హెచ్‌-1బీ వీసాకు లక్ష డాలర్ల ఫీజుపై ట్రంప్‌కు కోర్టులో ఎదురుదెబ్బ

హెచ్‌-1బీ వీసాకు లక్ష డాలర్ల ఫీజుపై ట్రంప్‌కు  కోర్టులో ఎదురుదెబ్బ
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు అమెరికా ఫెడరల్ అప్పీల్స్ కోర్టు షాకిచ్చింది. విదేశీ ఐటీ నిపుణులు, భారతీయులకు ముఖ్యమైన హెచ్-1బీ వీసాల అంశంలో ఎదురుదెబ్బ తగిలింది. కొత్త హెచ్-1బీ వీసాల జారీపై విధించిన లక్ష డాలర్ల (దాదాపు రూ. 84 లక్షలు) భారీ ఫీజు వసూలు చేయకుండా ప్రభుత్వాన్ని నిరోధిస్తూ ఇచ్చిన తీర్పును ఎత్తివేయడానికి అమెరికా ఫెడరల్ అప్పీల్స్ కోర్టు నిరాకరించింది. 
 
జూన్ 8న ఆ లక్ష డాలర్ల ఫీజు చట్టవిరుద్ధమని బోస్టన్‌లోని 1వ యూఎస్ సర్క్యూట్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ తీర్పును యథాతథంగా కొనసాగించిందని రాయిటర్స్ తెలిపింది. కాకపోతే దీనిపై ప్రభుత్వం కోర్టులో సవాలు చేసేంత వరకు ఆ ఉత్తర్వు అమలులో ఉండేందుకు అవకాశం దక్కింది. అమెరికా ప్రభుత్వం కాంగ్రెస్ (పార్లమెంట్) ఆమోదం లేకుండానే కొత్త పన్నును విధించిందంటూ 20 మంది డెమోక్రటిక్ అటార్నీ జనరల్స్ పిటిషన్ దాఖలు చేశారు. 
 
ఈ వాదనతో న్యాయమూర్తి ఏకీభవిస్తూ ఈ భారీ రుసుము విషయంలో ప్రభుత్వం పరిధి మించిందని తీర్పు ఇచ్చారు. అమెరికా కాంగ్రెస్‌ ఆమోదం తెలపనందున దానిని చట్టవిరుద్ధమైనదిగా పరిగణిస్తున్నామని.. ఈ రుసుము చెల్లదంటూ కీలక తీర్పు ఇచ్చింది. బోస్టన్‌లోని యుఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి లియో సోరోకిన్ ఈ భారీ రుసుము పెంపు చట్టవిరుద్ధమైన పన్ను అని తీర్పు ఇచ్చారు. 
 
అమెరికా ప్రభుత్వం ఏ పేరు పెట్టినా ఈ రుసుము విధించే అధికారం కేవలం కాంగ్రెస్‌కు (పార్లమెంట్‌కు) మాత్రమే ఉంటుందన్నారు. తాజాగా ప్రభుత్వం అత్యవసర అభ్యర్థనను ముగ్గురు జడ్జిల అప్పీలేట్ ప్యానెల్ తిరస్కరించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సెప్టెంబర్ నెలలో హెచ్-1బి వీసా దుర్వినియోగం అవుతోందని, దానిని అరికట్టేందుకు లక్ష డాలర్ల భారీ రుసుము పెంచుతున్నట్లు ప్రకటన చేశారు.
 
నైపుణ్యం కలిగిన విదేశీ నిపుణులను నియమించుకోవడానికి ఐటీ కంపెనీలు, ఇతర సంస్థలు హెచ్-1బి వీసాలు జారీ చేస్తున్నారు. అమెరికా ప్రతి ఏటా 65,000 వీసాలను మంజూరు చేస్తుంది. వీరిలో పాటుగా అమెరికాలో మాస్టర్స్ చేసిన 20వేల మందికి హెచ్-1బి వీస ఇవ్వాలనే నిబంధన ఉంది. కొత్తగా ప్రకటించిన విధానానికి ముందు హెచ్-1బీ వీసా ఉద్యోగికి స్పాన్సర్‌షిప్ ఇవ్వడానికి ప్రభుత్వం రుసుముగా 2వేల డాలర్ల నుంచి 5వేల డాలర్లు చెల్లించేవారు. 
 
ఈ ఖర్చుల్ని కంపెనీలే భరిస్తాయి. ప్రస్తుతం ప్రతిపాదించిన లక్ష డాలర్ల రుసుము కేవలం కొత్తగా దరఖాస్తు చేసుకునే విదేశీయులకు మాత్రమే వర్తిస్తుంది. స్టూడెంట్ వీసాలపై ఇప్పటికే అమెరికాలో ఉన్న విదేశీ పౌరులకు ఈ రుసుము వర్తించదు. ట్రంప్ ప్రకటించిన రుసుమును భరించలేక చాలా కంపెనీలు హెచ్‌-1బీ నియామకాలను తగ్గించాయి. ఈ భారీ రుసుమును సవాల్‌ చేస్తూ కోర్టుల్లో పిటిషన్లు దాఖలయ్యాయి.