బిజెపి బలోపేతం కోసం కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ రాజీనామా

కేంద్ర మంత్రి పదవికి ఎల్ మురుగన్ రాజీనామా చేశారు. తన రాజ్యసభ సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. తమిళనాడులో బీజేపీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడానికి, రాబోయే 2029 లోక్‌సభ ఎన్నికలకు పార్టీని సిద్ధం చేయడానికి తాను పూర్తి సమయం కేటాయించాలనుకుంటున్నట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్. మురుగన్ వెల్లడించారు. ఈ మేరకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాసిన మురుగన్ ఆ లేఖను తన ‘ఎక్స్’ లో పంచుకున్నారు.

‘‘తమిళనాడులో పార్టీని మరింత విస్తరించేందుకు, బలోపేతం చేసేందుకు గానూ నన్ను కేంద్ర సహాయ మంత్రి బాధ్యతల నుంచి తప్పించి, రాజ్యసభ సభ్యత్వాన్ని త్యజించేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా నమ్రతతో, కృతజ్ఞతా భావంతో ప్రార్థిస్తున్నాను. రాష్ట్రంలోని ప్రతి గ్రామానికి, ప్రతి వీధికి వెళ్లి ప్రజలను కలవాలని, మన కార్యకర్తలకు తోడుగా నిలిచి పార్టీని బలోపేతం చేయాలని భావిస్తున్నాను’’ అని లేఖలో పేర్కొన్నారు.

 
‘‘ప్రధాని మోదీ నాయకత్వంలో దేశానికి, తమిళనాడుకు సేవ చేయడం నా జీవితంలో లభించిన అత్యంత గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. ఇప్పుడు మళ్లీ క్షేత్రస్థాయి రాజకీయాల్లోకి వెళ్లి కార్యకర్తలతో కలిసి పనిచేస్తూ 2029 లోక్‌సభ ఎన్నికల లక్ష్యంగా తమిళనాడులో బీజేపీని బలోపేతం చేయడానికి నన్ను నేను అంకితం చేసుకోవాలనుకుంటున్నాను’’ అని తెలిపారు. 
 
రోజువారీ కూలీల కొడుకునైన తనకు కేంద్ర ప్రభుత్వంలో పనిచేసే అవకాశం కల్పించినందుకు ప్రధాని మోదీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ‘‘నేను ఎలాంటి రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి రాలేదు. ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చాను. దినసరి కూలీలుగా, పశువుల కాపరులుగా పనిచేసిన నా తల్లిదండ్రులు ఇప్పటికీ కోనూర్ గ్రామంలో సాధారణ జీవితాన్నే గడుపుతున్నారు’’ అని గుర్తు చేసుకున్నారు.

ఏబీవీపీ, బీజేపీలలో తన మూడు దశాబ్దాల రాజకీయ ప్రయాణంలో ‘ముందు దేశం, ఆ తర్వాతే పార్టీ, స్వార్థం చివరిది’ అనే సూత్రమే తనను నడిపించిందని మురుగన్ తెలిపారు. మురుగన్ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖతో పాటు పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రిగా సేవలు అందించారు. జులై 2021 నుంచి జూన్ 2024 వరకు మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమల శాఖలకు కూడా సహాయ మంత్రిగా వ్యవహరించారు. అంతకుముందు 2017 నుంచి 2020 వరకు జాతీయ ఎస్సీ కమిషన్ వైస్ చైర్‌పర్సన్‌గా, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగానూ బాధ్యతలు నిర్వర్తించారు.

About The Author