గత నెలలో ఒక ఆచారం సందర్భంగా గోవధ జరిగిందన్న ఆరోపణల నేపథ్యంలో, ఒడిశాలోని కియోంఝర్ జిల్లాలో సంతాల్ కమ్యూనిటీకి చెందిన ఒక మతపరమైన ప్రదేశాన్ని అపవిత్రం చేశారన్న ఘటన రాష్ట్రంలో ఒక రాజకీయ ఉద్రిక్త అంశంగా మారింది. నవంబర్ 18న గిరిజన సమాజం పిలుపునిచ్చిన నిరసనకు సోమవారం బిజు జనతా దళ్ (బిజెడి) తమ మద్దతును ప్రకటించింది.
కాగా, ఈ ఘటనకు సంబంధించి గత వారం ఐదుగురు బజరంగ్ దళ్ కార్యకర్తలను అరెస్టు చేయడాన్ని విశ్వ హిందూ పరిషత్ (విహెచ్‌పి) తీవ్రంగా ఖండించింది. ఈ అరెస్టులను “ఏకపక్షమైనవి”గా పేర్కొంటూ, ఈ విషయంలో ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ జోక్యం చేసుకోవాలని విహెచ్‌పి కోరింది. కియోంఝర్ ముఖ్యమంత్రి సొంత జిల్లా.
పోలీసుల చర్య “ఏకపక్షంగా, వివక్షతో కూడినదిగా” ఉందని విహెచ్‌పి రాష్ట్ర అధ్యక్షుడు ప్రఫుల్ల కుమార్ మిశ్రా ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖలో ఆరోపించారు. క్యోంఝర్‌లోని ఘసిపురా పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసులో, నవంబర్ 10న ఈ ఐదుగురు బజరంగ్ దళ్ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. గోవధకు సంబంధించిన ఆరోపణలపై, గిరిజనులపై (మహిళలతో సహా) దాడి చేశారని, వారి ప్రార్థనా స్థలాన్ని ధ్వంసం చేశారని ఆరోపిస్తూ, వీరిపై భారతీయ న్యయ సంహిత (బిఎన్ఎస్)లోని వివిధ సెక్షన్లు, ‘షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల (అత్యాచారాల నివారణ) చట్టం’ కింద కేసులు నమోదు చేసినట్లు ఓ పోలీసు అధికారి తెలిపారు. ఈ ఘటన అక్టోబర్ 23న జరిగిందని ఆయన పేర్కొన్నారు.
అదే సమయంలో, బజరంగ్ దళ్ కార్యకర్తలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు, గిరిజన సమూహంపై కూడా మరొక కేసు నమోదైందని ఆ అధికారి తెలిపారు. విహెచ్‌పి తన లేఖలో ఇలా పేర్కొంది: “కొందరు వ్యక్తులు గోవధకు పాల్పడ్డారు. అప్పుడు అక్కడ ఉన్న పోలీసు అధికారుల సమక్షంలోనే బజరంగ్ దళ్ సభ్యులు తమ అభ్యంతరాలను వ్యక్తం చేశారు. పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని సద్దుమణుగేలా చేయడంతో, బజరంగ్ దళ్ కార్యకర్తలు ఎటువంటి ఘర్షణకు తావులేకుండా శాంతియుతంగా అక్కడి నుండి వెళ్లిపోయారు.”
అయితే, ఆ తర్వాత గోవధకు పాల్పడిన వ్యక్తులే బజరంగ్ దళ్ కార్యకర్తలపై దాడి చేశారని మిశ్రా ఆరోపించారు. దీనిపై బజరంగ్ దళ్ సభ్యులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారని ఆయన చెప్పారు. “చాలా బాధాకరమైన విషయం ఏమిటంటే, వారి ఫిర్యాదుపై సరైన చర్యలు తీసుకునే బదులు, స్థానిక పోలీసులు ఏకపక్షంగా, వివక్షతో వ్యవహరించారు. ఫలితంగా, మా కార్యకర్తలను అరెస్టు చేశారు” అని మిశ్రా పేర్కొన్నారు.
ఈ అరెస్టులపై నిష్పక్షపాతంగా, చట్టబద్ధంగా సమీక్ష జరిపి, వారిని విడుదల చేసేలా ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు. ఉద్దేశపూర్వక దుష్ప్రవర్తన, అధికార దుర్వినియోగం, లేదా విధి నిర్వహణలో నిర్లక్ష్యం వంటి ఆరోపణలపై సంబంధిత పోలీసు అధికారులపై తగిన శాఖాపరమైన, న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని కూడా వీహెచ్‌పీ డిమాండ్ చేసింది.
స్వచ్ఛందంగా గాయపరచడం, అశ్లీల చర్యలు, పాటలు, ఉమ్మడి ఉద్దేశం, నేరపూరిత బెదిరింపులు, మహిళలపై నేరపూరిత బలప్రయోగం వంటి భారతీయ న్యాయ సంహిత (బిఎన్ఎస్)లోని వివిధ సెక్షన్ల కింద ఐదుగురిని అరెస్టు చేసినట్లు ఘాసిపురా పోలీస్ ఇన్‌స్పెక్టర్ మితాలి మధులిత బిస్వాల్ తెలిపారు. నిందితులపై ఎస్సీ/ఎస్టీ (అత్యాచారాల నివారణ) చట్టం కింద కూడా కేసులు నమోదు చేశారు.

More Stories
విపత్తు సంసిద్ధతను శాశ్వత ఎజెండాగా మార్చిన గుజరాత్ భూకంపం 2001
యువ గ్రాడ్యుయేట్లలో సగానికిపైగా తక్కువ నైపుణ్యం ఉద్యోగాల్లో
గూఢచర్య ప్రమాదంలో హనీ ట్రాప్లు ఓ భాగం మాత్రమే