కాక్రోచ్ జ‌న‌తా పార్టీకి అమెరికా నుంచి నిధులు

* అమెరికా సింగ‌ర్ మేరీ మిల్‌బెన్‌ ఆరోప‌ణ‌

భారత్‌లోని కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ), ఆ పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే చుట్టూ రాజకీయ వివాదం మరింత ముదురుతోంది. ప్రధాని నరేంద్ర మోదీని వ్యతిరేకించే కొందరు అమెరికన్ దాతలు సీజేపీకి ఆర్థిక సాయం చేస్తున్నారని ప్రముఖ అమెరికన్ గాయని మేరీ మిల్బెన్ ఆరోపించారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోరుతూ విప‌క్షాల‌తో పాటు సీజేపీ నేత‌లు ఆందోళ‌న చేస్తున్న నేప‌థ్యంలో ఆమె సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. 
 
ఇది మౌనంగా ఉండాల్సిన సమయం కాదని పేర్కొంటూ భారత యువత ఈ పరిణామాలపై అప్రమత్తంగా ఉండాలని,  విఛ్ఛిన్న‌క‌ర స్పూర్తిని ఢీకొట్టేందుకు దేశంలోని యువ‌త శాంతియుత నిర‌స‌న చేప‌ట్టాల‌ని ఆమె పిలుపునిచ్చారు.  సీజేపీ నేత అభిజీత్ దీప్కేతో పాటు అత‌ని పార్టీకి అమెరిక‌న్లు విరాళాలు ఇస్తున్నార‌ని, ప్ర‌ధాని మోదీకి వ్య‌తిరేకంగా ఆ విరాళాలను అందిస్తున్నార‌ని అమెరిక‌న్ సింగ‌ర్ మిల్‌బెన్ తెలిపారు.

మేరీ మిల్బెన్ తన ఎక్స్‌ ఖాతాలో చేసిన పోస్టులో కాక్రోచ్ జనతా పార్టీ, అభిజిత్ దీప్కేలను ప్రస్తావించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ సాధిస్తున్న అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్న విదేశీ శక్తుల నుంచి ఈ పార్టీకి నిధులు అందుతున్నాయని ఆమె ఆరోపించారు. భారత యువత ఇటువంటి పరిణామాలను గమనించాలని, దేశ భవిష్యత్తుపై ప్రభావం చూపే అంశాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. 

ఇప్పుడు మౌనంగా ఉండాల్సిన స‌మ‌యం కాదని, అంద‌మైన దేశ యువ‌త శాంతియుత రీతిలో విచ్ఛిన్న‌క‌ర శ‌క్తుల‌తో పోరాడాల‌ని ఆమె సూచించారు.
“యువ దేశ‌భ‌క్తులారా, భ‌యం వ‌ద్దు, మీ ప్ర‌ధాని భార‌త్‌కు 25 ఏళ్లు సేవ చేశారు. 12 ఏళ్లు ప్ర‌ధానిగా వ‌రుస‌గా మూడుసార్లు ఎన్నిక‌య్యారు. విచ్చిన్న‌క‌ర శ‌క్తుల‌కు ఆయ‌న త‌లొగ్గ‌రు” అంటూ ఆమె చెప్పుకొచ్చారు. 

ప్ర‌పంచ‌వ్యాప్తంగా దాత‌ల‌కు ఓ ప్ర‌త్యేక విధానం ఉంటుంద‌ని పేర్కొంటూ ఎక్క‌డైనా క‌న్జ‌ర్వేటివ్ నేత‌ల్ని టార్గెట్ చేస్తార‌ని, అమెరికాలో చదువుకున్న వ్య‌క్తుల‌ను గుర్తించి, వారిని ర్యాడిక‌లైజ్ చేసి, ఆయా దేశాల‌కు పంపిస్తార‌ని, ఇక గంద‌ర‌గోళం, విధ్వంసం సృష్టించేందుకు ఫండింగ్ చేస్తార‌ని ఆమె తెలిపారు. కానీ ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ విజయం కాలేకపోయినా వాళ్లు అభివృద్ధికి, ప‌రిపాల‌న‌కు అడ్డుప‌డుతుంటార‌ని మిల్‌బెన్ తెలిపారు.

ప్ర‌జాస్వామ్యం, స్వేచ్ఛ‌ను ఉన్న‌తంగా నిలిపేందుకు కౌంట‌ర్‌గా ఓ ఉద్య‌మం అవ‌స‌రం అవుతుంద‌ని అమెరిక‌న్ సింగ‌ర్ అభిప్రాయ‌ప‌డ్డారు. భార‌త్‌లో కొత్త గ‌ళం ఉద్భ‌వించాల‌ని, ఈనేల‌లో చ‌దివిన వ్య‌క్తులు ముందుకు రావాల‌ని, కాక్రోచ్ జ‌న‌తా పార్టీ విచ్చిన్న‌ర స్పూర్తిని శాంతియుతంగా దెబ్బ‌తీయాల‌ని, దీని కోసం ఈ దేశ యువ‌త మేలుకోవాల‌ని ఆమె పేర్కొన్నారు. 

 

 

ఆఫ్రిక‌న్‌-అమెరికన్ హాలీవుడ్ న‌టి, గాయ‌ని అయిన మిలిబెన్ ఇటీవ‌ల భారత దేశంలో పేరొందారు. భార‌త జాతీయ గీతంతో పాటు ఓం జై జ‌గ‌దీశ హ‌రే పాట‌ల‌ను ఆమె పాడారు. 2023లో ప్ర‌ధాని మోదీ అమెరికాలో పర్యటించినప్పుడు చేసిన‌ప్పుడు ఆ కార్య‌క్ర‌మంలో మిలిబెన్ జ‌న‌గ‌ణ‌మ‌ణ పాడారు.

విదేశీ నిధుల ఆరోపణలను ఖండించిన డిప్కే 

కాగా, సిజెపి, దాని వ్యవస్థాపకుడు అభిజీత్ డిప్కే చుట్టూ రాజకీయ వివాదం నెలకొన్న తరుణంలో ఈ నిధుల ఆరోపణలు వచ్చాయి. ఈ సంస్థకు అందుతున్న నిధులపై బీజేపీ నేతలు కూడా ప్రశ్నలు లేవనెత్తారు.  విదేశీ మద్దతుతో దేశాన్ని అస్థిరపరిచేందుకు ప్రతిపక్ష నాయకులు, సిజెపి ప్రయత్నిస్తున్నారని బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబిన్ ఆరోపించగా, డిప్కేకు అందుతున్న నిధుల మూలాల గురించి బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే ప్రశ్నించారు. 

అయితే, విదేశీ నిధులు అందుతున్నాయన్న ఆరోపణలను డిప్కే ఖండించారు. ఒకవేళ సిజెపి కార్యకలాపాలకు విదేశీ నిధులు చేరి ఉంటే, అది కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వైఫల్యమేనని ఆయన వాదించారు. తన పర్యవేక్షణలో దేశంలోకి విదేశీ నిధులు ఎలా ప్రవేశించాయో? వివరించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఆయన సవాల్ విసిరారు.  సీజేపీకి నిధులు అందిస్తున్నట్లు ఆరోపించిన అమెరికన్ దాతల పేర్లు, ఆర్థిక లావాదేవీల వివరాలు, నిధుల బదిలీకి సంబంధించిన నిర్దుష్టమైన ఆధారాలను మిలిబెన్ సహితం ప్రస్తావించ లేకపోయారు. 

About The Author