రాడార్‌కు దొరకని టెక్నాలజీతో చైనా యాంటీ షిప్ క్రూయిజ్ క్షిపణి

రాడార్‌కు దొరకని టెక్నాలజీతో చైనా యాంటీ షిప్ క్రూయిజ్ క్షిపణి

చైనా ఇటీవల వరుసగా ఆధునిక ఆయుధాల్ని పరీక్షిస్తోంది. తాజాగా స్టీల్త్ యాంటీ షిప్ క్రూయిజ్ మిస్సైల్‌ను పరీక్షించింది. ఇది బ్లాక్, రాడార్ అబ్సార్బింగ్ కోటింగ్ డిజైన్‌తో తయారైన క్షిపణి. అంటే, నల్లటి రంగుతో రాడార్లకు చిక్కకుండా, రహస్యంగా దూసుకెళ్లే క్షిపణి. ఈ తరహా క్షిపణులు రాడార్లకు చిక్కే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.

తాజాగా ప్రయోగించిన క్షిపణి గతంలో ప్రయోగించిన వైజే-18ఏ క్షిపణికి ఆధునిక వెర్షన్ అని సమాచారం. ఇది నౌకా విధ్వంసక క్రూయిజ్ క్షిపణి. అంటే, శతృవుల యుద్ధ నౌకలపై దాడి చేయగలదు. సముద్రంలోని చైనా యుద్ధ నౌక నుంచి వర్టికల్ లాంఛ్ ప్యాడ్ ద్వారా ఈ క్షిపణిని పరీక్షించారు. ఇది అత్యాధునిక, నౌకా విధ్వంసక క్షిపణిగా నిపుణులు చెబుతున్నారు. 

ఈ క్షిపణిపై బ్లాక్ కోటింగ్ ఉండటం వల్ల ఇది రాడార్లు గుర్తించే అవకాశాన్ని తగ్గిస్తుంది. పైగా సముద్రంపై ప్రయోగించినప్పుడు లోతులో నీరు నల్లగా ఉంటుందని, అందువల్ల ఆ రంగులో ఈ క్షిపణి కలిసిపోతుందని చైనా ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. నౌక విధ్వంసక క్షిపణుల ప్రధాన లక్ష్యం శతృవుల రాడార్లకు చిక్కకుండా ఉండటమే. అందుకోసమే దీనికి బ్లాక్ కోటింగ్ వేసినట్లు సమాచారం. 

7,500 టన్నుల 052డీ టైప్ లేదా 12,000 టన్నుల 055 డిస్ట్రాయర్లను మోసుకెళ్లగలదు. ఇది సబ్‌సోనిక్ స్పీడ్‌తో ప్రయాణించగలదు. గతంలో ప్రయోగించిన వైజే-18ఏ క్షిపణి సగటున గంటకు 540 కిలోమీటర్ల వేగంతో వెళ్లగలదు. టార్గెట్ సమీపించిన తర్వాత మరింత వేగాన్ని పుంజుకుని గంటకు 966 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. అయితే, తాజా క్షిపణికి సంబంధించిన శక్తి సామర్ధ్యాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.