ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా భైరవకోన

ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా భైరవకోన
ప్రకాశం జిల్లా సి.ఎస్.పురం మండలం ప్రసిద్ధి చెందిన భైరవకోనలోని  స్థానిక శ్రీ భైరవేశ్వర స్వామి వారి దేవస్థానంను ప్రముఖ ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా మరింతగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఆంధ్రప్రదేశ్ దేవదాయ ధర్మదాయ శాఖ, హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ (హెచ్ డిపిటి)ల ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన ‘ధార్మిక సదస్సు’లో ఈ విషయమై పలు నిర్ణయాలు  తీసుకున్నారు.
 
 ట్రస్ట్ చైర్మన్ డా. దాసరి శ్రీనివాసులు సారధ్యంలో జరిగిన సదస్సులో కనిగిరి ఆర్డీవో  శివరామిరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొనగా, దేవస్థానం కార్యనిర్వహణాధికారి వంశీకృష్ణారెడ్డి, ట్రస్ట్ బోర్డు సభ్యులు, ట్రస్ట్ ప్రతినిధులు హాజరై భక్తుల సమస్యలు, ఆలయ అభివృద్ధిపై చర్చించారు. హిందూ దఃర్మ పరిరక్షణకు, ఆలయాల అభివృద్ధికి ట్రస్ట్ ఆధ్వర్యంలో పలు చర్యలు చేపడుతున్నట్లు డా. దాసరి తెలిపారు. 
సదస్సుకు ముందుగా, తెల్లవారుజామున స్థానిక శాసనసభ్యులు డా. ముక్కు ఉగ్రనరసింహారెడ్డి భైరవకోన క్షేత్రానికి చేరుకొని ట్రస్ట్ చైర్మన్ డా. దాసరి శ్రీనివాసులును వ్యక్తిగతంగా కలిసి ఆలయ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.  అనంతరం ఇరువురు కలిసి స్వామి వారిని దర్శించుకుని,  పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
మార్కాపురం నుండి భైరవకోనకు బస్సు సౌకర్యం కల్పించాలని భక్తులు కోరగా, కనిగిరి ఆర్డీవో సానుకూలంగా స్పందించారు.  భక్తుల రాకపోకలకు ఇబ్బంది లేకుండా త్వరలోనే బస్సు సర్వీసులు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. దేవాలయంలో నిరుపేదలకు సామూహిక వివాహాలు, చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమాలు క్రమ పద్ధతిలో నిర్వహించాలని నిర్ణయించారు.

మారుమూల ప్రాంతాల్లో ఆదరణకు నోచుకోని దేవాలయాలలో భక్తుల సహకారంతో దీపం వెలిగించే నూతన కార్యక్రమాన్ని ట్రస్ట్ ద్వారా ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. ఆలయ పవిత్రతను కాపాడుతూ, సాధారణ భక్తులకు ఇబ్బంది కలిగించే విఐపి సంస్కృతిని తగ్గించాలని, ఆలయ మర్యాదలు  పాటించాలని నిర్ణయించారు.  అలాగే దేవాలయ ప్రాంగణంలో ‘దేవతా వృక్షాలను’ పెంచి పర్యావరణాన్ని కాపాడాలని తీర్మానించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు, కమిటీ సభ్యులు భైరవకోన క్షేత్రాన్ని ఆధ్యాత్మికంగా మరింత తీర్చిదిద్దుతామని పునరుద్ఘాటించారు. హైందవ సనాతన సంఘ్, సంత్ పరిషత్ జాతీయ అధ్యక్షులు త్రిపుర భారవేశ్వరానంద స్వామి, జాతీయ బ్రాహ్మణ యువజన కార్యదర్శి  సంగరాజ్ సాయి మనోజ్, ట్రస్ట్ సభ్యులు ముద్దులూరు వెంకటరాజు, మాజీ సర్పంచ్ శ్యామల నారాయణరాజు తదితరులు కూడా పాల్గొన్నారు.