దిగుమతి చేసుకున్న శిలాజ ఇంధనాలపై భారతదేశం ఆధారపడటం జాతీయ ఆర్థిక వ్యవస్థకు ఒక పెద్ద భారం అని పేర్కొంటూ, కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, బయో ఇంధనాలు, ఇథనాల్, హైడ్రోజన్, ఇతర స్వదేశీ ప్రత్యామ్నాయ ఇంధన వనరుల వైపు మార్పును వేగవంతం చేయాల్సిన తక్షణ అవసరాన్ని నొక్కి చెప్పారు.
శిలాజ ఇంధనాల దిగుమతుల వల్ల దేశానికి ఏటా సుమారు రూ. 22 లక్షల కోట్లు ఖర్చవుతోందని ఎత్తి చూపుతూ, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం వల్ల జాతీయ సంపదను పరిరక్షించడమే కాకుండా, కాలుష్యాన్ని అరికట్టడం, రైతుల ఆదాయాలను పెంచడం, గ్రామీణ ఉపాధిని కల్పించడం, ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడం వంటివి జరుగుతాయని తెలిపారు.
సాంప్రదాయ ఇంధనాల వల్ల పర్యావరణానికి కలిగే నష్టాన్ని ప్రస్తావిస్తూ దేశంలో సుమారు 40 శాతం వాయు కాలుష్యానికి రవాణా రంగం కారణమని గడ్కరీ అంగీకరించారు. ఢిల్లీ వంటి నగరాల్లో తీవ్రమైన కాలుష్య పరిస్థితిని ప్రస్తావిస్తూ, ఆర్థికంగా లాభదాయకమైన, కాలుష్య రహిత, దేశీయంగా ఉత్పత్తి చేసిన ప్రత్యామ్నాయాలను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం నిరంతరం కృషి చేయాలని ఆయన చెప్పారు.
ప్రభుత్వ విధానాన్ని వివరిస్తూ, భారతదేశ ప్రత్యామ్నాయ ఇంధన విధానం నాలుగు కీలక సూత్రాలపై ఆధారపడి ఉందని గడ్కరీ చెప్పారు: దిగుమతుల ప్రత్యామ్నాయం, తక్కువ ఖర్చు, కాలుష్య రహిత ఇంధనం , స్వదేశీ ఉత్పత్తి. “దీనిని సాధించడానికి మనం ఎవరి దయాదాక్షిణ్యాల మీద గానీ, సద్భావన మీద గానీ ఆధారపడాల్సిన అవసరం లేదు. మన దేశీయంగా ఉత్పత్తి అయ్యే ఇంధనాలు, ముఖ్యంగా బయోఫ్యూయల్స్, శిలాజ ఇంధనాల కంటే చౌకైనవి,” అని ఆయన తెలిపారు.
భారతదేశ ఇంధన వైవిధ్యీకరణ వ్యూహంలో ఇథనాల్‌కు పెరుగుతున్న పాత్రను గడ్కరీ ప్రముఖంగా ప్రస్తావించారు. 2022 నుండి ఈ20 ఇంధనం వాడుకలో ఉందని ఆయన పేర్కొన్నారు. ఆయన ప్రకారం, సుమారు నాలుగు కోట్ల నాలుగు చక్రాల వాహనాలు, 2 కోట్ల ద్విచక్ర వాహనాలు ఈ20 ఇంధనంతో నడుస్తున్నాయి. ఇథనాల్ మిశ్రమానికి వ్యతిరేకంగా ఇటీవల జరిగిన ప్రచారాలలో లేవనెత్తిన ఆందోళనలను తిరస్కరిస్తూ, ఆయన ఆ విమర్శలను డబ్బు తీసుకుని చేస్తున్న ప్రచారంగా అభివర్ణించారు. ఆరోపించినట్లుగా విస్తృతమైన సమస్యలు లేకుండానే వాహనాలు నడుస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు.
బయోఎనర్జీకి ఉన్న ఆర్థిక ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ, ఇది నాలుగు ప్రధాన స్తంభాలపై ఆధారపడి ఉంటుందని గడ్కరీ పేర్కొన్నారు: నిరూపితమైన సాంకేతికత, ఆర్థిక సాధ్యత, కాలుష్య రహిత ఇంధనం , రైతులు, గ్రామీణ కార్మికులకు మెరుగైన ఆర్థిక అవకాశాలు. బయోఎనర్జీని కేవలం ప్రత్యామ్నాయ ఇంధన వనరుగా మాత్రమే కాకుండా, భారతదేశ ఆర్థిక పరివర్తనకు ఒక వ్యూహాత్మక అవకాశంగా చూడాలని గడ్కరీ నొక్కి చెప్పారు.

More Stories
మసీదులో చిక్కుకున్న లష్కర్ ఉగ్రవాది లతీఫ్ భట్
2027 ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు సిద్ధమవుతున్న బీజేపీ
ప్రజల సందర్శనార్థం కేజ్రీవాల్ ‘శీష్ మహల్’