తెలంగాణ వ్యాప్తంగా నషా ముక్త్ భారత్ అభియాన్‌

తెలంగాణ వ్యాప్తంగా నషా ముక్త్ భారత్ అభియాన్‌  విస్తృతంగా నిర్వహిస్తామని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీలో గల ఆంధ్ర మహిళా సభ ఉమెన్స్ కాలేజీలో అలై బలై ఫౌండేషన్ అలాగే వీ నెట్ స్వచ్చంద సంస్థల సంయుక్త ఆద్వర్యంలో  జరిగినన షా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 

ఈ సమావేశంలో మాదకద్రవ్యాల నిర్మూలన కోసం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత స్థాయిలో కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమాల అమలు, పర్యవేక్షణ కోసం ఒక స్టీరింగ్ కమిటీని కూడా ఏర్పాటు చేయాలనీ నిర్ణయించారు.  ప్రస్తుతం మాదకద్రవ్యాల వినియోగం విద్యార్థుల నుంచి ప్రారంభమై గ్రామీణ ప్రాంతాల వరకు విస్తరిస్తూ సమాజానికి తీవ్ర ఆందోళన కలిగిస్తోందని దత్తాత్రేయ తెలిపారు.
 
యువత మత్తు పదార్థాలకు బానిసలుగా మారడం వారి భవిష్యత్తుతో పాటు కుటుంబాలు, సమాజంపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోందని ఆయన హెచ్చరించారు. ఈ సమస్యను కేవలం ఉపన్యాసాలు, అవగాహన సమావేశాలకే పరిమితం చేయకుండా క్షేత్రస్థాయిలో కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించామని తెలిపారు. మాదకద్రవ్యాల ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాలు, గ్రామాలను గుర్తించి అక్కడి ప్రజలతో, బాధితులతో నేరుగా మాట్లాడి వారిలో మార్పు తీసుకురావడానికి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. 

అలాగే మాదకద్రవ్యాల వ్యసనం నుంచి బయటపడేందుకు చికిత్స పొందుతున్న వారిని ప్రోత్సహించేందుకు పునరావాస కేంద్రాలను సందర్శించి, వారికి అవసరమైన మార్గదర్శకత్వం, మానసిక ధైర్యాన్ని అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర మహిళా సభ అధ్యక్షులు, మాజీ ఐఏఎస్ అధికారి డాక్టర్ డి. చక్రపాణి, ప్రొఫెసర్ మురళీ మనోహర్, ప్రొఫెసర్ రాజిరెడ్డి, ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ఆకెళ్ల రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.

About The Author