కీలక లష్కరే నేత నాలుగో అంతస్తు నుండి పడి మృతి!

పాకిస్థాన్‌లో ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) కీలక నేత చౌధరి మొహమ్మద్‌ సర్వర్‌ అలియాస్‌ అబు హాషిమ్‌ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందాడు. లాహోర్‌లోని మార్కజ్‌ ఖుద్సియా భవనంలోని నాలుగో అంతస్తు నుంచి కిందపడటంతో తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయాడు. సాయంత్రం ప్రార్థనల కోసం మెట్లపై నుంచి దిగుతుండగా జారిపడినట్లు లష్కరే తోయిబా డిప్యూటీ చీఫ్‌ సైఫుల్లా కసూరి తెలిపారు. 

చౌదరి మహమ్మద్ సర్వర్ లష్కర్-ఏ-తోయిబా వ్యవస్థాపక సభ్యులలో ఒకరు. ఆయన ఈ సంస్థ నాయకుడు హఫీజ్ సయీద్, ఉప నాయకుడు సైఫుల్లా కసూరి ఇద్దరికీ సన్నిహితుడిగా ఉండేవారు.  లాహోర్‌ ప్రాంతానికి సంస్థ అధిపతిగా కనీసం 2015 జనవరి నుంచి వ్యవహరించినట్లు అమెరికా ట్రెజరీ విభాగం వెల్లడించింది.  లష్కర్  కార్యకలాపాల కోసం 2008లో వ్యాపారవేత్తల బృందాలను సంస్థకు చెందిన కేంద్రాలకు తీసుకెళ్లి విరాళాలు సేకరించినట్లు అమెరికా ట్రెజరీ 2016లో విడుదల చేసిన ప్రకటనలో వివరించింది.

పాకిస్తాన్ అధికారిక ఆర్థిక వ్యవస్థను ఉపయోగించి, ఆ సంస్థ తరఫున నిధులు సేకరించడం, ఆ నిధులను ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి బదిలీ చేయడం వంటి కార్యకలాపాలలో చౌదరి మహమ్మద్ సర్వర్ పాల్గొన్నాడని కూడా ఆ ప్రకటనలో పేర్కొన్నారు. 2012–13 మధ్య లష్కరే విదేశీ వ్యవహారాల విభాగం అధిపతి హఫీజ్‌ అబ్దుల్‌ రెహమాన్‌ మక్కీతో సర్వర్‌ కలిసి పనిచేశాడు.

2013లో పాకిస్థాన్‌లో తన ప్రయాణ ఖర్చుల కోసం మక్కీ సర్వర్‌ను డబ్బు అడిగినట్లు, లాహోర్‌లో సంస్థ ఆర్థిక విభాగాన్ని నిర్వహించిన వారిలోనూ సర్వర్‌ ఉన్నట్లు వివరించింది. లష్కరే తోయిబా నిధుల సమీకరణ, ఆర్థిక సహాయ వ్యవస్థలను అడ్డుకునే చర్యల్లో భాగంగా అమెరికా ట్రెజరీ విభాగం 2016 డిసెంబరు 28న సర్వర్‌పై ఆంక్షలు విధించింది. అతడితో పాటు మరో సీనియర్‌ నేత షాహిద్‌ మహమూద్‌పైనా ఆంక్షలు విధించింది.  

సర్వర్‌కు ‘పాకిస్థాన్ మర్కజీ ముస్లిం లీగ్’ అనే రాజకీయ వేదికతో సంబంధం ఉందని, దాని ముసుగులో అతను ‘లష్కర్-ఏ-తోయిబా’ కోసం నిధుల సేకరణ, సభ్యుల నియామక కార్యక్రమాల్లో పాల్గొన్నాడని నివేదికలు పేర్కొంటున్నాయి. అంతేకాకుండా, లష్కర్-ఏ-తోయిబాకు చెందిన ఆర్థిక విభాగం ‘ఖిద్మత్-ఏ-ఖల్క్’లో అతను కీలక బాధ్యతలు నిర్వహించినట్లు సమాచారం.

సర్వర్‌ మృతి 2016లో కరాచీలో చోటుచేసుకున్న జావెద్‌ ఖనానీ మరణాన్ని గుర్తుచేస్తోంది. నకిలీ కరెన్సీ వ్యవహారాలతో సంబంధం ఉన్న ఖనానీ నిర్మాణంలో ఉన్న భవనం నుంచి పడి మరణించాడు. ఇప్పుడు సర్వర్‌ కూడా భవనం నుంచి పడిపోవడంతో ఈ రెండు ఘటనల మధ్య పోలికలు తెరపైకి వచ్చాయి.

About The Author