ఒకవేళ ఎవరైనా పాలన మార్పు అనే రాజకీయ లక్ష్యాన్ని అనుసరిస్తే, ఎన్నికల ద్వారా ప్రభుత్వాలు మారగల ప్రజాస్వామ్య దేశంలో అది వేరే విషయమని, . అయితే, అటువంటి లక్ష్యాలను సాధించడానికి సమాజంలో అశాంతిని సృష్టించడం, విభజనలు కలిగించడం లేదా హింసకు పాల్పడటం సమాజ ప్రయోజనాలకు మంచిది కాదని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబాలే స్పష్టం చేసారు.
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో మూడు రోజులపాటు జరిగిన ‘అఖిల భారత కార్యకారి మండలి’ సమావేశం ముగింపు సందర్భంగా బుధవారం మీడియాతో మాట్లాడుతూ అరాచక శక్తులు ప్రజలను రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నాయని, అటువంటి శక్తులు దేశంలోపల, వెలుపల కూడా పనిచేయగలవని ఆయన హెచ్చరించారు. ప్రపంచంలోని ఇతర ప్రాంతాల అనుభవాలను ప్రస్తావిస్తూ, ఈ పరిణామాలలో కొన్నింటి వెనుక కుట్ర కోణం ఉన్నట్లు కనిపిస్తోందని ఆయన ఆరోపించారు.
అయితే, యువత ఆకాంక్షలను, ఆందోళనలను కూడా సమాజం, ప్రభుత్వం అర్థం చేసుకుని, పరిష్కరించాల్సిన అవసరం ఉందని హోసబాలే నొక్కి చెప్పారు. యువ తరంతో సంభాషణను కొనసాగించాలని సంఘ్ విశ్వసిస్తుందని ఆయన తెలిపారు. ఆర్ఎస్ఎస్ సమావేశంలో అరాచక శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అంశంపై కూడా చర్చ జరిగిందని చెబుతూ ఈ అంశానికి సంబంధించి ఆయన మూడు కోణాలను వివరించారు.
మొదటిది, యువత నిజమైన సమస్యలు, ఆకాంక్షలను గుర్తించాలి. తమ డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచే పూర్తి హక్కు వారికి ఉంది. అయితే, అటువంటి డిమాండ్లను నిర్మాణాత్మక, వ్యవస్థీకృత మార్గాల ద్వారా వ్యక్తీకరించి, సాధించుకోవాలి. రెండవది, అరాచక శక్తులు సమాజంపై ప్రభావం చూపకుండా లేదా జాతీయ చర్చలను శాసించకుండా ఉండేలా ప్రయత్నాలు చేయాలి. మూడవదిగా, సమాజంలోని సజ్జన శక్తి పాత్రను హోసబాలే నొక్కి చెప్పారు.
కేవలం తమ ఇళ్లకే పరిమితమై మంచి వ్యక్తులుగా ఉండటం సరిపోదని, నిర్మాణాత్మక సామాజిక విలువలను విశ్వసించే ప్రజలు కూడా గళం విప్పి, ప్రజా జీవితంలో చురుకుగా పాల్గొనాలని ఆయన సూచించారు. సామాజిక స్పృహ, సదుద్దేశం ఉన్న వ్యక్తులు నిష్క్రియంగా ఉండటం తరచుగా అరాచక శక్తులకు ప్రోత్సాహాన్ని ఇస్తుందని ఆయన ఈ సందర్భంగా హెచ్చరించారు.
ప్రశ్నలు లేవనెత్తడం దేశ వ్యతిరేకం కాదు
ఈ విషయమై సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ భగవత్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూను ప్రస్తావిస్తూ, ప్రశ్నలు లేవనెత్తడం లేదా అసంతృప్తి వ్యక్తం చేయడం అంటే యువత దేశానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని అర్థం కాదని ఆయన పేర్కొన్నారు. దానికి బదులుగా, కొత్త తరంతో సానుకూల సంభాషణను కొనసాగించడం, వారి ఆందోళనలను అర్థం చేసుకోవడం, వారికి వివిధ సమస్యలను వివరించడం అవసరమని తెలిపారు. ప్రతి తరం యువత ప్రస్తుత పరిస్థితుల పట్ల కొంత అసంతృప్తిని అనుభవిస్తారని పేర్కొంటూ తన యవ్వనంలో జేపీ ఉద్యమంలో పాల్గొన్న విషయాన్ని గుర్తుచేసుకుంటూ, యువత తరచుగా ఉద్యమాలు, నిరసనల ద్వారా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తారని హోసబాలే తెలిపారు.
అలాంటి భావాలను నిర్మాణాత్మకంగా మళ్లించాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు. సమాజం, పరిపాలన పట్ల యువతకు నిజమైన ఆందోళనలు ఉండవచ్చు, కానీ వారి ఆగ్రహాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేయడం, సామాజిక విభజనలు సృష్టించడం లేదా హింసను ప్రోత్సహించడం వంటి ప్రయత్నాలు ఆమోదయోగ్యం కావని తేల్చి చెప్పారు. సంఘ్ అటువంటి ప్రయత్నాలను వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు.
యువత మనస్తత్వాన్ని రెండు కోణాల నుండి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. మొదటిది, వారి నిజమైన ఆందోళనలు, ఆకాంక్షలను విని, వాటిని పరిష్కరించాలి. యువత తమను లేదా సమాజాన్ని ప్రభావితం చేసే సమస్యలపై ప్రశ్నలు లేవనెత్తవచ్చు, వారి అభిప్రాయాలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలి. రెండవది, వారి ప్రతిభ, నైపుణ్యాలు, సేవా స్ఫూర్తిని నిర్మాణాత్మక కార్యకలాపాల వైపు మళ్లించాలి.
విభిన్న నేపథ్యాలు, ప్రాంతాలకు చెందిన యువత ఒకరితో ఒకరు కలిసి, జాతీయ ఐక్యత, సామాజిక సేవ కోసం పనిచేసేలా ప్రోత్సహించాలని ఆయన సూచించారు. సంఘ్ గతంలో చేపట్టిన ‘సర్హద్ కో ప్రణామం’ కార్యక్రమాన్ని ఉదాహరణగా చూపుతూ, దేశంలోని వివిధ ప్రాంతాల నుండి కళాశాల విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని భారత్ సరిహద్దు ప్రాంతాలను సందర్శించారని హోసబాలే తెలిపారు.
కేరళ, బీహార్, రాజస్థాన్‌తో పాటు ఇతర ప్రాంతాల యువకులు అస్సాంలోని సరిహద్దులకు ప్రయాణించి ఒకరితో ఒకరు సంభాషించుకున్నారు. ఇలాంటి కార్యక్రమాలకు యువత నుండి ఉత్సాహభరితమైన స్పందన లభించిందని ఆయన అన్నారు. సామాజిక సేవను ప్రోత్సహించే, జాతీయ ఐక్యతను బలోపేతం చేసే సానుకూల కార్యక్రమాలతో వారిని అనుసంధానించాలన సంఘ్ విశ్వసిస్తోందని ఆయన వివరించారు.
వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కొనసాగాల్సిందే
రిజర్వేషన్ల చుట్టూ జరుగుతున్న చర్చపై అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, రిజర్వేషన్లను రద్దు చేయడానికి సంఘ్ వైఖరి అనుకూలంగా లేదని హోసబాలే స్పష్టం చేశారు. వివక్షకు గురై, తత్ఫలితంగా సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన సమాజంలోని వర్గాలకు రిజర్వేషన్లు కొనసాగాల్సిందే అని ఆయన తేల్చి చెప్పారు. చారిత్రక, సామాజిక వివక్షల వల్ల తలెత్తే అసమానతలు, వ్యత్యాసాలు తొలగిపోయే వరకు రిజర్వేషన్ల వ్యవస్థ కొనసాగాలని ఆయన చెప్పారు. వివక్షకు గురైన వారు సమాజంలో సమానత్వం సాధించామని భావించే వరకు వారికి అటువంటి మద్దతు కొనసాగాలని ఆయన తెలిపారు.
ఇతర దేశాల్లోని ఇలాంటి ఏర్పాట్ల గురించి ప్రస్తావిస్తూ, అమెరికాలో ‘అఫిర్మేటివ్ యాక్షన్’ వంటి విధానాలు ఉన్నాయని హోసబాలే పేర్కొన్నారు. భారతదేశంలో చారిత్రక, సామాజిక అసమానతలను పరిష్కరించడానికి ప్రత్యేకంగా ‘రిజర్వేషన్’ వ్యవస్థ ఉంది. రిజర్వేషన్ ఫలాలు నిజంగా అర్హులైన వారందరికీ అందాలని ఆయన చెప్పారు.
ఒకవేళ అర్హులైన కొన్ని వర్గాలకు ప్రయోజనాలు అందుతూ, మరికొందరు వాటికి దూరమవుతుంటే, అటువంటి సందర్భాల్లో అవసరమైన మెరుగుదలలను పరిశీలించవచ్చని తెలిపారు. అయితే, ఇటువంటి మార్పులు చేపట్టేటప్పుడు, ప్రస్తుతం రిజర్వేషన్ ప్రయోజనాలను పొందుతున్న వర్గాలతో, ప్రజలతో సంప్రదింపులు జరపడం చాలా అవసరం అని స్పష్టం చేశారు.

More Stories
అగ్ని వీరులకు రెండేళ్లు పొడిగింపు
రాహుల్ చర్చకు అమిత్ షా సవాల్ స్వీకరించరా?
ఏపీ పురపాలక ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల ప్రభంజనం