సిపిజే నేతల కేసు విచారణలో ఫ్రాన్స్‌ అల్లర్లను ప్రస్తావించిన హైకోర్టు

 
*  బారికేడ్లు దాటడంపై అభ్యంతరం .. హైకోర్టులో పిటిషన్‌ ఉపసంహరణ 
 
ప్రత్యేక ఎగ్జిక్యూటివ్‌ మేజిస్ట్రేట్‌ (ఎస్‌ఈఎం) జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపును సవాలు చేస్తూ సీజేపీ (కాక్రోజ్‌ జనతా పార్టీ) సహ కన్వీనర్లు సౌరవ్‌ దాస్‌, అశుతోష్‌ రాంకా దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు ఫ్రాన్స్ అల్లర్లను ప్రస్తావించడంతో పాటు వారి వయస్సు వివరాలను బట్టి `జెన్ జెడ్’ తరంకు చెందినవారు కాదని తేల్చి చెప్పడంతో వారు తమ పిటిషన్ ను ఉపసంహరించుకున్నారు. 

వారి కస్టడీ గడువు బుధవారంతో ముగియున్న నేపథ్యంలో పిటిషన్​ను అత్యవసరంగా విచారించేందుకు న్యాయస్థానం అంగీకరించింది. అయితే ప్రత్యామ్నాయ న్యాయ మార్గాలను అనుసరించకుండా నేరుగా హైకోర్టును ఎందుకు ఆశ్రయించారని ధర్మాసనం ప్రశ్నించింది. సంబంధిత  స్పెషల్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ వద్ద విచారణ పూర్తయ్యే వరకు వేచి చూడాలని పేర్కొంది. 

అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే అప్పీలేట్ కోర్టును ఆశ్రయించాలని జస్టిస్ సుబ్రమణియం ప్రసాద్ ధర్మాసనం సూచించింది. దీంతో పిటిషనర్లు తమ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. ధర్మాసనం నిరసనల నిర్వహణలో పోలీసుల అనుమతి ప్రాధాన్యాన్ని వివరిస్తూ జంతర్‌మంతర్‌ నిరసన ప్రదేశంగా గుర్తింపు కోల్పోయిన తర్వాత కూడా అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించింది. 

బారికేడ్లను ఏర్పాటు చేయడం వెనుక నిర్దిష్టమైన ఉద్దేశం ఉంటుందని, వాటిని దాటడం వల్ల ఇతరులు కూడా ఆ ప్రాంతంలోకి ప్రవేశించే అవకాశం ఏర్పడుతుందని పేర్కొంది. నిరసనకారుల నియంత్రణలో లేని వ్యక్తులు అక్కడికి చేరితే పరిస్థితులు సంక్షిష్టంగా మారవచ్చని ధర్మాసనం అభిప్రాయపడింది. ఆందోళనకు సంబంధం లేని వారు ప్రవేశించి గందరగోళం సృష్టిస్తే, దాని ప్రభావం అసలు నిరసనకాలపైనా పడే ప్రమాదం ఉంటుందని సూచించింది. 

నిరసనలకు అనుమతి తీసుకోవడం అనేది ఆందోళనలను అడ్డుకోవడానికి మాత్రమే కాదని కోర్టు స్పష్టం చేసింది. ఇతరులు వచ్చి పరిస్థితులను చెడగొట్టకుండా, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చూడటం కూడా పోలీసుల అనుమతి విధానంలో కీలక ఉద్దేశమని వివరించింది. విద్యార్థుల ఆందోళనలుగా ప్రారంభమైన నిరసనలు హింసాత్మక ఘటనలకు దారితీసిన ఉదంతాలు దేశ సరిహద్దులకు పరిమితం కాలేదని హైకోర్టు పేర్కొంది. 

ఫ్రాన్స్‌లో విద్యార్థుల నేతృత్వంలో మొదలైన నిరసనలు చివరకు నిప్పంటించే ఘటనలు, దోపిడీలకు దారితీసిన పరిణామాలను ఉదాహరణగా ప్రస్తావించింది. నిరసన ప్రారంభమైనప్పుడు దాని ఉద్దేశం ఒకటిగా ఉన్నా, ఆ తర్వాత పరిస్థితులు మారే అవకాశం ఉంటుందని ధర్మాసనం అభిప్రాయపడింది. శాంతిభద్రతలకు ముప్పు ఏర్పడే అవకాశం ఉన్నప్పుడు నిరసన నిర్వాహకులు ఎవరు? వారి అనుబంధ సంస్థ ఏమిటి? ఆ సంఘం లక్ష్యాలేంటి? అనే అంశాలు ప్రాధాన్యం సంతరించుకుంటాయని పేర్కొంది. 

అయితే, నిషేధం లేదా అనుమతి రద్దు చేసిన ప్రదేశంలో నిరసన చేపట్టడం ఎంతవరకు తీవ్రమైన చర్యగా పరిగణించాలనే అంశాన్ని కూడా కోర్టు ప్రస్తావించింది. బారికేడ్లు దాటి వెళ్లిన వ్యవహారంపై చట్టపరమైన అంశాలను ప్రత్యేకంగా పరిశీలిస్తామని తెలిపింది. నిరసన నిర్వహించిన తీరుపై అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ, ఆ చర్యల చట్టబద్ధతను పరిశీలించడం వేరే అంశమని ధర్మాసనం పేర్కొంది.

విచారణ సందర్భంగా సీజేపీ నేతల వయసును కూడా ధర్మాసనం అడిగి తెలుసుకుంది. సౌరవ్‌ దాస్‌ వయసు 26 ఏళ్లు కాగా, ఆశుతోశ్ రాంకా వయసు 31 ఏళ్లు. వారి వయసుల నేపథ్యంలో మీరు జెన్‌-జెడ్‌ తరానికి చెందినవారు కాదని వ్యాఖ్యానించిన న్యాయమూర్తి మిలీనియల్స్‌ ఏ వయో వర్గానికి చెందుతారని సరదాగా ప్రశ్నించారు. విద్యార్థుల ఉద్యమంగా మొదలైన నిరసన క్రమంగా వేరే స్వరూపం సంతరించుకుందనే విషయాన్ని కూడా కోర్టు ప్రస్తావించింది.

నిరసనలో పాల్గొనే వ్యక్తులు మారకపోయినా, వారి ఆందోళనకు సంబంధించిన కారణాలు మారే అవకాశం ఉంటుందని అభిప్రాయపడింది. శాంతిభద్రతలకు భంగం కలిగే ప్రమాదం ఉందనే అనుమానం ఏర్పడినప్పుడు నిర్వాహకుల నేపథ్యం, సంస్థ లక్ష్యాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని వివరించింది.

About The Author