్సైట్ సహా గనులు జాతీయ సంపద అని పేర్కొంటూ ప్రజల అభివ్రుద్ధి కోసం నిరంతరం గనుల తవ్వకాలు కొనసాగుతూనే ఉంటాయని స్పష్టం చేశారు. దానికి, నక్సల్స్ నిర్మూలనకు సంబంధమేముంది? అని నిలదీశారు.