ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై “అసభ్యకరమైన, అభ్యంతరకరమైన” వ్యాఖ్యలు చేసినందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ, బీజేపీ నేడు అన్ని రాష్ట్రాల్లోని తమ పార్టీ ప్రధాన కార్యాలయాల వద్ద నిరసనలు చేపట్టింది. ఈ వివాదం ఆదివారం పాట్నాలో జరిగిన ఒక కార్యక్రమంలో మొదలైంది. అక్కడ ఒక వ్యక్తి “ప్రధాని ఎక్కడికీ వెళ్లరు” అని వ్యాఖ్యానించగా, దానికి సమాధానంగా ఖర్గే “మోదీ కా బాప్ భీ జాయేగా” (మోదీ తండ్రి కూడా వెళ్ళిపోతారు) అని చెప్పుకొచ్చారు.
ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్రంగా మండిపడగా, గతంలో సోనియా గాంధీని, స్వయంగా ఖర్గేను ఉద్దేశించి అభ్యంతరకరమైన పదజాలం వాడినప్పుడు ఎందుకు ఎవరూ స్పందించలేదని కాంగ్రెస్ ప్రశ్నించింది. బీహార్లో, పెద్ద సంఖ్యలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఖర్గేకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రదర్శన నిర్వహించారు. వారు ఖర్గే దిష్టిబొమ్మను దహనం చేశారు.
జమ్మూలో కూడా బీజేపీ కార్యకర్తలు ఖర్గే పోస్టర్లను దగ్ధం చేసి నిరసన తెలిపారు. బెంగళూరులోని ఫ్రీడమ్ పార్క్లో బీజేపీ భారీ నిరసన చేపట్టి, ఖర్గే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తోంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ, ప్రధాని మోదీ దివంగత తండ్రి గురించి చేసిన వ్యాఖ్యలు తనను తీవ్రంగా కలచివేశాయని, బాధించాయని పేర్కొన్నారు.
“ఇది చాలా బాధాకరం… ఈ మొత్తం వ్యవహారంలో అత్యంత దిగ్భ్రాంతికరమైన విషయం ఏమిటంటే, ఈ వ్యాఖ్యలు ఏదో ఒక సాధారణ కాంగ్రెస్ కార్యకర్త లేదా యువ నాయకుడు చేయలేదు; దేశంలోనే అత్యంత పురాతన రాజకీయ పార్టీ అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి చేశారు” అని రాజ్నాథ్ సింగ్ విస్మయం వ్యక్తం చేశారు.
“కాంగ్రెస్ పార్టీ అంతటితో ఆగలేదు; ఖర్గే చేసిన వ్యాఖ్యలను సమర్థించుకుంటూ ప్రజల మనోభావాలను దెబ్బతీస్తోంది. తమ తప్పును అంగీకరించి క్షమాపణ చెప్పే బదులు, కాంగ్రెస్ పార్టీ ఈ వ్యాఖ్యలను సమర్థించుకోవడంలో నిమగ్నమై ఉంది” అని రక్షణ మంత్రి విమర్శించారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని ఉద్దేశించి వ్యాఖ్యానిస్తూనే, అదే సమయంలో ఖర్గేపై కూడా విమర్శలు గుప్పించారు.
రాహుల్ గాంధీకి పరిణతి లేదని బీజేపీకి ముందే తెలుసని, అయితే ఇప్పుడు ఆయన సాంగత్యం వల్ల పార్టీలోని ఇతరులకు కూడా అదే లక్షణాలు అంటుకున్నట్లు కనిపిస్తోందని ఆయన ఎద్దేవా చేశారు.
“…వారి పార్టీలోని ప్రతి ఒక్కరూ అపరిపక్వంగా, నిరాశతో, నిస్పృహలతో తయారయ్యారు. ఇంత నీచ స్థాయికి దిగజారి, వారు భారతదేశ సంస్కృతిని నాశనం చేస్తున్నారు. ప్రజా జీవితంలో లేని ఏ నాయకుడి లేదా వ్యక్తి దివంగత తల్లిదండ్రుల పేర్లను ప్రస్తావించడం, రాహుల్ గాంధీ సాంగత్యం వల్ల కలిగే నిరాశను, ప్రభావాన్ని చూపిస్తుంది,” అని జోషి తెలిపారు. ఖర్గే ఇలా చేయడానికి చాలా కాలం ముందే సోనియా గాంధీ కూడా ఇలాంటి భాషనే ఉపయోగించారని ఆయన గుర్తు చేశారు.
కాంగ్రెస్ అధినేత కుమారుడు, కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే ఎదురుదాడి చేస్తూ, బీజేపీకి అనవసరమైన విషయాలను సమస్యలుగా మార్చడం ఇష్టమని ధ్వజమెత్తారు. “ఈ సంస్కారవంతులు గతంలో మోదీ, షా చెప్పిన విషయాలను మర్చిపోయారు. మనం వారి నుండి సంస్కారం నేర్చుకోవాల్సిన అవసరం లేదు,” అని ఆయన స్పష్టం చేశారు.
ప్రతిపక్ష కూటమి ఇండియా మిత్రపక్షం, ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా, ఖర్గే నుండి ఇలాంటి ప్రవర్తన ఊహించలేదని – “దీనిపై రెండు అభిప్రాయాలు లేవు” అని అంగీకరిస్తూనే, ఈ ఆగ్రహం పక్షపాతంగా ఉండకూడదని పేర్కొన్నారు. “గతంలో బీజేపీ నాయకులు సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గేలపై వ్యాఖ్యానించినప్పుడు మీడియాలో గానీ, ఇతర పార్టీలలో గానీ ఇంతటి ఆగ్రహాన్ని నేను చూడలేదు,” అని ఝా తెలిపారు.
ఖర్గే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ బీజేపీ సమన్వయంతో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ఢిల్లీ, ముంబై, పాట్నా, రాంచీ, కోల్కతా, హైదరాబాద్ లతోసహా అన్ని ప్రధాన కేంద్రాలలో నిర్వహిస్తున్నారు.

More Stories
బెయిల్పై వచ్చిన 22 ఏళ్ల ఇంజనీర్ టైగర్ ష్రాఫ్పై దాడి
అమిత్ షాపై చేసిన వ్యాఖ్యల పరువు నష్టం కేసులో రాహుల్ కు ఊరట
ప్రధాని మోదీపై ఖర్గే ‘బాప్’ (తండ్రి) వ్యాఖ్యలతో దుమారం