* చిలుకూరు మృగవాణి పార్కులో రాతి గాడులు, వర్ణచిత్రాలు!
హైదరాబాద్కు సమీపంలోని చిలుకూరు మృగవాణి జాతీయ పార్కులో చరిత్ర పూర్వ మానవుల జీవనానికి సంబంధించినవిగా భావిస్తున్న అరుదైన ఆనవాళ్లు వెలుగులోకి వచ్చాయి. నేషనల్ పార్కులోని బండ జువ్వి వాచ్ టవర్ సమీపంలో రాతిపై 4 గాడులను గుర్తించగా, మరో ప్రాంతంలో కాషాయ వర్ణంతో గీసిన రాతి చిత్రాలు కనిపించాయి. ఈ గుర్తులు వేల ఏళ్ల క్రితం మనుషుల కార్యకలాపాలకు సంబంధించినవై ఉండొచ్చని చరిత్రకారుడు డాక్టర్ ద్యావనపల్లి సత్యనారాయణ అభిప్రాయం వ్యక్తం చేశారు.
అయితే వీటి కాలం, అసలు ఉపయోగం, చారిత్రక ప్రాధాన్యాన్ని నిర్ధారించడానికి శాస్త్రీయ పరిశోధనలు అవసరమని పురావస్తు నిపుణులు భావిస్తున్నారు.
రంగారెడ్డి జిల్లా పరిధిలోని చిలుకూరు మృగవాణి జాతీయ పార్కులో బండ జువ్వి వాచ్ టవర్ సమీపంలో ఈ గాడులను గుర్తించారు. అటవీ ప్రాంతంలో సఫారీకి వెళ్లిన చరిత్రకారుడు డాక్టర్ ద్యావనపల్లి సత్యనారాయణ వీటిని పరిశీలించారు. రంగారెడ్డి జిల్లా అటవీశాఖ పరిపాలనాధికారి బి. ఆనంద్ కుమార్ అందించిన సమాచారం ఈ పరిశీలన చేశారు.
రంగారెడ్డి జిల్లా పరిధిలోని చిలుకూరు మృగవాణి జాతీయ పార్కులో బండ జువ్వి వాచ్ టవర్ సమీపంలో ఈ గాడులను గుర్తించారు. అటవీ ప్రాంతంలో సఫారీకి వెళ్లిన చరిత్రకారుడు డాక్టర్ ద్యావనపల్లి సత్యనారాయణ వీటిని పరిశీలించారు. రంగారెడ్డి జిల్లా అటవీశాఖ పరిపాలనాధికారి బి. ఆనంద్ కుమార్ అందించిన సమాచారం ఈ పరిశీలన చేశారు.
తాజాగా గుర్తించిన నాలుగు గాడుల్లో ఒక్కొక్కటి సుమారు అడుగు పొడవు, రెండు నుంచి నాలుగు అంగుళాల లోతు ఉన్నట్లు తెలుస్తోంది. లోయలు కనిపించే పీఠభూమి తరహా రాతి ఉపరితలంపై, నీటి వనరులకు సమీపంలో ఇవి ఉన్నాయి. ఈ గాడులను గతంలో రాతి గొడ్డళ్లు వంటి పనిముట్లను సానబెట్టడానికి, రాతి ఆయుధాలను మెరుగుపరచడానికి ఉపయోగించి ఉండవచ్చని సత్యనారాయణ అభిప్రాయపడ్డారు. ఈ గుర్తులు కొత్తరాతియుగం (నియోలిథిక్ కాలం) నాటి కార్యకలాపాలకు సంబంధించినవై ఉండవచ్చన్న ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
ఆ కాలాన్ని సుమారు క్రీస్తుపూర్వం ఐదో సహస్రాబ్దితో అనుసంధానించే అవకాశం ఉందని భావిస్తున్నప్పటికీ.. ఈ గాడులకు అదే కాలానికి చెందినవని చెప్పడానికి ఇప్పటివరకు ఎలాంటి శాస్త్రీయ నిర్ధారణ లేదు. పురావస్తు పరిశోధనల ద్వారానే వీటి వయస్సు, ప్రయోజనాన్ని స్పష్టంగా తెలుసుకోవచ్చని చరిత్రకారులు చెబుతున్నారు. బండ జువ్వి వాచ్ టవర్ నుంచి సుమారు కిలోమీటరు దూరంలో ఉన్న ఫారెస్ట్ ట్రెక్ పార్కు సమీపంలో మరో ఆసక్తికరమైన ప్రదేశం ఉంది.
అక్కడ పాము పడగను పోలిన ఆకారంలో ఉన్న శిలపై కాషాయ వర్ణంతో గీసిన చిత్రాలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రాల్లో తాబేలు ఆకారం, జంతువుకు సంబంధించిన ఒక రూపం, వేట దృశ్యాలు, బాణాలు, అంచుల వద్ద అలంకరణ తరహా గీతలు ఉన్నట్లు పరిశీలకులు వివరించారు. ఒక గుర్తును సమూహంలోని సామాజిక ఉపవిభాగాన్ని సూచించే చిహ్నంగా కూడా అర్థం చేసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే చిత్రాల్లోని రూపాలు దేనిని సూచిస్తున్నాయో.. వాటి వెనుక ఉన్న ఉద్దేశం ఏంటో ఇంకా నిర్ధారణ కాలేదు.
రాతి గాడులు, ఈ వర్ణచిత్రాలు ఒకే కాలానికి చెందినవావాటికి చెందినవా? వాటిని రూపొందించినవారు ఒకే సమూహానికి చెందినవారా? అనే ప్రశ్నలకు కూడా ప్రస్తుతం స్పష్టమైన సమాధానాలు లేవు. ఈ రెండు ప్రదేశాల మధ్య సంబంధాన్ని నిర్ధారించాలంటే చిత్రాల శైలి, రంగు పదార్థాలు, రాతి నిర్మాణాలు, పరిసరాల్లో లభించే ఇతర ఆధారాలను శాస్త్రీయంగా పరిశీలించాల్సి ఉంటుందని పురావస్తు నిపుణులు పేర్కొంటున్నారు. ఈ ప్రాంతంలో కనిపించిన ఆనవాళ్ల మూలాలను గుర్తించేందుకు తెలంగాణ పురావస్తు, మ్యూజియంల శాఖ సమగ్ర సర్వే చేపట్టాలని డాక్టర్ ద్యావనపల్లి సత్యనారాయణ కోరారు.
రాతి గాడులు, వర్ణచిత్రాల పరిశీలనతోపాటు సమీపంలోని సహజ శిలా నిర్మాణాలు, రాతి ఆశ్రయ ప్రాంతాలను కూడా అధ్యయనం చేయాలని సూచించారు. అక్కడ రాతి పనిముట్లు, కుండల ముక్కలు, ఇతర శిలా గుర్తులు, మానవ కార్యకలాపాలకు సంబంధించిన ఆధారాలు లభిస్తాయేమో పరిశీలించాలని పేర్కొన్నారు. పురావస్తు శాఖ, అటవీ శాఖ సమన్వయంతో పనిచేస్తే ఈ ప్రాంతంలోని చారిత్రక ఆనవాళ్లను నమోదు చేయడంతోపాటు వాటిని సంరక్షించేందుకు వీలవుతుందని అభిప్రాయపడ్డారు.
హైదరాబాద్ నగరానికి సమీపంలోనే ఇలాంటి గుర్తులు బయటపడటం ఆసక్తిని కలిగిస్తోంది. వీటి ప్రాచీనత శాస్త్రీయంగా నిర్ధారణ అయితే ఈ ప్రాంతంలో చరిత్ర పూర్వ మానవుల సంచారం, పనిముట్ల తయారీ, వినియోగం, కళాత్మక వ్యక్తీకరణ వంటి అంశాలను అర్థం చేసుకోవడానికి కొత్త ఆధారాలు లభించవచ్చని చెబుతున్నారు.
అయితే రాతిపై గాడులు కనిపించాయనే కారణంతోనే అవి ఆది మానవులు రూపొందించినవని, రాతి చిత్రాలు నిర్దిష్ట కాలానికి చెందినవని ఇప్పుడే తేల్చలేం. పురావస్తు సర్వే, అవసరమైన శాస్త్రీయ పరీక్షలు, పరిసరాల్లో లభించే ఆధారాల సమగ్ర అధ్యయనం కీలకం కానుంది. ఈ పరిశోధనలు పూర్తయిన తర్వాతే మృగవాణి జాతీయ పార్కులోని ఈ ఆనవాళ్ల అసలు వయస్సు, ప్రయోజనం, సాంస్కృతిక ప్రాధాన్యంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

More Stories
కాశ్మీర్లో బిఎంఎస్ మొదటి కార్యాలయం పుల్వామాలో పారంభం
సాంస్కృతిక ఏకత్వాన్ని ప్రతిబింబించే ‘అలయ్ బలయ్’
రష్యా-ఉక్రెయిన్ పోరుపై వచ్చే నెల త్రైపాక్షిక భేటీ?