భారత్, రష్యా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడుతున్నాయని భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తెలిపారు. ఈ ఏడాది సుమారు 70 వేల మంది నైపుణ్యం కలిగిన భారతీయ కార్మికులకు తమ దేశంలో ఉపాధి కల్పించేందుకు రష్యా అంగీకరించిందని చెప్పారు. ముఖ్యంగా నిర్మాణ, లాజిస్టిక్స్ రంగాల్లో ఈ నియామకాలు జరుగనున్నాయని తెలిపారు.
ఆటోమొబైల్స్, ఫార్మాస్యూటికల్స్, ఆహార ఉత్పత్తులు, సముద్ర ఉత్పత్తులు, ఇంజినీరింగ్ వస్తువులు, రసాయనాలు, టెక్స్‌టైల్స్ రంగాల్లో ఈ అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఇంధన సహకారంపై మాట్లాడుతూ బహుళ వనరుల నుంచి ఇంధన సరఫరాలను కొనసాగించడం ద్వారా భారత వినియోగదారుల ప్రయోజనాలను కాపాడటమే తమ ప్రభుత్వ ప్రాధాన్యత అని జైశంకర్ స్పష్టంచేశారు.
చెన్నై-వ్లాదివోస్టాక్ కారిడార్, అంతర్జాతీయ నార్త్-సౌత్ ట్రాన్స్‌పోర్ట్ కారిడార్, నార్తర్న్ సీ రూట్ వంటి కనెక్టివిటీ ప్రాజెక్టులపైనా సమావేశంలో చర్చించారు. భారత్-యురేషియన్ ఎకనామిక్ యూనియన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునే అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. ఇదే సమయంలో ఉక్రెయిన్ సంక్షోభంపై భారత్ దౌత్యపరమైన ప్రయత్నాలను జైశంకర్ కమిటీకి వివరించారు.
చర్చలు, శాంతియుత పరిష్కారానికి భారత్ ఎల్లప్పుడూ మద్దతిస్తుందని పునరుద్ఘాటించారు. రష్యా సైన్యంలో సహాయక విధుల పేరుతో చిక్కుకున్న భారతీయ పౌరుల విడుదల కోసం చేస్తున్న ప్రయత్నాలను కూడా ఆయన సభ్యులకు తెలియజేశారు. ఇప్పటివరకు సుమారు 140 మందిని సురక్షితంగా విడిపించామని, మరో 55 మంది ఆచూకీ కోసం రష్యా అధికారులతో చర్చిస్తున్నామని తెలిపారు.

More Stories
‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’పై 6 నెలల్లో కఠిన చట్టాలు
పాక్ `హనీ ట్రాప్’లోని నావికాదళ అధికారి అరెస్ట్
బెంగాల్ రాజ్యసభ ఉప ఎన్నికలో బిజెపి అభ్యర్థిగా టిఎంసి రెబల్