అమెరికా సైనిక స్థావ‌రాల‌పై ఇరాన్ భీక‌ర ప్ర‌తీకార దాడుల

అమెరికా సైనిక స్థావ‌రాల‌పై ఇరాన్ భీక‌ర ప్ర‌తీకార దాడుల

ఇరాన్ పై అమెరికా జరిపిన తాజా వైమానిక దాడులకు ప్రతీకారంగా గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలపై భారీ క్షిపణి, డ్రోన్ దాడులు చేసినట్లు ఇరాన్ ప్రకటించింది. ఫిబ్రవరిలో ప్రారంభమైన ఘర్షణల తర్వాత ఇదే తమ అతిపెద్ద ప్రతీకార ఆపరేషన్ అని ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) వెల్లడించింది. అమెరికా దాడుల్లో బందర్ అబ్బాస్, ఖెష్మ్ ద్వీపం పరిసరాల్లోని క్షిపణి, వైమానిక రక్షణ వ్యవస్థలు లక్ష్యంగా మారినట్లు సమాచారం.

కువైట్, ఖతార్, బహ్రెయిన్, ఒమన్, జోర్డాన్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై దాడులు నిర్వహించినట్లు ఐఆర్‌జీసీ ప్రకటించింది. కువైట్‌లో అమెరికా పేట్రియాట్ క్షిపణి వ్యవస్థలు, రాడార్ కేంద్రాలు, ఆయుధ నిల్వలను డ్రోన్లతో ధ్వంసం చేశామని తెలిపింది. అలాగే ఒమన్‌లోని డుక్మ్ పోర్టులో అమెరికా నౌకాదళానికి చెందిన సదుపాయాలు, బహ్రెయిన్‌లోని షేక్ ఇసా ఎయిర్‌బేస్, ఖతార్‌లోని అల్ ఉదైద్ ఎయిర్‌బేస్‌పై కూడా దాడులు చేసినట్లు పేర్కొన్న‌ది. 

జోర్డాన్‌లోని ప్రిన్స్ హసన్ ఎయిర్‌బేస్‌లో ఇంధన ట్యాంకులు, మందుగుండు సామగ్రి నిల్వలకు నిప్పు అంటించినట్లు కూడా ప్రకటించింది.  బహ్రెయిన్‌లోని అమెరికా డ్రోన్ ఫ్లీట్‌, రెండు క్షిపణి లాంచర్లు, క్షిపణులను నిల్వ చేసిన గిడ్డంగులను ధ్వంసం చేసినట్లు వెల్లడించింది. ప్రతీకారంగా అమెరికా సెంట్రల్ కమాండ్ ఇరాన్ భూభాగంలో లోపలి ప్రాంతాల్లో క్షిపణుల వర్షం కురిపించింది. 

హర్మూజ్ జలసంధి తమ నియంత్రణలోనే ఉందని అమెరికా, కాదు తమ నియంత్రణలోనే ఉందని ఇరాన్‌ ప్రకటించుకున్నాయి. దాడులు మళ్లీ జరిగితే మరింత తీవ్రంగా ప్రతిస్పందిస్తామని అమెరికాను ఇరాన్ హెచ్చరించింది.   వైమానిక రక్షణ వ్యవస్థలు, తీర ప్రాంత రాడార్లు, క్షిపణి, డ్రోన్ మౌలిక సదుపాయాలు, చిన్న యుద్ధ నౌకలను లక్ష్యంగా చేసుకున్నట్లు వెల్లడించింది.

హర్మూజ్‌ జలసంధిలో పౌర నౌకాయానానికి ముప్పు తగ్గించేందుకే ఈ చర్యలు చేపట్టినట్లు సెంట్‌కామ్ తెలిపింది. అంతకు ముందు హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణించే పౌర, వాణిజ్య నౌకలపై దాడులు చేసే ఇరాన్ సామర్థ్యాన్ని దెబ్బతీసేందుకే దాడులు నిర్వహిస్తున్నామని అమెరికా సెంట్రల్ కమాండ్ (సెంట్‌కామ్) ప్రకటించింది.

గత మూడు రాత్రుల్లో దాదాపు 300కి పైగా ఇరాన్ సైనిక లక్ష్యాలను, క్షిపణి వ్యవస్థలను, వాయు రక్షణ కేంద్రాలను ధ్వంసం చేసినట్లు ఫాక్స్ న్యూస్ వెల్లడించింది.  అమెరికా దాడులు జరుగుతున్న సమయంలోనే ఇరాన్ దళాలు ఓ పౌర నౌకపై కాల్పులు జరపడం గమనార్హం. అయితే వెంటనే రంగంలోకి దిగిన అమెరికా యుద్ధ విమానాలు ఇరాన్‌కు చెందిన ఒక క్రూయిజ్ క్షిపణిని, ఒక డ్రోన్‌ను గాల్లోనే కూల్చివేశాయని సెంట్‌కామ్ ప్రతినిధి ధ్రువీకరించారు.