జులైలోనే విమానాన్ని కూల్చేందుకు ఫ్లైదుబాయ్ కో-పైలట్ కుట్ర!

ఇటీవల ఫ్లైదుబాయ్ విమానంలో జరిగిన భయంకరమైన దాడిలో టెల్ అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్ ఎఫ్‌జడ్ 1073 విమానాన్ని ఇజ్రాయెల్‌లోని బెన్ గురియన్ విమానాశ్రయంపై కూల్చివేసి 9/11 తరహా ఉగ్రదాడికి పాల్పడాలని ఒమన్‌కు చెందిన కో-పైలట్ హమామ్ అల్-హమామీ యోచించినట్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) దర్యాప్తు అధికారుల విచారణలో వెల్లడి అయింది. 
 
అంతేకాకుండా ఈ దాడిని మూడు నెలల క్రితం అంటే జులై నెలలోనే చేయాలని కూడా భావించినట్లు, కానీ అప్పుడు ఆగి ఇప్పుడు చేస్తున్నట్లు తెలిపాడు.  

ఇజ్రాయెల్ హీబ్రూ మీడియా కథనం ప్రకారం విమాన కెప్టెన్ స్మిత్ మచ్చర్‌‌ను దారుణంగా హత్య చేసిన తర్వాత, ఎలాంటి అనుమానం రాకుండా సాధారణ పద్ధతిలోనే ఇజ్రాయెల్ ఎయిర్‌పోర్ట్ అధికారుల నుంచి ల్యాండింగ్ క్లియరెన్స్ పొందాలని హమామీ భావించాడు. 

 
ఆపై చివరి నిమిషంలో ఎయిర్‌పోర్ట్‌లోని విమానాలు లేదా భవనాలను నేరుగా ఢీకొట్టాలనేది అతడి ప్లాన్. ఒకవేళ ఎయిర్‌పోర్ట్ వద్ద ఈ కుట్ర విఫలం అయితే టెల్ అవీవ్‌లోని ఆకాశహర్మ్యాలను గానీ లేదా జోర్డాన్‌‌లోని అమెరికా సైనిక స్థావరాలను గానీ విమానంతో ఢీకొట్టాలని ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లు దర్యాప్తులో ఒప్పుకున్నాడు. 
 
అల్-హమామీ మొదట తన ప్రణాళికను జూలైలో అమలు చేయాలని భావించినప్పటికీ సిబ్బందిలోని ఒక సభ్యుడితో స్నేహం కారణంగా చివరి నిమిషంలో తన ఆపరేషన్‌ను వాయిదా వేశాడని మరో మీడియా కథనం వెల్లడించింది. విమానం ఇజ్రాయెల్‌కు చేరువవుతున్న సమయంలో జోర్డాన్ సరిహద్దుల వద్ద ప్రార్థన చేసుకుంటానని చెప్పి హమామీ ఒక్కసారిగా కెప్టెన్ స్మిత్ మచ్చర్‌పై రోప్‌ యాక్స్‌తో దాడి చేశాడు. 
 
దాడి అనంతరం విమాన ఇంజిన్లను ఆపివేసి, రడ్డర్లను ముందుకు నెట్టడంతో బోయింగ్ విమానం నిమిషంలోనే దాదాపు 16,000 అడుగుల కిందకు పడిపోయింది. అయితే తీవ్ర రక్తస్రావం అవుతున్నప్పటికీ భారతీయ పైలట్ స్మిత్  మచ్చర్‌‌ అద్భుతమైన సాహసాన్ని ప్రదర్శించాడు. కో-పైలట్‌తో పోరాడుతూనే డిస్ట్రెస్ సిగ్నల్స్ పంపడమే కాకుండా కాక్‌‌పిట్ తలుపులను తెరిచారు. 
 
దీంతో విమానంలో ఉన్న సిబ్బంది, ప్రయాణికులు లోపలికి వచ్చి కో-పైలట్‌ను కట్టడి చేయగలిగారు. ఆ తర్వాత విమానంలో ప్రయాణిస్తున్న ఇద్దరు ఆఫ్-డ్యూటీ పైలట్లు విమానాన్ని సౌదీ అరేబియాలో సురక్షితంగా దించారు. 29 ఏళ్ల హమామ్ అల్-హమామీకి తీవ్రవాద భావజాలంతో సంబంధాలు ఉన్నాయని, అతడి తండ్రి ఒమన్ కాగా తల్లి సిరియాకు చెందిన మహిళ అని దర్యాప్తులో తేలింది. 
 
ఇజ్రాయెల్‌కు విమానాలు నడిపే ఏకైక సంస్థ ఫ్లైదుబాయ్ కావడం వల్లే తాను ప్రత్యేకంగా ఈ ఎయిర్‌లైన్స్‌లో ఉద్యోగానికి చేరినట్లు అతడు వెల్లడించాడు. తీవ్రవాద భావజాలం కారణంగా స్వదేశమైన ఒమాన్ లోనే అతడిపై విమానాలు నడపకుండా నిషేధం ఉన్నప్పటికీ  ఫ్లైదుబాయ్ సంస్థ అతడిని విధుల్లోకి ఎలా తీసుకుందనే దానిపై పలు భద్రతా లోపాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుతం ఈ అంతర్జాతీయ ఉగ్ర కుట్రపై వివిధ దేశాల భద్రతా సంస్థలు సమగ్ర దర్యాప్తు వేగవంతం చేశాయి.

About The Author