నారీ శక్తికి ఇచ్చిన హామీని నెరవేర్చడానికి కట్టుబడి ఉన్నాం

నవంబర్ 30, సోమవారం నాడు జరగనున్న పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ‘మహిళా రిజర్వేషన్ బిల్లు’ ప్రవేశపెట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో, పార్లమెంటు మరియు రాష్ట్ర శాసనసభల్లో మహిళల గళాన్ని, వారి భాగస్వామ్యాన్ని ఏ ప్రతిపక్షం కూడా ఎక్కువ కాలం అడ్డుకోలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. 
 
‘ఎక్స్’ వేదికగా విడుదల చేసిన ఒక వీడియో సందేశంలో ప్రధాని మోదీ ఇలా పేర్కొన్నారు: “నారీ శక్తికి తగిన ప్రాతినిధ్యం కల్పించేందుకు దశాబ్దాలుగా పోరాటం జరుగుతోంది. నేను కూడా చాలా ఏళ్లుగా దీని కోసం కృషి చేస్తున్నాను. నాకంటే ముందు ఎంతోమంది మహిళలు ఈ అంశాన్ని లేవనెత్తారు. ఎంతోమంది సోదరీమణులు లేఖల ద్వారా తమ అభిప్రాయాలను నాకు తెలియజేశారు. దేశంలోని నారీ శక్తి అందరి ఆశీస్సులు మనకు ఉన్నాయని నాకు తెలుసు.” 
 
బిల్లుకు మద్దతిస్తున్న వారు రెట్టింపైనా ఉత్సాహంతో ఉన్నారని చెబుతూ వ్యతిరేకులు మా ధైర్యాన్ని దెబ్బతీయలేరని, సంకల్పం స్థిరంగా ఉందని ప్రధాని తేల్చి చెప్పారు.  “మహిళా రిజర్వేషన్ల మార్గంలో ఎదురయ్యే ప్రతి అడ్డంకిని తొలగిస్తామని దేశంలోని ప్రతి మహిళకు హామీ ఇస్తున్నాను. మా మనోధైర్యం గొప్పది. మా సంకల్పం అచంచలమైనది.మా నిశ్చయం దృఢమైనది. మహిళా రిజర్వేషన్లను వ్యతిరేకించే పార్టీలు, పార్లమెంటు, రాష్ట్ర శాసనసభల్లో నారీ శక్తి తమ భాగస్వామ్యాన్ని పెంచుకోకుండా ఎప్పటికీ అడ్డుకోలేవు. ఇది కేవలం సమయం మాత్రమే తీసుకునే విషయం” అని ఆయన పేర్కొన్నారు.
 
మహిళా సాధికారతకు, ఎన్నికల ప్రాతినిధ్యంలో వారి బలమైన భాగస్వామ్యాన్ని నిర్ధారించడానికి మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన  తెలిపారు. మహిళల పెరిగిన భాగస్వామ్యం విధాన రూపకల్పన, శాసన నిర్మాణం, జాతీయ ప్రాధాన్యతల నిర్ధారణకు ఒక కొత్త కోణాన్ని మాత్రమే జోడిస్తుందని ఆయన పేర్కొన్నారు.

అమిత్ షాతో డీఎంకే ఎంపీల భేటీ 

కాగా, కేంద్రం తీసుకొస్తున్న డీలిమిటేషన్ బిల్లుకు తమ పార్టీ మద్దతు ఇస్తున్నట్లు డీఎంకే ఎంపీ కనిమొళి వెల్లడించారు. డిల్లీలో శనివారం సాయంత్రం అమిత్‌ షాతో ఆయన నివాసంలో డీఎంకే ఎంపీలు సమావేమయ్యారు. అనంతరం గతంలో తమ పార్టీ చేసిన ప్రతిపాదనలను కొత్త బిల్లులో చేర్చారని, అందుకే ఈ బిల్లుకు మద్దతివ్వాలని నిర్ణయించుకున్నట్లు కనిమొళి పేర్కొన్నారు.

ఇలా ఉండగా, ఈ ప్రత్యేక సమావేశంలో ఇండీ కూటమితో కాకుండా విడిగా కుర్చునేందుకు తమకు అనుమతివ్వాలని డీఎంకే పార్టీ ఎంపీలు చేసిన విజ్ఞప్తిని లోక్​సభ స్పీకర్ ఓంబిర్లా అంగీకరించారు. దీంతో సోమవారం జరగనున్న సమావేశంలో డీఎంకేకు చెందిన 22 మంది ఎంపీలు ఇండీ కూటమితో కాకుండా విడిగా కూర్చోనున్నారు. ప్రభుత్వ ఏర్పాటులో విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగంకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వడంతో, డీఎంకే ఇండీ కూటమికి దూరంగా ఉంటోంది.

About The Author