ఈ తీర్పుతో అమెరికాలో చదువుకుంటున్న అంతర్జాతీయ విద్యార్థులు, పరిశోధకులు, అధ్యాపకులు, విదేశీ మీడియా ప్రతినిధులకు ఊరట లభించింది. అమెరికా జిల్లా న్యాయమూర్తి ఎఫ్. డెన్నిస్ సేలర్ సోమవారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన తుది నిబంధనను అడ్మినిస్ట్రేటివ్ ప్రొసీజర్ యాక్ట్ (ఏపీఏ) ప్రకారం రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. పిటిషనర్లు దాఖలు చేసిన సారాంశ తీర్పు అభ్యర్థనను అంగీకరించగా, అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం (డీహెచ్‌ఎస్) దాఖలు చేసిన అభ్యర్థనను తిరస్కరించారు.
ఈ నిబంధనను 2026 జులై 17న ఫెడరల్ రిజిస్టర్‌లో ప్రచురించారు. దీని ప్రకారం ఎఫ్ వీసాలపై వచ్చే విదేశీ విద్యార్థులు, జే వీసాలపై వచ్చే పరిశోధకులు, ప్రొఫెసర్లు, అధ్యాపకులు, ఐ వీసాలపై వచ్చే విదేశీ మీడియా ప్రతినిధులు అమెరికాలో ఉండే కాలానికి నిర్దిష్ట పరిమితి విధించాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. గడువు పొడిగింపు కోసం ప్రత్యేక అనుమతి పొందే విధానాన్ని కూడా తీసుకొచ్చింది.
ఈ నిబంధనను సవాలు చేస్తూ ఉన్నత విద్య, వలస వ్యవహారాలకు సంబంధించిన పలు సంస్థలు, కార్మిక సంఘాలు కోర్టును ఆశ్రయించాయి. సెప్టెంబర్ 14న ప్రాథమిక ఉత్తర్వులు జారీ చేసిన న్యాయస్థానం ఈ నిబంధనను సవాలు చేస్తూ పిటిషనర్లు చేసిన వాదనల్లో బలం ఉందని అభిప్రాయపడింది. అప్పట్లోనే నిబంధన అమలును తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ అమెరికా ప్రభుత్వం ఫస్ట్ సర్క్యూట్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్‌ను ఆశ్రయించినప్పటికీ, ఆ అప్పీల్ ఇంకా పెండింగ్‌లోనే ఉంది.
విద్యార్థులు, మార్పిడి కార్యక్రమాల్లో పాల్గొనేవారి వివరాలను పర్యవేక్షించేందుకు ఇప్పటికే ఉన్న స్టూడెంట్ అండ్ ఎక్స్ఛేంజ్ విజిటర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (సెవిస్) విధానాన్ని కూడా కోర్టు పరిశీలించింది. విద్యాసంస్థల్లో మోసాలను గుర్తించేందుకు 2019లో ప్రభుత్వ జవాబుదారీతన కార్యాలయం చేసిన సిఫార్సులను అమలు చేస్తూ డీహెచ్‌ఎస్ గతంలో ఈ వ్యవస్థను మరింత పటిష్ఠం చేసిందని కోర్టు గుర్తుచేసింది.
జాతీయ భద్రత, మోసాల నివారణ పేరుతో ప్రభుత్వం చెబుతున్న కారణాలకు ఎఫ్-1 వీసా కార్యక్రమం అసలు ఉద్దేశంతో సంబంధం లేదని కోర్టు తేల్చిచెప్పింది. విదేశీ విద్యార్థులకు అమెరికాలో విద్యా అవకాశాలు కల్పించాలన్న కాంగ్రెస్ ఉద్దేశానికి విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించింది.

More Stories
మినాబ్ స్కూల్‌పై క్షిపణుల దాడి చేసిన ఇద్దరినీ పట్టుకుంటాం!
కివీస్‌పై భారత్ సంచలన విజయం
గాల్లోకి వెళ్లి టవర్‌కే తిరిగొచ్చిన స్టార్‌షిప్!