మ‌సూద్ అజార్‌ను ప‌ట్టిస్తే 70 ల‌క్ష‌ల బ‌హుమ‌తి!

మ‌సూద్ అజార్‌ను ప‌ట్టిస్తే 70 ల‌క్ష‌ల బ‌హుమ‌తి!
ఉగ్రవాద నిరోధక చర్యల విషయంలో అంతర్జాతీయ ఒత్తిడి ఎదుర్కొంటున్న పాకిస్థాన్ భారత్‌లో అనేక రక్తపాత దాడులకు పాల్పడిన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది, జైషే మహమ్మద్ అధినేత మసూద్ అజార్ సమాచారం అందించిన వారికి ఇచ్చే రివార్డును 70 లక్షల పాకిస్థానీ రూపాయిలకు (భారత కరెన్సీ ప్రకారం దాదాపు రూ. 24.09 లక్షలు) పెంచుతున్నట్లు ప్రకటించింది. పాకిస్థాన్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎఫ్ఐఏ) తన 2026 నాటి ‘రెడ్ బుక్ ఆఫ్ మోస్ట్ వాంటెడ్ హై ప్రొఫైల్ టెర్రరిస్ట్స్’ జాబితాలో మసూద్ అజార్ పేరును చేర్చడంతో పాటు ఈ భారీ బహుమతిని ఖరారు చేసింది.
 
కొంతకాలంగా తప్పించుకు తిరుగుతున్న`అంతర్జాతీయ తీవ్రవాది’గా ఐరాస ప్రకటించిన జైషే మొహ‌మ్మ‌ద్ వ్య‌వ‌స్థాప‌కుడు మ‌సూద్ అజార్ పాకిస్థాన్ లో స్వేచ్ఛగా తిరుగుతున్నట్లు పలు అంతర్జాతీయ కధనాలు స్పష్టం చేస్తున్నా  తమ భూభాగంలో లేడని, ఆయన అఫ్గానిస్థాన్‌కు పారిపోయాడని ఇస్లామాబాద్ ఇన్ని రోజులూ అంతర్జాతీయ సమాజం వద్ద వాదిస్తూ వచ్చింది. 
 
అయితే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) రాబోయే అక్టోబర్ 26వ తేదీ నుంచి 30వ తేదీ వరకు పారిస్‌లో ప్లీనరీ సమావేశాన్ని నిర్వహించనుంది. ఉగ్రవాదానికి నిధుల పంపిణీ, మనీ లాండరింగ్ నిరోధక చర్యలపై దేశాల పనితీరును సమీక్షించే ఈ సమావేశం వేళ మళ్లీ ‘గ్రే లిస్ట్’ ప్రమాదం ముంచుకొస్తుందన్న భయంతోనే పాక్ తన అధికారిక రికార్డుల్లో అజార్ పేరును మోస్ట్ వాంటెడ్‌గా చేర్చి పారితోషికం పెంచినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
 
58 ఏళ్ల వయసు కల్గిన మసూద్ అజార్ నేతృత్వంలోని జైషే మహమ్మద్ సంస్థ పాకిస్థాన్‌లోని బహావల్‌పూర్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తూ భారత గడ్డపై అత్యంత దారుణమైన ఉగ్ర దాడులకు ఒడిగట్టింది. 2001 పార్లమెంట్ దాడి, 2008 ముంబై ఉగ్రదాడులు, 2016 పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్ దాడి, 2019 పుల్వామా దాడి వెనుక మసూద్ హస్తం ఉంది. 
 
2025 నవంబర్ 10వ తేదీన ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు ఘటన దర్యాప్తులోనూ మసూద్ అజార్ పేరు మళ్లీ వెలుగులోకి వచ్చింది.   1999 డిసెంబర్‌లో ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం ఐసీ-814 హైజాక్ అయిన సమయంలో  ప్రయాణికుల ప్రాణాలను కాపాడేందుకు భారత జైలులో ఉన్న మసూద్ అజార్‌ను విడిచి పెట్టాల్సి వచ్చింది. ఆ తర్వాతే అతడు జైషే మహమ్మద్‌ను స్థాపించాడు. 
 
పహల్గామ్ ఉగ్రదాడికి నిరసనగా భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’లో భాగంగా బహావల్‌పూర్‌లోని ఉగ్ర స్థావరాలపై వైమానిక దాడులు జరిగాయి. ఈ దాడుల నుంచి మసూద్ అజార్ ప్రాణాలతో బయటపడినప్పటికీ, అతడి అక్క, బావ, మేనల్లుడు, ఐదుగురు పిల్లలతో సహా కుటుంబానికి చెందిన 10 మంది సభ్యులు, నలుగురు ముఖ్య అనుచరులు హతమయ్యారు.