వైట్ హౌస్ సమీపంలో కాల్పుల కలకలం

అమెరికా రాజధాని వాషింగ్టన్‌ డీసీలో మరోసారి కాల్పుల ఘటన కలకలం రేపింది. దేశ అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌కు సుమారు 1.6 కిలోమీటర్ల దూరంలో ఉన్న  వైట్ హౌస్‌కు అతి సమీపంలోని లోగాన్ సర్కిల్‌లో గుర్తుతెలియని దుండగుడు ఐదుగురిపై కాల్పులు జరిపాడు. కాల్పుల జరిపిన అనంతరం దుండగుడు అక్కడ నుంచి పరారయ్యాడు. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు బుల్లెట్ గాయాలకు గురికాగా, వారిలో ఒకరు మరణించినట్లు మెట్రోపాలిటన్ పోలీస్ డిపార్ట్‌మెంట్ తాత్కాలిక చీఫ్ జెఫ్రీ కారోల్ వెల్లడించారు. 
 
కాల్పులకు పాల్పడిన అనుమానితుడు సమీపంలోని ఒక అపార్ట్‌మెంట్ భవనంలోకి వెళ్లి తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. అయితే ఘటనకు సంబంధించిన కచ్చితమైన ప్రదేశం, కాల్పులకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని పోలీసు అధికారి నాథన్‌ క్లార్క్‌ వెల్లడించారు. 15వ స్ట్రీట్‌లోని 1500 బ్లాక్‌ పరిసర ప్రాంతాలకు ప్రజలు వెళ్లవద్దని పోలీసులు హెచ్చరించారు.

ఈ ప్రాంతంలో విడా ఫిట్‌నెస్‌ కేంద్రం, సెయింట్‌ ల్యూక్స్‌ ఎపిస్కోపల్‌ చర్చి, నివాస భవనాలు ఉన్నాయి. సమీపంలోనే హోల్‌ ఫుడ్స్‌ సూపర్‌ మార్కెట్‌ కూడా ఉంది. కాల్పుల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా సమీపంలోని పాఠశాలల్లో లాక్‌డౌన్‌ విధించారు. రహదారులను మూసివేసి ప్రజల రాకపోకలను నిలిపివేశారు. ఘటనా స్థలంలో సహాయం అందించడానికి తమ ఏజెంట్లను మోహరించినట్లు ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఆల్కహాల్, టొబాకో, ఫైర్‌ఆర్మ్స్ అండ్ ఎక్స్‌ప్లోజివ్స్ (ఏటిఎఫ్) కూడా ధృవీకరించింది. 

 
ఈ పరిసర ప్రాంతంలో భద్రతాపరమైన ఆందోళనలు పెరిగిన నేపథ్యంలో ఈ ఘటన జరిగింది. ఆగస్టు 2025లో, లోగన్ సర్కిల్‌లో కారును దొంగిలించే ప్రయత్నంలో, యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వ సామర్థ్య విభాగం మాజీ సభ్యుడిపై టీనేజర్ల బృందం దాడి చేసింది. ఈ ఘటన జరిగిన కొద్ది రోజుల తర్వాత, నేరాలను అరికట్టే ప్రయత్నంలో భాగంగా ట్రంప్ స్థానిక అధికారులను పక్కనపెట్టి, వాషింగ్టన్, డి.సి.పై నేరుగా ఫెడరల్ నియంత్రణను విధించి, వందలాది మంది నేషనల్ గార్డ్ సిబ్బందిని మోహరించారు. 
 
వాషింగ్టన్, డి.సి.లోని అధ్యక్ష భవన సముదాయానికి ఎదురుగా ఉన్న లాఫాయెట్ స్క్వేర్‌లో ఒక కారు సైన్‌పోస్ట్‌ను ఢీకొట్టడంతో, సోమవారం వైట్ హౌస్‌ను తాత్కాలికంగా లాక్‌డౌన్ చేశారు. ఈ ఘటన జరిగిన సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్‌లోనే ఉన్నారు. ‘ది వాషింగ్టన్ సన్’ జర్నలిస్ట్ మార్టిన్ ఆస్టర్‌ముహ్లే పంచుకున్న ఒక వీడియోలో, పొగలు వస్తున్న వాహనం నుండి డ్రైవర్ బయటకు వచ్చి భద్రతా సిబ్బందితో ఘర్షణకు దిగడం కనిపించింది. ఆ తర్వాత సీక్రెట్ సర్వీస్ అధికారులు, నేషనల్ గార్డ్ దళాలు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. 

About The Author