రాజీవ్ గాంధీ ఫౌండేషన్ విదేశీ నిధులు, విరాళాల ద్వారా నడుస్తోందని బిజెపి అధ్యక్షుడు నితిన్ నబిన్ ఆరోపించారు. ఇతర దేశాల్లో జరిగిన పరిణామాలను అనుకరిస్తూ, భారతదేశంలో ‘గుంపుల ఆధారిత వ్యవస్థ’ను సృష్టించేందుకు జరుగుతున్న ప్రయత్నాలు ఎప్పటికీ విజయవంతం కావని ఆయన స్పష్టం చేశారు. ఓ వార్తాసంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో నబిన్ మాట్లాడుతూ, దేశంలో ఇటువంటి వ్యవస్థను తీసుకురావడానికి ప్రజలను సమీకరించాలని ప్రయత్నిస్తున్న వారి కుట్రలు చివరికి విఫలమవుతాయని తెలిపారు.
“నేను మొదటే చెప్పినట్లుగా, ఇతర దేశాల్లో జరిగినట్లుగా ఇక్కడ కూడా ప్రజలను గుంపులుగా సమీకరించి ‘గుంపుల ఆధారిత వ్యవస్థ’ను సృష్టించాలని ప్రయత్నించేవారికి ఎప్పటికీ విజయం దక్కదు” అని బీజేపీ అధ్యక్షుడు పేర్కొన్నారు. దేశంలోని యువత అభివృద్ధికి మద్దతు ఇస్తుందని, భారతీయ సాంస్కృతిక విలువల పట్ల నిబద్ధతతో ఉందని నబిన్ నొక్కి చెప్పారు. యువత దేశ భద్రతను కాపాడటంలో, సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడంలో కూడా అంతే అంకితభావంతో ఉన్నారని ఆయన పేర్కొన్నారు.
“ఈ దేశ యువత ఎప్పుడూ అభివృద్ధి వైపే నిలబడ్డారని నేను నమ్ముతాను. వారు మన దేశ సాంస్కృతిక విలువలతో లోతుగా ముడిపడి ఉన్నారు. అభివృద్ధి బాటలో పయనిస్తూనే, వారు దేశ భద్రత మరియు సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడటంలో పూర్తి నిబద్ధతతో ఉన్నారు. ఎవరైనా యువతను తప్పుదోవ పట్టించి, తప్పుడు మార్గంలో నడిపించగలమని భావిస్తే, అది వారి పొరపాటు మాత్రమే; అది ఎప్పటికీ జరగదు” అని ఆయన చెప్పారు.
కాంగ్రెస్ నాయకత్వం జాతీయ సమైక్యత గురించి మాట్లాడుతుండటాన్ని ప్రశ్నించిన నబిన్, అదే సమయంలో వారు ‘తుక్డే-తుక్డే గ్యాంగ్’తో సంబంధం కలిగి ఉన్నారని ఆరోపించారు. “వారు ఇలాంటి ప్రయత్నం చేసిన ప్రతిసారీ ఘోర పరాజయాన్ని చవిచూశారు. ‘తుక్డే-తుక్డే గ్యాంగ్’తో చేతులు కలిపిన వారు దేశాన్ని ‘ఏకం’ చేస్తామని ఎలా చెప్పగలరు? యువత తమ వెంటే ఉంటారని ఎలా ఆశించగలరు?” అని ప్రశ్నించారు.
అంతేకాకుండా, విదేశీ నిధులు. విరాళాలతో నడుస్తున్న ‘రాజీవ్ గాంధీ ఫౌండేషన్’ను నడిపేవారు, ఈ దేశ రాజకీయ గమనాన్ని నిర్దేశించగలమని ఎలా ఆశించగలరు? ఇది అసాధ్యం? అని విస్మయం వ్యక్తం చేశారు. రాజీవ్ గాంధీ ఫౌండేషన్ భారతదేశంలో ఒక స్వచ్ఛంద సంస్థగా నమోదు చేశారు. అక్టోబర్ 2022లో, అంతర్-మంత్రిత్వ కమిటీ జరిపిన విచారణ అనంతరం, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ ఫౌండేషన్‌కు చెందిన ‘ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్’ (ఎఫ్ సి ఆర్ ఎ) లైసెన్స్‌ను రద్దు చేసింది.

More Stories
నక్సల్స్ అంతం.. దిమాగీ నక్సల్స్ రాజకీయ పార్టీల్లో చొరబడ్డారు
పరారీలో ఉన్న పంజాబ్ గ్యాంగ్‌స్టర్ అఫ్రిదీ ఇథియోపియా నుంచి పట్టివేత
ఎమర్జెన్సీని సమర్ధించుకొనే ప్రయత్నంలో సోనియా గ్రంధం