కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించే వార్షిక స్వచ్ఛతా సర్వేలో మహారాష్ట్రకు చెందిన నవీ ముంబయి దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ స్వచ్ఛ సర్వేక్షణ్ 2026 జాబితాలో గుజరాత్‌లోని సూరత్ రెండో స్థానంలో నిలవగా, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విజయవాడ మూడో స్థానాన్ని దక్కించుకుంది. ఢిల్లీలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము విజేతలకు ఈ స్వచ్ఛతా పురస్కారాలను ప్రదానం చేశారు.
10 లక్షల పైబడిన జనాభా కేటగిరీలో గ్రేటర్ విశాఖపట్నం దేశంలోనే క్లీనెస్ట్ సిటీగా మొదటి స్థానంలో నిలిచింది. ఈ విభాగంలో వైజాగ్ తర్వాతి స్థానాల్లో జబల్పుర్, లఖ్‌నవూ వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. 3 నుంచి 10 లక్షల జనాభా విభాగంలో మధ్య ప్రదేశ్‌లోని ఉజ్జయిన్ తొలి స్థానం దక్కించుకోగా, చండీగఢ్ రెండో స్థానంలో నిలిచింది. గుంటూరు మూడో స్థానంలో నిలిచి సత్తా చాటాయి.
గత 8 సంవత్సరాలుగా వరుసగా దేశంలోనే క్లీనెస్ట్ సిటీగా అగ్రస్థానంలో నిలుస్తూ వచ్చిన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ ఈ ఏడాది టాపర్ల జాబితాలో చోటు దక్కించుకోకపోవడం గమనార్హం. కిందటేడాది ఇండోర్అగ్రస్థానంలో నిలవగా, తర్వాతి స్థానాల్లో సూరత్, నవీ ముంబయి నిలిచాయి. ఇప్పుడు సూరత్ అదే స్థానంలో ఉండగా నవీ ముంబయి తొలి స్థానంలోకి వచ్చింది. రాజస్థాన్‌లో ఈసారి జైపూర్ అత్యంత పరిశుభ్రమైన నగరంగా గుర్తింపు పొందగా, మధ్యప్రదేశ్ నుంచి గ్వాలియర్ ఈ ఘనతను దక్కించుకుంది.
కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇతర ప్రత్యేక విభాగాల్లోనూ విజేతల్ని ప్రకటించింది. నదీ తీర పట్టణాల (క్లీనెస్ట్ రివర్‌ఫ్రంట్ టౌన్స్) కేటగిరీలో చూస్తే మధ్యప్రదేశ్‌లోని రేవా తొలి స్థానంలో నిలిచింది. ఇది 50,000 నుంచి 3 లక్షల జనాభా కేటగిరీలో ఉంది. బిలాస్‌పుర్ (ఛత్తీస్‌గఢ్) రెండో స్థానంలో, వారణాసి (ఉత్తర్‌ప్రదేశ్) మూడో స్థానంలో నిలిచాయి. ఇవి వరుసగా 3-10 లక్షల జనాభా, 10 లక్షలకు పైగా జనాభా కేటగిరీలో ఉన్నాయి.
స్వచ్ఛ తీర ప్రాంత పట్టణాల కేటగిరీలో (స్వచ్ఛ్ కోస్టల్ టౌన్స్) ఒడిశాలోని పూరీ అగ్రస్థానాన్ని దక్కించుకుంది. కేరళలోని అలప్పుళ రెండో స్థానంలో నిలవగా, మహారాష్ట్రలోని రత్నగిరి ఈ జాబితాలో మూడో స్థానాన్ని దక్కించుకుంది. ఈ మూడు నగరాలు 50,000 నుంచి 3 లక్షల జనాభా విభాగంలో ఉన్నాయి. క్లీనెస్ట్ హిమాలయన్ సిటీగా ఉత్తరాఖండ్‌లోని రుద్రపుర్ తొలి స్థానంలో నిలిచింది. ఈ హిమాలయ నగరాల్లో రెండో స్థానాన్ని జమ్మూ కైవసం చేసుకుంది.
ఇదే స్వచ్ఛ్ సర్వేక్షణ్ పురస్కారాల్లో మెంటార్ సిటీ (మార్గదర్శక నగరం) విభాగంలో గుజరాత్‌లోని అహ్మదాబాద్ తొలి స్థానంలో నిలిచింది. ఇక్కడ ఇందౌర్ రెండో స్థానంలో, ఆంధ్రప్రదేశ్‌లోని ఆధ్యాత్మిక నగరం తిరుపతి మూడో స్థానంలో నిలిచింది. స్వచ్ఛ షెహర్ జోడీ ఇనిషియేటివ్ కింద పెద్ద నగరాలతో చిన్న పట్టణాలను అనుసంధానించారు.
ఇందులో భాగంగా సనంద్ నగరాన్ని అహ్మదాబాద్‌తో, దేపాల్పుర్ను ఇందౌర్‌తో, ఆంధ్రప్రదేశ్‌లోని కుప్పం పట్టణాన్ని తిరుపతితో మెంటీ సిటీస్‌గా (మార్గదర్శకత్వం పొందే నగరాలు) జత చేశారు. అత్యుత్తమ పనితీరు కనబరిచిన నగరాల విభాగంలో హరియాణాలోని కర్నాల్- రాష్ట్రపతి పురస్కారాన్ని అందుకుంది. అర్బన్ శానిటేషన్ స్టాండర్డ్స్ కింద అద్భుత ప్రతిభ కనబర్చినందుకు ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పుర్, బిలాస్‌పుర్, బిల్హా నగరాలకు ప్రత్యేక గుర్తింపు దక్కింది.

More Stories
కాంగ్రెస్ నిర్వహిస్తున్న ‘భారత్ సమ్మిట్’ `భారత్ వ్యతిరేక సమ్మిట్’
దీపావళి కాలుష్యం కాలక్రమేణా తొలగిపోతుంది
ప్రపంచ అశాంతి నడుమ మానవాళికి భారత్ మార్గదర్శనం