మావోయిస్టుల అంతంతో ఛత్తీస్‌గఢ్‌ అడవుల్లో నూతన సూర్యోదయం

మావోయిస్టుల అంతంతో ఛత్తీస్‌గఢ్‌ అడవుల్లో నూతన సూర్యోదయం

కుట్టు పని నేర్చుకుంటున్న మాజీ మావోయిస్టు గౌరీ కుడియం

విజయిత సింగ్
 
30 ఏళ్ల గౌరీ కుడియం, తన భర్త అనిల్ పునెమ్‌ను ఎంతో ఆప్యాయంగా గుర్తుచేసుకుంటుంది. ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ జిల్లా బిజాపూర్ దట్టమైన అడవుల్లో, తాము పనిచేస్తున్న సమయంలోనే వారిద్దరూ కలుసుకున్నారు. 2022లో వివాహం చేసుకున్నారు. వారు కలిసి అడవుల్లో నడిచారు, వంటలు చేశారు, బుల్లెట్లను ఎదుర్కొన్నారు. 2025లో భద్రతా దళాలతో జరిగిన ఒక ఎన్‌కౌంటర్‌లో పునెమ్ మరణించేంత వరకు వారి ప్రయాణం సాగింది. 
 
ఈ ఏడాది జనవరి 15న, వందలాది మంది ఇతర మావోయిస్టు కార్యకర్తల మాదిరిగానే, కుడియం కూడా పోలీసుల ఎదుట లొంగిపోయింది. పునెమ్‌కు సంబంధించిన జ్ఞాపకంగా కుడియం వద్ద మిగిలింది కేవలం ఒక్క ఫోటో మాత్రమే. అది వారి పెళ్లి రోజున తీసిన చిత్రం, ప్రస్తుతం ఆమె ఫోన్ వాల్‌పేపర్‌గా ఉంది. “మేము పెళ్లి చేసుకోగలిగాము కానీ పిల్లలను కనలేకపోయాము. సీనియర్ నాయకుల ఆదేశాల మేరకు కార్యకర్తలందరూ వాసెక్టమీ శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చేది,” అని ఆమె చెబుతుంది.
 
అసలు తాను మావోయిస్టులలో ఎందుకు చేరాననే విషయాన్ని ఆమె ఇప్పుడు గుర్తు చేసుకుంటుంది: “వారి నృత్య, గాన బృందాల ప్రదర్శనలు నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. నాకు 16 ఏళ్లు ఉన్నప్పుడు నేను వారిలో చేరాను.” మూడు నెలల తర్వాత, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం చేపట్టిన ఒక కార్యక్రమం కింద, కుడియం ఇప్పుడు కుట్టు మిషన్ నడపడం నేర్చుకుంటోంది. ఆమె చేపట్టిన మొదటి పని: బిజాపూర్‌లోని ఒక వస్త్ర తయారీ కేంద్రంలో మహిళల కుర్తాను కుట్టడం.
 
2024 నుండి ఛత్తీస్‌గఢ్‌లో ప్రభుత్వ అధికారుల ఎదుట లొంగిపోయిన 2,762 మంది మావోయిస్టు తిరుగుబాటుదారులలో కుడియం కూడా ఒకరు. 2005 నుండి ఇప్పటివరకు, ఈ రాష్ట్రంలో మొత్తం 8,477 మంది లొంగిపోయారు. మార్చి 30న లోక్‌సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన ప్రసంగం ప్రకారం, భారతదేశవ్యాప్తంగా 2024 నుండి ఇప్పటివరకు 4,839 మంది మావోయిస్టు కార్యకర్తలు లొంగిపోయారు. 
 
గత ఏడాది నుండి, 2026 మార్చి చివరి నాటికి మావోయిస్టుల ఉనికి పూర్తిగా అంతమైపోతుందని ఆయన పదేపదే నొక్కి చెబుతున్నారు. గత రెండేళ్లలో 2,218 మంది మావోయిస్టులు అరెస్టు అయ్యారు. వామపక్ష తీవ్రవాదం కారణంగా అత్యంత తీవ్రంగా ప్రభావితమైన రాష్ట్రాలలో ఛత్తీస్‌గఢ్ ఒకటి.
 
 “నేను బస్తర్‌కు వెళ్లాను, బహిరంగ వేదికల మీద 50కి పైగా సార్లు ఈ విషయం చెప్పాను: మావోయిస్టులు తమ ఆయుధాలను విడిచిపెట్టి లొంగిపోవాలి, వారి పునరావాసం కోసం ప్రభుత్వం పూర్తి ఏర్పాట్లు చేస్తుంది అని… ప్రభుత్వ విధానం చాలా స్పష్టం: ఆయుధాలు అప్పగించి లొంగిపోయిన వారితో మాత్రమే చర్చలు జరుపుతాము; కానీ ఎవరైతే బుల్లెట్లు పేలుస్తారో, వారికి బుల్లెట్లతోనే సమాధానం ఇస్తాము,” అని ఆయన పేర్కొన్నారు. 
 
పశ్చిమ బెంగాల్‌లోని నక్సల్బరీలో, భూస్వామ్య యాజమాన్య వ్యవస్థకు, దానితో పాటు వచ్చే దోపిడీకి వ్యతిరేకంగా 1967లో జరిగిన రైతుల తిరుగుబాటుతో ఈ సాయుధ ఉద్యమం ప్రారంభమైంది. కమ్యూనిజం కొన్ని అంశాలతో కలిసి, ఇది భారతదేశ ద్వీపకల్ప రాష్ట్రాల అంతటా వ్యాపించింది. సాంప్రదాయకంగా గిరిజన భూములను మైనింగ్ కోసం ఉపయోగించడాన్ని కూడా ఒక సమస్యగా చేపట్టింది. 
 
ఆకట్టుకున్న పునరావాస పధకం 
 
కుడియం వంటి వందలాది మంది కోసం, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం, కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఎ) ఒక లొంగుబాటు, పునరావాస పథకాన్ని తీసుకువచ్చాయి. ఇది నైపుణ్య శిక్షణ, నెలవారీ భృతి, ఒక స్థిరమైన మొత్తాన్ని అందిస్తుంది.  దీనిని వారు మూడు సంవత్సరాల తర్వాత క్లెయిమ్ చేసుకోవచ్చు. లొంగిపోయిన మావోయిస్టుకు రూ. 50,000,  మూడు సంవత్సరాలలోపు వివాహం చేసుకుంటే అవివాహిత లేదా వితంతు మావోయిస్టులకు రూ.1 లక్ష లభిస్తుంది.
 
లొంగిపోయిన ఆయుధానికి “ప్రోత్సాహక మొత్తం” కూడా ఉంది: లైట్ మెషిన్ గన్‌కు రూ. 5 లక్షలు, ఏకే-47 రైఫిల్‌కు రూ. 4 లక్షలు, ఇన్సాస్ లేదా సెల్ఫ్-లోడింగ్ రైఫిల్‌కు రూ. 2 లక్షలు. రూ. 5 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ రివార్డు ఉన్న లొంగిపోయిన మావోయిస్టుకు పట్టణ ప్రాంతంలో గరిష్టంగా 1,742 చదరపు అడుగుల భూమిని, లేదా గ్రామీణ ప్రాంతాల్లో గరిష్టంగా 1 హెక్టారు వ్యవసాయ భూమిని కేటాయిస్తారు.
 
5 కిలోలు లేదా అంతకంటే ఎక్కువ బరువున్న ఇంప్రొవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (ఐఈడి)ను స్వాధీనం చేసుకోవడంలో సహాయపడితే ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం రూ. 15,000, 10 కిలోలు లేదా అంతకంటే ఎక్కువ బరువున్న ఐఈడిని స్వాధీనం చేసుకుంటే రూ. 25,000 ప్రోత్సాహకాన్ని కూడా అందిస్తుంది. అయితే, ఈ ప్రోత్సాహకాలు కుడియం లొంగిపోవడానికి కారణం కాదు. 
 
“గ్రామాల్లో ప్రజా విచారణలు నిర్వహించడంలో నాయకత్వానికి సహాయం చేయడమే నా పని. అగ్ర నాయకత్వం హత్యకు గురవడం, అరెస్టు కావడం లేదా లొంగిపోవడం వల్లే నేను లొంగిపోయాను,” అంటూ తాను ఎప్పుడూ ఒక్క తూటా కూడా పేల్చలేదని ఆమె చెబుతోంది.  సీనియర్ మావోయిస్ట్ కమాండర్ అయిన చంద్రయ్య అలియాస్ పాపారావు కూడా ఆయుధాలు విడిచిపెట్టడానికి ఇదే కారణం చెబుతున్నారు: నిషేధిత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) సీనియర్ నాయకత్వం పతనం కావడమే. రావు తలపై రూ. 25 లక్షల రివార్డు ఉండేది. మార్చి 24న, ఆయనతో పాటు మరో 18 మంది లొంగిపోయారు.
 
బసవరాజు మరణం ఓ నిర్ణయాత్మక మలుపు 
 
 “నారాయణపూర్‌లో బసవరాజు హత్యతో (మే 21, 2025) ఇదంతా మొదలైంది. మా నెట్‌వర్క్ ఛిన్నాభిన్నమైపోయింది. మేము ఒక చోట నుండి మరొక చోటికి కదలలేకపోయాము, ఒక రకంగా చిక్కుకుపోయాము; అందుకే లొంగిపోవాలని నిర్ణయించుకున్నాము,” అని అతను చెబుతాడు.
 
42,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన బస్తర్ ప్రాంతం, భారతదేశంలో వామపక్ష తీవ్రవాద ప్రభావం అత్యధికంగా ఉన్న ప్రాంతాలలో ఒకటిగా ఉంది. బస్తర్ ఇన్‌స్పెక్టర్ జనరల్ పి. సుందర్‌రాజ్ ప్రకారం, నారాయణపూర్ జిల్లాలో సిపిఐ (మావోయిస్టు) ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు (70) మరణం, ఈ ప్రాంతంలో మావోయిస్టు నెట్‌వర్క్‌ను నిర్మూలించడంలో ఒక “నిర్ణయాత్మక మలుపు”గా నిలిచింది.
 
2017-18లో ముల్లపల్ల రావు అలియాస్ గణపతి స్థానంలో బసవరాజు ఈ కూటమికి నాయకుడిగా బాధ్యతలు స్వీకరించారు. గణపతి ప్రస్తుతం తన 80వ దశకంలో ఉన్నారని, క్రియాశీలకంగా లేరని చెబుతారు. తాను బసవరాజును చివరిసారిగా 2016లో కలిశానని పాపారావు చెబుతున్నారు. బసవరాజు హత్య తర్వాత, సిపిఐ (మావోయిస్టు) అత్యున్నత నిర్ణయాధికార సంస్థ అయిన కేంద్ర కమిటీకి చెందిన కనీసం తొమ్మిది మంది సభ్యులు ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, జార్ఖండ్ రాష్ట్రాలలో జరిగిన ఎన్‌కౌంటర్లలో మరణించారు. మరో పది మంది అరెస్టు అయ్యారు.
 
మార్చి 30న, ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, జార్ఖండ్‌లోని వెస్ట్ సింగ్‌భూమ్ అనే రెండు జిల్లాల్లో మావోయిస్టుల ఉనికి తగ్గడంతో, వాటిని మినహాయించి భారతదేశం ఇప్పుడు “నక్సల్ రహిత” దేశంగా మారిందని అమిత్ షా లోక్‌సభలో ప్రకటించారు. 2013లో దేశంలో ఎల్‌డబ్ల్యుఇ  ప్రభావిత జిల్లాల సంఖ్య 126 కాగా, ‘రెడ్ కారిడార్’ ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, బీహార్, ఒడిశా రాష్ట్రాల్లో విస్తరించి ఉంది.
 
మార్చి 26న, హోం మంత్రిత్వ శాఖ  ఎల్‌డబ్ల్యుఇ ప్రభావిత జిల్లాలను పునఃవర్గీకరించింది. గతంలో ఉన్న “అత్యంత ప్రభావిత” వర్గీకరణ స్థానంలో “ఎల్‌డబ్ల్యుఇ ప్రభావిత”, “ఆందోళనకర జిల్లాలు”, “లెగసీ అండ్ థ్రస్ట్ జిల్లాలు”గా వర్గీకరించింది. ఈ విధంగా మొత్తం 38 జిల్లాలను వర్గీకరించింది.
 
తీవ్రమైన అంతర్గత సవాల్ మావోయిస్టులని పేర్కొన్న మన్మోహన్ 
 
2008-09లో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మావోయిస్టును భారతదేశంలో “అత్యంత తీవ్రమైన అంతర్గత భద్రతా సవాలు”గా అభివర్ణించినప్పటి నుండి, మావోయిస్టు వ్యతిరేక కార్యకలాపాలు కొనసాగుతూనే ఉన్నాయి. 2021 నుండి ఈ కార్యకలాపాలను ముమ్మరం చేశారు. 
 
ఆ సంవత్సరంలోనే “ప్రధాన ప్రాంతాలలో” 406 కొత్త సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ (సిఎపిఎఫ్) శిబిరాలను ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతాలలో చాలా వరకు గతంలో పరిపాలనా యంత్రాంగానికి అందుబాటులో ఉండేవి కావని, ఈ భద్రతా శూన్యత మావోయిస్టులు సమాంతర పరిపాలనను నడపడానికి దారితీసిందని  సుందర్ రాజ్ అంటున్నారు. ఈ శిబిరాలను ప్రారంభించిన తర్వాత రోడ్లు, పాఠశాలలు, ప్రజా పంపిణీ వ్యవస్థ దుకాణాల నిర్మాణం జరిగింది. 
 
2014 నుండి మావోయిజం ప్రభావిత ప్రాంతాలలో 17,589 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి అనుమతి లభించిందని, అందులో ఇప్పటికే 12,000 కిలోమీటర్ల రోడ్లు నిర్మించబడ్డాయని, దాదాపు 5,000 మొబైల్ టవర్లు ఏర్పాటు చేసిన్నట్లు అమిత్ షా తెలిపారు. అదే సంవత్సరంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధికారంలోకి వచ్చింది. రోడ్డు అనుసంధానం మెరుగుపడటంతో, మైనింగ్ కార్యకలాపాలు కూడా ఊపందుకున్నాయి.  నారాయణ్‌పూర్, బీజాపూర్ మధ్య రహదారులపై వందలాది ట్రక్కులు తిరుగుతుంటాయి.
 
ఒక పోలీసు అధికారి మాట్లాడుతూ, “రెండు సంవత్సరాల క్రితం వరకు, ఇంత భారీ సంఖ్యలో ట్రక్కులు, అది కూడా పగటిపూట సాయంత్రం 4 గంటల తర్వాత తిరగడం ఊహించలేనటువంటి విషయం” అని పేర్కొన్నారు. 
 
నారాయణ్‌పూర్ జిల్లాలోని అబుజ్‌మాడ్ ప్రాంతం పరిధిలోకి వచ్చే, ‘మావోయిస్టుల రాజధాని’గా పరిగణించబడే కచ్చపాల్ గ్రామానికి 2025లో మొదటిసారిగా ఒక రహదారి వచ్చింది. ఆ గ్రామంలో 24 కుటుంబాలు ఉన్నాయి. మావోయిస్టుల భయంతో ఇళ్లు వదిలి పారిపోయిన మూడు కుటుంబాలు కొన్ని నెలల క్రితం తిరిగి రావడంతో, గ్రామంలోని ఇళ్ల సంఖ్య మొత్తం 27కి చేరింది. 
 
గ్రామంలో నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) దుకాణానికి శంకుస్థాపన జరుగుతోంది. రోడ్డు తవ్వకం పనులు కొనసాగుతున్నాయి. ఈ రహదారి చివరికి ఈ గ్రామాన్ని ఒక జాతీయ రహదారికి, అక్కడి నుండి మహారాష్ట్రలోని గడ్చిరోలికి కలుపుతుంది. గతంలో దారులలో ఐఈడీలను అమర్చేవారని గ్రామస్తులు చెబుతున్నారు.
 
మొదటిసారిగా మొబైల్ కనెక్టివిటీ
 
గత ఏడాదే ఇక్కడ మొదటిసారిగా మొబైల్ కనెక్టివిటీ వచ్చిందని స్థానికులు అంటున్నారు. శిథిలావస్థలో ఉన్న ఒక పంచాయతీ భవనం తప్ప, గ్రామంలో పరిపాలన వ్యవస్థ లేదని కూడా వారు చెబుతున్నారు. 2025లో దీనికి కొత్త రూపునిచ్చారు. మావోయిస్టుల భయంతో తాను ఇక్కడ ఉండలేకపోయానని ఆ గ్రామ సర్పంచ్ రాజ్ కుమారి నూరితి చెప్పారు. 
 
“నేను నారాయణ్‌పూర్ పట్టణంలో ఉండేదాన్ని. వాళ్ళు మమ్మల్ని రోడ్డు కట్టనివ్వలేదు. వారిలో చాలామంది మా గ్రామానికి చెందినవారే,” అని ఆమె తెలిపారు. అదే సంవత్సరం, గ్రామానికి సమీపంలోని ఇరాక్‌భట్టిలో ఒక సరిహద్దు భద్రతా దళం (బిఎస్ఎఫ్) శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఆ శిబిరంపై మావోయిస్టులు దాడి చేశారని ఒక పోలీసు అధికారి తెలిపారు. ఇక్కడ పనిచేస్తున్న సంస్థాగత ఉనికికి ఉన్న ఏకైక చిహ్నం, 1998లో ఈ గ్రామంలో తొలిసారిగా ప్రారంభమైన విశాలమైన రామకృష్ణ మిషన్ ఆశ్రమం. 
 
హింసాత్మక కాలమంతటా, మావోయిస్టుల వల్ల ఆ ఆశ్రమానికి ఎన్నడూ హాని జరగలేదు. తాత్కాలికంగా నిర్మించిన కట్టడంలో పనిచేసే ఒక ప్రాథమిక పాఠశాల, 2025 నవంబర్‌లో పనిచేయడం ప్రారంభించింది. ఇప్పటి వరకు విద్యార్థులందరూ ఆశ్రమం నడుపుతున్న పాఠశాలకు వెళ్లేవారు. గిరిజన మాండలికమైన మడియా మాతృభాషగా ఉన్న ఆ గ్రామస్థులు అనర్గళంగా హిందీ మాట్లాడటానికి ఇదే కారణం. 
 
60 కిలోమీటర్ల దూరంలో ఉన్న నారాయణ్‌పూర్ పట్టణం నుండి రోజూ ప్రయాణించి వచ్చే పాఠశాల ప్రిన్సిపాల్ తలేశ్వరి పూజారి, తమ పాఠశాలలో 1, 2 తరగతులలో ఆరుగురు విద్యార్థులు చదువుతున్నారని చెప్పారు. “ఇక్కడ చాలా మంది విద్యార్థులు ఆశ్రమానికి వెళ్తారు. మేము ఒక తాత్కాలిక భవనం నుండి నడుపుతున్నాము, కానీ త్వరలోనే మాకు సరైన భవనం లభిస్తుంది’ అని తెలిపారు. 
 
“1986 వరకు ఇక్కడ ఒక పాఠశాల ఉండేది. మేము విద్యార్థులకు హిందీ, ప్రాథమిక గణితం బోధిస్తున్నాము. ఆ విద్యార్థులకు చదవడం, రాయడం రాదు; ఇప్పుడు వారి అభ్యసనలో మెరుగుదల చూస్తున్నాము. ఇంతకుముందు, మమ్మల్ని చూడగానే వారు పారిపోయేవారు, అందుకే మేము వారిని వెనక్కి తీసుకురావాల్సి వచ్చేది,” అని పూజారి వివరించారు. 
 
పంచాయతీ భవన్ ముందు ఒక చెట్టు కింద ప్రజలు నిలబడి మాట్లాడుకుంటున్నారు. మావోయిస్టులకు, భద్రతా దళాలకు మధ్య గ్రామస్థులు నలిగిపోయారని జైసురామ్ వర్దా చెప్పారు. “ఇద్దరూ మమ్మల్ని సమాచారం అందించేవారని ఆరోపించారు. ఇద్దరూ మమ్మల్ని కొట్టారు. మేము మావోయిస్టులకు ఆహారం, మద్దతు అందిస్తున్నామని పోలీసులు అన్నారు. గత సంవత్సరం నుండి మేము స్వేచ్ఛగా తిరగగలుగుతున్నాము. నిర్మాణ పనులు మాకు కొంత ఉపాధిని కల్పిస్తున్నాయి,” అని ఆయన చెప్పారు.
 
మావోయిజం ప్రభావిత ప్రాంతాల నివాసితులకు గృహ రాయితీని అందించే కేంద్ర ప్రభుత్వ పథకమైన ‘ప్రధాన మంత్రి జన్మన్ ఆవాస్ యోజన’ కింద నిర్మించిన తన ఇంటిని చూపిస్తూ మరో గ్రామస్తురాలు చంద్రిక వడ్డే ఇలా అన్నారు: “వారు గోడలకు బయట రంగులు వేశారు, కానీ లోపల గోడలు ఖాళీగా, కేవలం ఇటుకలు, సిమెంటుతో ఉన్నాయి. గదులు చాలా చిన్నవిగా ఉన్నాయి. ఇక్కడ ఎలా జీవించగలరు?” అని ప్రశ్నించారు. 
 
మావోయిస్టులలో చేరిన సోదరుడు ఉన్న రైతు సోను రామ్ అచ్లా మాట్లాడుతూ, ఆశ్రమం ప్రాథమిక వైద్య సౌకర్యాలు కల్పిస్తున్నప్పటికీ, ఏదైనా తీవ్రమైన చికిత్స కోసం సమీప పట్టణానికి కాలినడన వెళ్లాల్సి వస్తోందని, దీనికి దాదాపు ఒక రోజు పడుతుందని చెప్పారు. తమకు శుభ్రమైన తాగునీరు కావాలని గ్రామస్తులు అంటున్నారు. గ్రామంలో సౌరశక్తితో నడిచే నీటి ట్యాంకులను ఏర్పాటు చేసినప్పటికీ, తమ ఇళ్లకు తాగునీరు అరుదుగా చేరుతోందని ఒక గ్రామస్తుడు వాపోయాడు. 
 
మావోయిస్టుల స్థావరాల గుర్తింపులో లొంగిపోయిన వారు 
 
గతంలో, ‘పోలీసులకు సమాచారం అందిస్తున్నారనే’ కారణంతో ముగ్గురు గ్రామస్తులను మావోయిస్టులు చంపేశారని ఆయన తెలిపారు. లొంగిపోయిన కొందరు మావోయిస్టు కార్యకర్తలు కూడా ఆ సాయుధ బృందం ప్రధాన కార్యాచరణ ప్రాంతాలను గుర్తించడంలో భద్రతా దళాలకు సహాయపడ్డారు.
 
“బసవరాజు హత్య తర్వాత, అతని తాజా ఫోటో మా వద్ద లేకపోవడంతో, చనిపోయింది అతనే అని నిర్ధారించుకోవాలనుకున్నాం. అతని రక్షణ బృందంలో భాగంగా ఉన్న, లొంగిపోయిన కొందరు మావోయిస్టులు మృతదేహాన్ని గుర్తించడంలో, అలాగే అతను ఉండే ప్రదేశాన్ని కచ్చితంగా తెలుసుకోవడంలో మాకు సహాయపడ్డారు,” అని  సుందర్‌రాజ్ తెలిపారు.
 
మావోయిస్టుల నెట్‌వర్క్‌లోకి చొచ్చుకుపోవడం ఒక సవాలుతో కూడిన పని. ఎందుకంటే, వారి నాయకులు సమాచార మార్పిడి కోసం మానవ దూతలపై ఆధారపడేవారు. ఎలక్ట్రానిక్ పరికరాల వాడకం చాలా తక్కువగా ఉండేది. జిల్లా రిజర్వ్ గార్డ్స్ (డిఆర్జి)గా, ఆ తర్వాత బస్తర్ ఫైటర్స్‌గా నియమితులైన గిరిజనులు భద్రతా దళాలను కేడర్ల వైపు నడిపించారు. దీంతో ఆ సంస్థ ముక్కలై, వేర్వేరు ప్రాంతాలకు చెల్లాచెదురైంది.
 
ఈ రెండు ప్రత్యేక దళాలలో కూడా కొద్ది శాతం లొంగిపోయిన మావోయిస్టులు ఉన్నారు. కనీస విద్యార్హతను 5వ తరగతికి సడలించారు. “పూర్తిస్థాయి కేంద్ర కమిటీ , పొలిట్‌బ్యూరో చివరిసారిగా 2017-18లో సమావేశమయ్యాయి. గత ఆరేళ్లుగా అలాంటి సమావేశం జరగలేదు,” అని సుందర్‌రాజ్ చెప్పారు. 2020 నుంచి ఉన్నత నాయకత్వం క్రమబద్ధమైన సమావేశం జరపలేదని రావు అంటున్నారు. 
 
జగదల్‌పూర్ పట్టణంలో, తన ఆరుగురు తోబుట్టువులలో పెద్దదైన 27 ఏళ్ల ఫూల్‌మతి మాండవి, ఒక కేఫ్‌లో అతిథులతో సంబంధాలు మెలగడం నేర్చుకుంటోంది. ఆమె 14 ఏళ్ల వయసులో మావోయిస్టులలో చేరి, 2025లో ఆయుధాలు విడిచిపెట్టింది. పాండం కేఫ్ బస్తర్ పోలీసుల సహకారంతో నడుస్తోంది. ఇందులో లొంగిపోయిన మావోయిస్టులు, ఎల్‌డబ్ల్యుఇ హింసాకాండ బాధితులు పనిచేస్తున్నారు. 
 
కేఫ్ యజమాని తుపేష్ చంద్రకర్ మాట్లాడుతూ, తమ కేఫ్‌లో 20 మంది ఉద్యోగులు ఉన్నారని, వారిలో ఏడుగురు లొంగిపోయిన మావోయిస్టులు కాగా, ఐదుగురు బాధితుల కుటుంబాలకు చెందినవారని చెప్పారు. ప్రభుత్వం లొంగిపోవడాన్ని ప్రోత్సహిస్తుండటంతో, పోలీసు వర్గాల్లో ఆందోళన నెలకొంది.
 
“ఈ వ్యక్తులు మా సహచరులను చంపారు. బాంబు పేలుళ్లలో మాలో చాలా మంది చేతులు, కాళ్లు కోల్పోయారు. ఇప్పుడు, ఈ వ్యక్తులను రక్షించమని, ప్రభుత్వ పథకాల కోసం వారికి పత్రాలు సిద్ధం చేయమని మమ్మల్ని అడుగుతున్నారు. వారిని ఎందుకింత గారాబం చేస్తున్నారు?” అని ఛత్తీస్‌గఢ్ పోలీసు అధికారి ఒకరు ప్రశ్నించారు.  2001 నుంచి రాష్ట్రంలో మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్లలో 1,318 మంది భద్రతా సిబ్బంది మరణించారు. దేశవ్యాప్తంగా ఈ సంఖ్య సుమారు 2,700గా ఉంది. బోడి ఆమ్లా తన అక్కతో కలిసి మావోయిస్టులలో చేరినప్పుడు ఆమె వయసు 16 సంవత్సరాలు. 
 
“నేను జనవరి 15న లొంగిపోయాను. మా నాయకులను కూడా అరెస్టు చేయడంతో మాకు దాక్కోవడానికి చోటు లేకుండా పోయింది. నేనూ, నా సోదరి వేర్వేరు జోన్లలో పనిచేసేవాళ్ళం. ఆమె ఇప్పటికీ ఆ సంస్థలోనే [సీపీఐ(మావోయిస్ట్)] ఉంది. ఆమె తెలంగాణలో ఉందని కొందరు అంటున్నారు. ఆమె ఎక్కడుందో నాకు తెలియదు,” అని గతంలో ఇన్సాస్ రైఫిల్‌తో ఆయుధాలు కలిగి ఉండే ఆమ్లా తెలిపారు. ఛత్తీస్‌గఢ్‌లో సుమారు 30-40 మంది మావోయిస్టుల బృందం చురుకుగా ఉందని సుందర్‌రాజ్ అంటున్నారు.
(ది హిందూ నుండి)