కుల్గామ్ ఉగ్రదాడి వెనుక ఎల్ఈటి కమాండర్ సాజిద్ జుట్! 

కుల్గామ్ ఉగ్రదాడి వెనుక ఎల్ఈటి కమాండర్ సాజిద్ జుట్! 
దక్షిణ కాశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో ఇటీవల జరిగిన ఉగ్రవాద దాడికి, లాహోర్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కర్-ఎ-తైబా (ఎల్ఈటి) వ్యూహాత్మక కమాండర్ సాజిద్ జుట్‌కు సంబంధం ఉందని నిఘా సంస్థలు గుర్తించాయి. పహల్గామ్‌లో అంతకుముందు జరిగిన దాడి వెనుక కూడా ఇతనే సూత్రధారిగా ఉన్నాడని నిర్ధారించాయి. జమ్మూ కాశ్మీర్ అంతటా ఉగ్రవాద హింసను మళ్లీ ప్రేరేపించేందుకు సరిహద్దు అవతలి నుంచి పన్నిన ఒక కుట్రను ఈ కీలక సమాచారం వెల్లడిస్తోంది. 
 
పాకిస్థాన్‌లోని లాహోర్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సాజిద్ జుట్‌కు ఈ ప్రాంతంపై విస్తృతమైన అవగాహన ఉంది. ఎందుకంటే అతను 2005 నుండి 2007 వరకు దక్షిణ కాశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో పనిచేశాడు. స్థానిక పరిస్థితులపై తనకు ఉన్న అవగాహనను ఉపయోగించుకుని జుట్ కుల్గామ్ దాడికి ప్రణాళిక రచించాడు. ఏకె-47 అసాల్ట్ రైఫిల్స్‌తో వచ్చిన ఉగ్రవాదులు మోటార్‌సైకిళ్లపై వచ్చి ఈ దాడిని అమలు చేశారు. 
 
రాబోయే రోజుల్లో ‘పీర్ పంజాల్ ప్రాంతానికి దక్షిణాన’ (ఎస్ పిపిఆర్),  మధ్య కాశ్మీర్‌లో మరిన్ని దాడులు చేయడానికి లష్కర్ ప్రణాళికలు చేస్తోందని ముప్పు అంచనాలు సూచిస్తున్నాయి. ఈ దాడిలో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఇద్దరు వలస కూలీలు దురదృష్టవశాత్తు మరణించారు. ఈ హత్యను జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తీవ్రంగా ఖండించారు.
 
అమాయకుల ప్రాణాలు కోల్పోవడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు అండగా నిలిచేందుకు, ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఒక్కొక్కరికి రూ. 10 లక్షల చొప్పున ఎక్స్-గ్రేషియా ప్రకటించారు. జిల్లా యంత్రాంగం అందించిన రూ. 6 లక్షల తక్షణ సహాయానికి అదనంగా ఈ ఆర్థిక సాయం అందుతుంది. దీనితో ఒక్కో బాధితుడి కుటుంబానికి మొత్తం రూ. 16 లక్షల పరిహారం లభించినట్లవుతుంది. 
 
పెరుగుతున్న ముప్పు దృష్ట్యా, జమ్మూ కాశ్మీర్ అంతటా ఉన్న భద్రతా వ్యవస్థను సమగ్రంగా సమీక్షించేందుకు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఉన్నత స్థాయి భద్రతా సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. క్రియాశీల ఉగ్రవాద నెట్‌వర్క్‌లను నిర్వీర్యం చేయడానికి ఉగ్రవాద వ్యతిరేక వ్యవస్థలను బలోపేతం చేయడం, పెట్రోలింగ్ (పహారా)ను ముమ్మరం చేయడం, సున్నితమైన ప్రాంతాల్లో నిఘా పరిధిని విస్తరించడం వంటి బాధ్యతలను భారత సైన్యం, పోలీసు, పారామిలిటరీ దళాల ఉన్నతాధికారులకు అప్పగించారు.
 
కాగా, పాకిస్థాన్ మద్దతు గల ‘లష్కర్-ఏ-తైబా’ (ఎల్ఈటి)కు అనుబంధ సంస్థగా మరియు దాని తరపున కార్యకలాపాలు సాగించే (ప్రాక్సీ) సంస్థగా భావించబడుతున్న ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’ (టిఆర్ఎఫ్) ఈ దాడికి బాధ్యత వహించింది. సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న సందేశాల ప్రకారం, బయటి వ్యక్తులు, జమ్మూ కాశ్మీర్ పోలీసు సిబ్బందిపై మరిన్ని దాడులు చేస్తామని ఈ సంస్థ హెచ్చరించింది.