భారత్ సోమవారం ఎనిమిది పతకాలు సాధించింది. షూటింగ్, జావెలిన్ త్రో, అథ్లెటిక్స్, కురాష్ క్రీడల్లో రజతం, కాంస్య పతకాలు దక్కించుకుంది. మహిళల బాక్సింగ్ విభాగంలో లవ్లీనా సహా మరో ఇద్దరు మహిళలు సెమీస్ చేరి మరో మూడు పతకాలను ఖాయం చేశారు. మహిళల 25 మీటర్ల షూటింగ్ వ్యక్తిగత విభాగంలో హైదరాబాద్ క్రీడాకారిణి ఈశా సింగ్ రజత పతకం దక్కించుకుంది.
ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్‌లో ఆమె త్రుటిలో స్వర్ణ పతకాన్ని కోల్పోయింది. చైనా షూటర్‌కు స్వర్ణం దక్కింది. 1500 మీటర్ల పరుగు పందెంలో అథ్లెట్ గుల్వీర్ సింగ్ రజత పతకం సాధించాడు. 3.36 నిమిషాల్లో రేసు పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచాడు. ఇప్పటికే 10వేల మీటర్ల రేసులో గుల్వీర్ రజతం గెలుచుకున్నాడు. లాంగ్ జంప్‌లో మురళీ శ్రీశంకర్ రజతం దక్కించుకున్నాడు. మహిళల 5వేల మీటర్ల రేసులో పారుల్ చౌధరీ కాంస్య పతకం దక్కించుకోగా, 400 మీటర్ల హార్డిల్స్‌లో విత్య రామ్‌రాజ్ కాంస్య పతకం సొంతం చేసుకుంది. జావెలిన్ త్రోలో భారత్‌కు రెండు పతకాలు దక్కాయి.
యశ్‌వీర్ సింగ్, రోహిత్ యాదవ్ రజత, కాంస్య పతకాలను కైవసం చేసుకున్నారు. యశ్‌వీర్ సింగ్ 85.72 మీటర్లు ఈటెను విసిరి రజత పతకం దక్కించుకోగా రోహిత్ యాదవ్ 84.35 మీటర్లు ఈటెను విసిరి కాంస్య పతకం గెలుచుకున్నాడు. మహిళల 78 కిలోల కురాష్ విభాగంలో దక్షిణ కొరియా క్రీడాకారిణి సుమిన్ మో చేతిలో ఓడిన పింకి బల్హారా కాంస్య పతకంతో సరిపెట్టుకుంది.
సోమవారం సాయంత్రం నాటి పతకాల పట్టికలో చైనా 131 స్వర్ణాలు, 53 రజతాలు, 45 కాంస్యాలతో 229 పతకాలతో అగ్రస్థానంలో ఉంది. జపాన్ 172, దక్షిణ కొరియా 90 పతకాలతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. భారత్ 45 పతకాలతో 12వ స్థానంలో ఉంది. ఏషియన్ గేమ్స్ పోటీలు కొనసాగుతున్న నేపథ్యంలో భారత పతకాల సంఖ్యలో మరిన్ని మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.

More Stories
బంగ్లాదేశ్‌లో హిందూ నగల వ్యాపారి దారుణ హత్య
చరిత్ర సృష్టించిన స్క్వాష్ క్రీడాకారిణి అనాహత్ సింగ్
ఉగ్రవాదాన్ని సమర్థించుకోవడానికి ప్రయత్నిస్తున్న పాక్