పశ్చిమాసియా యుద్ధం, హొర్ముజ్ జలసంధి దిగ్బంధనంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న గల్ఫ్ దేశాలు అమెరికాతో స్నేహం చేసి నష్టపోయే కన్నా ఇరాన్‌తో రాజీ పడటమే మేలన్న నిర్ణయానికి వచ్చాయి. పశ్చిమాసియా యుద్ధం కారణంగా విడిపోయిన టెహ్రాన్-అబుదాబిల మధ్య దౌత్యపరమైన పురోగతికి బీజం పడింది. దీనికి సంకేతంగా ఇప్పటివరకు జరిగిన సంఘర్షణను పక్కనపెట్టి ‘సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించాలని’ కోరుకుంటున్నాయని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజిష్కియాన్ ప్రకటించారు.
న్యూఢిల్లీలో జరిగిన బ్రిక్స్ సదస్సు సందర్భంగా యూఏఈ యువరాజు షేక్ ఖాలెద్ బిన్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్‌తో సమావేశమైన మర్నాడే ఇరాన్ అధ్యక్షుడు ఈ వ్యాఖ్యలు చేశారు. ‘అబుధాబి యువరాజుతో మేం నిర్మాణాత్మకమైన చర్చలు జరిపాం’ అని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజిష్కియన్ తెలిపారు. ‘మేం పాత అధ్యాయాన్ని ముగించి భవిష్యత్ వైపు సాగాలని, దానిని కలిసి నిర్మించుకోవాలని అంగీకారానికి వచ్చాం’ అని ఆయన తెలిపారు.
మరోవైపు, హర్మూజ్ జలసంధి భవిష్యత్తుపై మాట్లాడేందుకు గల్ఫ్ దేశాలు ఇరాన్‌తో సమావేశం కావడంపై తనకు ఎలాంటి అభ్యంతరం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం తెలిపారు. సీనియర్ ఇరాన్ అధికారులతో చర్చలు జరపడం అనేది ఆయా దేశాల నిర్ణయానికే వదిలేస్తున్నట్లు చెప్పారు. పశ్చిమాసియాలో భద్రతా సహకారాన్ని బలోపేతం చేసుకోవడమే లక్ష్యంగా సోమవారం ఓమాన్‌లో గల్ఫ్ దేశాలు, ఇరాన్ మధ్య ఈ చర్చలు జరగనున్నాయి.
గత నెలలోనే ఇరాన్‌తో వాణిజ్య, ఆర్థిక లావాదేవీలను నిలిపివేస్తున్నట్లు యుఏఈ ప్రకటించిన సంగతి తెలిసిందే. అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడులకు ప్రతికారంగా యుఏఈతో సహా గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ దాడులు జరపడంతో ప్రాంతీయంగా తీవ్ర అలజడి రేగింది. ఆ దాడుల తదనంతరం ఇరాన్, యూఏఈ అగ్ర నాయకుల మధ్య జరిగిన అత్యున్నత స్థాయి భేటీ ఇదే కావడం గమనార్హం.
ఈ సమావేశంలో పెజెష్కియాన్ మాట్లాడుతూ ఇరాన్‌కు యూఏఈతో కానీ, ఇతర ప్రాంతీయ దేశాలతో కానీ ఎలాంటి సమస్యలు లేవని స్పష్టం చేశారు. అయితే గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా సైనిక స్థావరాల ఉనికిపైనే తమకు అభ్యంతరం ఉందని తెలిపారు. యుద్ధ సమయంలో తమ దేశంపై దాడి చేయడానికి అమెరికా ఈ స్థావరాలనే వాడుకుందని ఆయన ఆరోపించారు.
‘‘యూఏఈ సహా ఈ ప్రాంతంలోని ఇతర దేశాలు మా సహోదరులు. మేము చాలా కాలంగా కలిసి జీవిస్తున్నాం, వ్యాపారం చేసుకుంటున్నాం. ఒకరికొకరు మద్దతుగా నిలిచాం’’ అని ఆయన తెలిపారు. పొరుగు దేశాలపై దాడి చేయడానికి ‘శత్రువులు’ తమ భూభాగాన్ని ఉపయోగించుకోకుండా మిత్రదేశాలు చూడాలని ఇరాన్ అధ్యక్షుడు పిలుపునిచ్చారు.

More Stories
థేమ్స్ తీరంలో తొలిసారిగా గంగా హారతి
మరోసారి నఖ్వీ నుంచి ట్రోఫీ స్వీకరించని టీమ్ఇండియా
మహిళా ఆసియా టీ20కప్ విజేతగా భారత్