జ్ఞానేష్ కుమార్‌ సస్పెండ్ ఉత్తర్వులను సుప్రీం నిరాకరణ

* సవరించిన ఫారం-6కు సుప్రీంకోర్టు ఆమోదం లేదు

భారత ఎన్నికల సంఘంలో, ఇతర ఇద్దరు ఎన్నికల కమిషనర్ల ఏకాభిప్రాయం లేకుండా ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారన్న ఆరోపణలపై, ఆయనను సస్పెండ్ చేసేందుకు ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడానికి సుప్రీంకోర్టు సోమవారం నిరాకరించింది. పిటిషన్‌లో చేసిన ఆరోపణలపై స్పందన కోరుతూ, సీజేఐ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం భారత ఎన్నికల సంఘానికి నోటీసు జారీ చేసింది. 
 
ఈసీఐ స్పందనను పరిశీలించిన తర్వాత, అవసరమైన ఏకగ్రీవత లేకుండా సీఈసీ కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్లు తేలితే, ఆ నిర్ణయాలను పునఃపరిశీలించవచ్చని లేదా ఉపసంహరించుకోవచ్చని కోర్టు సూచించింది. “నోటీసు ఇచ్చిన తర్వాత, వారు వచ్చి ఏబీసీ నిర్ణయాలు ఏకగ్రీవంగా తీసుకోలేదని నిరూపిస్తే, మేము ఆ నిర్ణయాలను వెనక్కి తీసుకుంటాము” అని కోర్టు పేర్కొంది. 
 
ఓటర్ల జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)కు సంబంధించి భారత ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై కోర్టు విచారణ జరుపుతోంది. బహుళ సభ్యుల రాజ్యాంగ సంస్థ అయిన ఎన్నికల సంఘానికి అప్పగించిన అధికారాలను, చట్టం నిర్దేశించిన సామూహిక నిర్ణయాధికార యంత్రాంగాన్ని పాటించకుండా వినియోగిస్తున్నారని ఆరోపిస్తూ, ఈసీఐ పనిచేస్తున్న తీరును సవాలు చేస్తూ ఒక పిటిషన్ దాఖలైంది.
 
వారం రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో ఆదేశించింది. అలాగే సీఈసీ, ఈసీలకు చట్టపరంగా ఇచ్చిన ప్రాసిక్యూషన్ మినహాయింపు చెల్లుబాటుపై కూడా విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఒకవేళ ఎన్నికల సంఘం తీసుకున్న ఏ నిర్ణయమైనా చట్టవిరుద్ధమని తేలితే.. దాన్ని తక్షణమే రద్దు చేస్తామని తేల్చిచెప్పింది.  అయితే ఈసీ తీసుకున్న నిర్ణయాలను తాత్కాలికంగా నిలిపివేసేందుకు సుప్రీం నిరాకరించింది. “ఎన్నికల సంఘం నిర్ణయాలు ఏకగ్రీవంగా లేదా మెజారిటీతో తీసుకోవాలని, అన్ని నిర్ణయాలు ఈ విధంగానే తీసుకున్నారని తాము భావిస్తున్నట్లు” ధర్మాసనం పేర్కొంది.

చట్టపరంగా మొత్తం ఎన్నికల సంఘానికి చెందే అధికారాలను సీఈసీ కుమార్ వ్యక్తిగతంగా వినియోగిస్తున్నారో లేదో నిర్ధారించాలని, ఒకవేళ అలా చేస్తుంటే ఆ చర్యలను అనధికారికమైనవిగా ప్రకటించి తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆ ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిఐఎల్) అత్యున్నత న్యాయస్థానాన్ని కోరింది.
 
మరోవంక, కొత్త ఓటరుగా నమోదు చేసుకోవడానికి అవసరమైన ‘ఫారం 6’కు సంబంధించి భారత ఎన్నికల సంఘం జారీ చేసిన అంశాన్ని పరిశీలిస్తామని సుప్రీంకోర్టు ఈ రోజు పేర్కొంది. “సవరించిన” ఫారం 6కు సుప్రీంకోర్టు ఆమోదం తెలపలేదన్న విషయం స్పష్టమని కోర్టు వ్యాఖ్యానించింది. ఫారం 6 అంశంపై సుప్రీంకోర్టు ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని, సంబంధిత రికార్డులను కోర్టుకు సమర్పించిన తర్వాత వాటిని పరిశీలించి ఈ విషయాన్ని లోతుగా పరిశీలిస్తామని ప్రధాన న్యాయమూర్తి కాంత్ చెప్పారు.  

About The Author