2028లో బిల్లు ఆమోదం పొందిన పక్షంలో ఆరు నెలల్లో సన్నాహాలు పూర్తి చేయాల్సి ఉంటుందని ఎన్నికల సంఘం పేర్కొంది. జమిలి ఎన్నికల ద్వారా రూ.7 లక్షల కోట్లు ఆదా చేయవచ్చని ప్రభుత్వం వాదిస్తోంది. అయితే, మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) ఎస్వై ఖురేషీ అభిప్రాయం ప్రకారం దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి కావడానికి రెండు నుంచి మూడు సంవత్సరాలు పడుతుంది. ఏదైనా మంత్ర దండం ఉంటే తప్ప, ఆ లోపల సాధ్యం కాదని ఆయన వ్యాఖ్యానించారు.
జేపీసీలో మొత్తం 41 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో 27 మంది లోక్సభ ఎంపీలు, 12 మంది రాజ్యసభ ఎంపీలు, ఇద్దరు ప్రత్యేక ఆహ్వానితులు ఉన్నారు. నివేదికను ఎప్పుడు సమర్పిస్తారని ప్రశ్నించగా నిర్దిష్ట కాలపరిమితి ఏమీ లేదు. క్షుణ్ణంగా చర్చించి, కమిటీ సభ్యులు అంగీకరించిన తర్వాతే మేము నివేదికను సమర్పిస్తాము అని చౌదరి తెలిపారు.
కమిటీ తాను సందర్శించే ప్రతి రాష్ర్టానికి సంబంధించి ఒక సమగ్ర అజెండాను సిద్ధం చేసుకుంటుంది. కనీసం 500 మంది వ్యక్తులతో సమావేశమవుతుంది. కమిటీ సభ్యులను కలవదలచిన వారికి ముందే సమాచారం అందిస్తారు. గవర్నర్లు, ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, స్పీకర్లు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, సీనియర్ అధికారులు, ప్రతిపక్ష పార్టీలు, పద్మ భూషణ్ గ్రహీతలు, మీడియా ప్రతినిధులు, పౌర సమాజ సభ్యులు, అసోచామ్, ఫిక్కీ వంటి వ్యాపార సంఘాల ప్రతినిధులు వంటి వారిని కమిటీ కలుసుకుంటుంది.
ఏయే రాష్ర్టాలు అంగీకరిస్తున్నాయో, ఏవి అంగీకరించడం లేదో తాము పరిశీలిస్తున్నట్టు చౌదరి చెప్పారు. అంగీకరించిన రాష్ర్టాల శాసనసభల పదవీకాలం ముగిసేలా చేసి 2029లో ఎన్నికలు నిర్వహించేలా చేస్తాము. మిగిలిన రాష్ర్టాలను 2034 నాటికి ఈ నిబంధన పరిధిలోకి తీసుకువస్తాము. అప్పటికి అవి దీనికి కట్టుబడి ఉండాల్సి ఉంటుంది. దీనికి పరిష్కారం రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లోనే ఉంది. అవి అంగీకరిస్తే 2029లో లోక్సభ, శాసనపభ ఎన్నికలను కలిపి నిర్వహించవచ్చు అని ఆయన తెలిపారు.
22 రాష్ర్టాల్లో బీజేపీ లేదా ఎన్డీయే ప్రభుత్వాలు ఉన్నాయి. తాము అధికారంలో ఉన్న రాష్ర్టాల మద్దతును పొందగలమని బీజేపీ ధీమాగా ఉందని, మిగిలిన రాష్ర్టాలను ఒప్పించడం కష్టతరంగా మారుతున్నదని భావిస్తున్నారు. ఒక అవకాశం ఏమిటంటే 2029 నాటికి బీజేపీ పాలిత 22 రాష్ర్టాలను ఇందులో భాగస్వాములను చేసి మిగిలిన రాష్ర్టాలను 2034లో చేర్చుకోవడం.
ఒక దేశం, ఒక ఎన్నికలకు ఉత్తరాఖండ్ మద్దతు ఇస్తున్నట్టు బీజేపీ వర్గాలు తెలిపాయి. వేర్వేరుగా ఎన్నికలు నిర్వహించడం వల్ల, ముఖ్యంగా మారుమూల గ్రామాలకు చేరుకోవడంలో పెద్ద రవాణా సవాళ్లు ఎదురవుతాయని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. కొన్ని గ్రామాలకు చేరుకోవడానికి రెండు నుంచి మూడు రోజులు పడుతుందని, తిరిగి రావడానికి కూడా అంతే సమయం పడుతుందని, ఎన్నికలను కలిపి నిర్వహించడం ప్రయోజనకరంగా ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది.
గుజరాత్లోని బీజేపీ ప్రభుత్వం, సీఐఐ, అసోచామ్ వంటి సంస్థలు ఈ ప్రతిపాదనను సమర్థించాయి. మహారాష్ట్ర, హర్యానా, గోవా దీనికి సానుకూలంగా స్పందించాయి. కాంగ్రెస్ పాలిత హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ప్రతికూల వ్యాఖ్యలు చేయలేదు. పంజాబ్ కూడా ప్రధాన అభ్యంతరాలు ఏవీ వ్యక్తం చేయలేదు. ఈ ప్రతిపాదనను కేవలం కర్ణాటక వ్యతిరేకించింది. ఇది రాజకీయ దురుద్దేశంతో కూడిన చర్యగా అభివర్ణించిన ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఇది ఫెడరలిజాన్ని దెబ్బతీస్తుందని పేర్కొన్నారు.
జమిలి ఎన్నికల వల్ల ఎన్నికల విధులకు ఉపాధ్యాయులను, అంగన్వాడీ కార్యకర్తలను పదేపదే పంపాల్సిన అవసరం తగ్గుతుందని, తద్వారా వారు తమ సాధారణ విధులపై దృష్టి పెట్టడానికి వీలవుతుందని మద్దతుదారులు భావిస్తున్నారని చౌదరి పేర్కొన్నారు.

More Stories
ఆన్లైన్ అబద్ధాలతో కొట్టుకుపోతున్న ఫ్రాన్స్ అశాంతి అసలు కథనం
జవహర్నగర్ డంపింగ్ యార్డు తరలింపుకై ఈటల పాదయాత్ర
సీజేపీ నేతల కేసు విచారణలో ఫ్రాన్స్ అల్లర్లను ప్రస్తావించిన హైకోర్టు