2022 నుండి ప్రస్తుత లోక్‌సభ, రాజ్యసభ, రాష్ట్ర శాసనసభలకు ఎన్నికైన వారిలో మొత్తం 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ రాజకీయ పార్టీలను మార్చుకున్నారు. ‘అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్’ (ఏడీఆర్), ‘నేషనల్ ఎలక్షన్ వాచ్’ నిర్వహించిన విశ్లేషణ ప్రకారం, పార్టీలు మారిన వారిలో 26 మంది లోక్‌సభ సభ్యులు, ఏడుగురు రాజ్యసభ సభ్యులు, 78 మంది శాసనసభ సభ్యులు ఉన్నారు.
పార్టీలు మారిన ఈ 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలలో 64 మంది (58 శాతం) నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (ఎన్డిపిపి), తృణమూల్, కాంగ్రెస్ పార్టీలకు చెందినవారు. అత్యధిక సంఖ్యలో ప్రజాప్రతినిధులను చేర్చుకున్న పార్టీల జాబితాలో నాగ పీపుల్స్ ఫ్రంట్ (ఎన్పిఎఫ్) 32 మందితో (29 శాతం) అగ్రస్థానంలో నిలవగా, ఆ తర్వాతి స్థానాల్లో బీజేపీ 29 మందితో (26 శాతం), నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎన్సిపిఐ) 20 మందితో (18 శాతం) ఉన్నాయి.
అసలు ఎన్డిపిపి నుండి ఎన్నికైన ప్రజాప్రతినిధుల నుండే అత్యధిక సంఖ్యలో పార్టీ మార్పులు (25 మంది, 23 శాతం) నమోదయ్యాయి. ఆ తర్వాత తృణమూల్ (20 మంది, 18 శాతం), కాంగ్రెస్ (19 మంది, 17 శాతం) పార్టీలు ఉన్నాయి. భారత్ రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) నుండి తొమ్మిది మంది (8 శాతం) పార్టీ మారగా, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నుండి ఏడుగురు చొప్పున (6 శాతం) పార్టీ మారారు.
శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే) నుండి ఆరుగురు (5 శాతం), జనతాదళ్ (యునైటెడ్) నుండి ఐదుగురు (5 శాతం), నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పిపి) నుండి నలుగురు (4 శాతం) పార్టీ మారారు. కొన్ని రాష్ట్ర శాసనసభలలో ఇటీవల ప్రభుత్వాలు పడిపోవడానికి ఎమ్మెల్యేల ఫిరాయింపులే కారణమని ఆ నివేదిక పేర్కొనడం గమనార్హం.

More Stories
పోక్సో కేసు నుంచి ముస్లిం పర్సనల్ చట్టం రక్షణ కల్పించదు
నాగాలాండ్‌లో కల్తీ మద్యంతో రెండు రోజుల్లో 19 మంది మృతి
మహిళ మార్ఫింగ్ ఫోటో వివాదంపై సీజేపీ నేతలకు నోటీసులు