గత వారం దక్షిణ కశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) చెక్‌పోస్టుపై జరిగిన కాల్పుల ఘటనకు ఒకరోజు ముందు, మోస్ట్ వాంటెడ్ లష్కరే తోయిబా ఉగ్రవాది లతీఫ్ భట్, అతని సహచరుడు ఉమర్ నిసార్ దార్ దాడులు ఎక్కడ చేయాలో నిర్ణయించుకునేందుకు రెక్కీ నిర్వహిస్తూ సీసీటీవీ కెమెరాలకు చిక్కగా, తాజాగా భద్రతా బలగాలు వాటిని గుర్తించి బయటపెట్టారు.
అంతేకాకుండా సోమవారం రోజు కుల్గామ్‌లోని లారూ ప్రాంతంలో భద్రతా బలగాలతో జరిగిన భీకర ఎదురుకాల్పుల్లో ఉమర్ నిసార్ దార్ హతమయ్యాడని, తమ దిగ్బంధం నుంచి తప్పించుకున్న లతీఫ్ భట్‌ను పట్టుకునేందుకు భారీ స్థాయిలో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఇద్దరు ఉగ్రవాదుల కదలికలపై పక్కా సమాచారం అందడంతో భారత సైన్యం, జమ్మూ కశ్మీర్ పోలీసుల ప్రత్యేక ఆపరేషన్స్ గ్రూప్ సంయుక్తంగా కుల్గామ్‌లో తనిఖీలు ప్రారంభించాయి.
భద్రతా బలగాలు తమవైపు రావడాన్ని గమనించిన ఉగ్రవాదులు సమీపంలోని యాపిల్ తోట పక్కనే ఉన్న రెండు పాఠశాలల వైపు పరుగులు తీశారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా దళాలు ఆ ప్రాంతం చుట్టూ కట్టుదిట్టమైన భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశాయి. పాఠశాల భవనాలు, చుట్టుపక్కల తోటల్లో ఉన్న విద్యార్థులు, సిబ్బందిని పూర్తిగా సురక్షిత ప్రాంతాలకు తరలించిన తర్వాతే బలగాలు ఉగ్రవాదులపై ఎదురు కాల్పులు ప్రారంభించాయి.
ఈ ఎన్కౌంటర్ జరగడానికి ముందు వరకు ఉమర్ నిసార్ దార్ అదృశ్యాన్ని పోలీసులు మిస్సింగ్ కేసుగా పరిగణించారు. సీఆర్పీఎఫ్ చెక్‌పోస్టుపై దాడి జరిగిన నవంబర్ 11వ తేదీన ఉమర్ ఇంటికి తిరిగి రాకపోవడంతో అర్రే గ్రామంలోని అతని కుటుంబ సభ్యులు కుల్గామ్ పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేశారు.
అనంతరం జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన పలు సీసీటీవీ కెమెరాల ఫుటేజీలను ఫోరెన్సిక్ విశ్లేషణ చేయగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
నవంబర్ 11వ తేదీన వీరిద్దరూ తమ ప్రణాళిక ప్రకారం సీఆర్పీఎఫ్ చెక్‌పోస్టుపై కాల్పులు జరిపి అక్కడి నుంచి పారిపోయారు. ఈ దాడిలో ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లు గాయపడ్డారు. దాడి అనంతరం ఉగ్రవాదులు పారిపోతున్న మార్గంలోని సీసీటీవీ కెమెరాల్లోనూ వీరిద్దరూ కలిసి పరుగెత్తుతున్న దృశ్యాలు రికార్డు అయ్యాయి.
గతంలో రాళ్లు రువ్విన కేసులో నిందితుడిగా ఉన్న ఉమర్ ఉగ్రవాదంలోకి కొత్తగా రాలేదని, గత ఐదారు నెలలుగా లష్కరే కమాండర్ లతీఫ్ భట్‌కు ఆశ్రయం కల్పిస్తూ అన్ని విధాలా సహకరిస్తున్నాడని దర్యాప్తు సంస్థలు నిర్ధారించాయి. నవంబర్ 11వ తేదీ దాడి తర్వాత తన గ్రామానికి వెళ్లకుండా ఉమర్ అధికారికంగా టీఆర్ఎఫ్ ఉగ్రవాద సంస్థలో చేరాడు.

More Stories
కోర్టు ధిక్కరణ కేసులో కేజ్రీవాల్, సిసోడియాలను మందలించిన ఢిల్లీ హైకోర్టు
ఒడిశాలో ఐదుగురు భజరంగ్ దళ్ కార్యకర్తలను విడుదల చేయండి
గూఢచర్య ప్రమాదంలో హనీ ట్రాప్‌లు ఓ భాగం మాత్రమే