సర్ తో జాబితాలో పేరు లేకపోతే ఫామ్‌ 6 దాఖలు చేసుకోవచ్చు

ప్రత్యేక విస్తృత పునర్విమర్శ (ఎస్ఐఆర్) సమయంలో తయారుచేసిన ముసాయిదా ఓటర్ల జాబితాలో తమ పేర్లు లేని ఓటర్లు, ప్రజా ప్రాతినిధ్య చట్టం, 1950లోని సెక్షన్ 31 కింద ఎలాంటి విచారణను ఎదుర్కోకుండా ఫారం 6 ద్వారా మళ్లీ దరఖాస్తు చేసుకోవచ్చని ఎన్నికల సంఘం (ఈసీ) సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చింది.  సుప్రీంకోర్టులో దాఖలు చేసిన ఒక అఫిడవిట్‌లో, గతంలో ఓటరుగా నమోదై, ముసాయిదా ఓటర్ల జాబితాలో పేరు లేని ఎవరైనా కొత్త దరఖాస్తును సమర్పించడం ద్వారా తిరిగి చేర్చమని కోరవచ్చని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. 
 
“గతంలో ఓటరుగా నమోదై, ప్రత్యేక విస్తృత పునర్విమర్శ సమయంలో తయారుచేసిన ముసాయిదా ఓటర్ల జాబితాలో పేరు లేని వ్యక్తి ఫారం 6ను మళ్లీ దాఖలు చేయవచ్చు. అటువంటి వ్యక్తి ప్రజా ప్రాతినిధ్య చట్టం, 1950లోని సెక్షన్ 31 కింద ఎలాంటి విచారణను ఎదుర్కోరు,” అని ఈసీ తన అఫిడవిట్‌లో పేర్కొంది.
గతంలో నమోదు చేసుకున్నప్పటికీ, కొత్తగా దరఖాస్తు చేసుకోవడాన్ని తప్పుడు ప్రకటనగా లేదా ద్వంద్వ నమోదుగా పరిగణించి, శిక్షార్హమైన చర్యలకు దారితీస్తుందనే భయంతో పలువురు ఓటర్లు ఫారం 6 సమర్పించడానికి వెనుకాడతున్నారని తమకు నివేదికలు అందినట్లు కమిషన్ తెలిపింది. ఈ ఆందోళనలు నిరాధారమైనవని కొట్టివేస్తూ, తిరిగి నమోదును పొందేందుకు ఫారం 6 దాఖలు చేయడం చట్ట ప్రకారం ఒక చట్టబద్ధమైన పరిష్కారమని, కేవలం దానివల్లనే నేర విచారణకు దారితీయదని ఈసీ పేర్కొంది. 
 
ఈ వివరణ ఓటర్లందరికీ చేరేలా చూసేందుకు, అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్య ఎన్నికల అధికారులకు (సీఈఓలకు) దీనిని స్థానిక భాషలలో, ముఖ్యంగా గ్రామాలు, చిన్న పట్టణాలలో విస్తృతంగా ప్రచారం చేయాలని ఆదేశించినట్లు కమిషన్ తెలిపింది. ఎస్ఐఆర్  ప్రక్రియ ఫలితంగా ముసాయిదా ఓటర్ల జాబితాల నుండి అనేక పేర్లు తొలగించిన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు.
ప్రభావిత ఓటర్లు తిరిగి జాబితాలో చేరడానికి మళ్లీ దరఖాస్తు చేసుకోవడమే ఏకైక మార్గమని, అలా చేసినందుకు వారిని శిక్షించడం ఓటర్ల జాబితాలను కచ్చితమైనవిగా, సమ్మిళితమైనవిగా చేసే లక్ష్యాన్ని దెబ్బతీస్తుందని అందులో తెలిపారు. సాంకేతిక లోపం కారణంగా గానీ, ప్రాసిక్యూషన్ భయం వల్ల గానీ ఏ అర్హత గల పౌరుడూ తన ఓటు హక్కును కోల్పోకూడదని ఈసీ నొక్కి చెప్పింది. 
 
బూత్ స్థాయి అధికారులు, జిల్లా అధికారులు, ఓటర్లకు ఈ విషయంపై అవగాహన ఉండేలా చూసేందుకు, ఈ వివరణను అధికారిక మార్గాల ద్వారా మరియు పబ్లిక్ నోటీసుల ద్వారా ప్రచారం చేస్తామని తెలిపింది. ఈసీ, ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) పనితీరును, అలాగే ఓటర్ల జాబితాల ఎస్ఐఆర్ సమయంలో తీసుకున్న నిర్ణయాలను సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లను సుప్రీంకోర్టు నవంబర్ 17న విచారించనుంది.

About The Author