2027 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే అంశంపై పార్టీలో చర్చ జరుగుతున్న తరుణంలో, శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను ప్రశంసించారు. ఆయనను సమర్థుడైన నాయకుడిగా, హిందుత్వకు అత్యంత ప్రముఖ ప్రతినిధులలో ఒకరిగా రౌత్ అభివర్ణించారు.
యోగి ఆదిత్యనాథ్ తనను తాను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు. “ఆయన చాలా సమర్థుడు. మాకు కూడా యోగి జీ అంటే ఇష్టమే. ఆయన హిందుత్వకు ఒక బలమైన ముఖచిత్రం, అందరికంటే భిన్నంగా నిలుస్తారు. ‘యోగి ఉంటేనే యూపీ, యోగి లేకపోతే యూపీ లేదు’ అన్నట్లుగా ఆయన పరిస్థితి ఉంది” అని రౌత్ పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేశారంటే, రాష్ట్రంలో బీజేపీకి మెజారిటీ వస్తుందని, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలలో మెజారిటీ సభ్యులు తనకు మద్దతు ఇస్తారనే ఆయన నమ్మకమే దీనికి కారణమని రౌత్ విశ్లేషించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఎవరు నాయకత్వం వహిస్తారు? చివరికి ముఖ్యమంత్రి పీఠాన్ని ఎవరు అధిష్టిస్తారు?
అనే విషయమై 2027 ఎన్నికల తర్వాత ఎవరు ముఖ్యమంత్రి అవుతారో, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలే నిర్ణయిస్తారని ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య వ్యాఖ్యానించడంతో చర్చ బయలుదేరింది. నాయకత్వ అంశంపై వస్తున్న ప్రశ్నలకు స్పందిస్తూ, ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో అందరికీ తెలుసునని యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు.
మరోవైపు, ఎన్నికల ప్రచారంలో బీజేపీకి ‘కమలం’ (పార్టీ గుర్తు) మాత్రమే ప్రధాన ముఖచిత్రమని మౌర్య నొక్కి చెప్పారు. ఎన్నికల ఫలితాల అనంతరం, ఎన్నికైన ఎమ్మెల్యేలు కేంద్ర పరిశీలకుల సమక్షంలో సమావేశమై, ఏకగ్రీవంగా తమ నాయకుడిని ఎన్నుకుంటారని ఆయన తెలిపారు. ప్రస్తుతం యోగి ఆదిత్యనాథే ముఖ్యమంత్రి అని అంగీకరించినప్పటికీ, 2027 ఎన్నికల తర్వాత ఆయన ఆ పదవిలో కొనసాగుతారా? లేదా మరొకరు బాధ్యతలు చేపడతారా? అనేది శాసనసభ్యులే నిర్ణయిస్తారని మౌర్య పేర్కొన్నారు.
అదే సమయంలో, యోగి ఆదిత్యనాథ్‌కు తన మద్దతు ఉంటుందని కూడా ఆయన పునరుద్ఘాటించారు. గమనించదగ్గ విషయం ఏమిటంటే, 2017 లేదా 2022 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు, బీజేపీ అధికారికంగా యోగి ఆదిత్యనాథ్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించలేదు.

More Stories
కార్తీక దీపం వివాదంలో తమను సంప్రదించ లేదంటున్న అర్చకులు
అహ్మదాబాద్ ప్రధాన కేంద్రంగా 2036 ఒలింపిక్
మహిళా రిజర్వేషన్లు అడ్డుకునే శక్తి ప్రతిపక్షాలకు లేదు