దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి

దిగ్గజ గాయని ఆశా భోంస్లే మృతి

* రాష్ట్రపతి, ప్రధానిలతో సహా పలువురు సంతాపం 

భారతీయ సంగీత ప్రపంచంలో ఒక అద్భుత స్వర శకం ముగిసింది. దిగ్గజ గాయని, పద్మ విభూషణ్ గ్రహీత ఆశా భోంస్లే (92) ఆదివారం మధ్యాహ్నం కన్నుమూశారు. శనివారం సాయంత్రం తీవ్రమైన అలసట, ఛాతీ ఇన్ఫెక్షన్‌తో ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చేరిన ఆమె, పరిస్థితి విషమించడంతో ఐసీయూలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.  తొలుత ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వార్తలు వచ్చినప్పటికీ, ఆదివారం మధ్యాహ్నం ఆమె కుమారుడు ఆనంద్ భోంస్లే మరణవార్తను అధికారికంగా ధృవీకరించారు.

ఎనిమిది దశాబ్దాల పాటు 20కి పైగా భాషల్లో వేల పాటలతో కోట్లాది మందిని అలరించిన ఆమె మరణంతో బాలీవుడ్ సహా భారతీయ చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది.  దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, భారతరత్న లతా మంగేష్కర్ సోదరి అయిన ఆశా భోంస్లే అంతిమ సంస్కారాలు సోమవారం ముంబైలోని శివాజీ పార్క్‌లో పూర్తి ప్రభుత్వ అధికారాలతో నిర్వహించనున్నారు. ఆమె మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేస్తూ, సంగీత ప్రపంచం ఒక ధ్రువతారను కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రముఖ నేపథ్య గాయని ఆశా భోస్లే మృతి పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము  సంతాపం తెలిపారు. ఆమె మరణం సంగీత ప్రపంచంలో పూడ్చలేని లోటును సృష్టించిందని చెప్పారు. ఒక దిగ్గజ గాయనిగా ఆమె అద్భుతమైన ప్రస్థానం భారతదేశ సంగీతంలో ఒక శకానికి నిర్వచనం ఇచ్చిందని శ్రీమతి ముర్ము ఒక పోస్ట్‌లో పేర్కొన్నారు. “ఆశా భోస్లే గారి మరణం సంగీత ప్రపంచంలో పూడ్చలేని లోటును సృష్టించింది. ఒక దిగ్గజ గాయనిగా ఆమె అద్భుతమైన ప్రస్థానం భారతదేశ సంగీతంలో ఒక శకానికి నిర్వచనం ఇచ్చింది,” అని రాష్ట్రపతి తెలిపారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, భోస్లేను దేశం ఇప్పటివరకు చూసిన అత్యంత విశిష్టమైన, బహుముఖ ప్రజ్ఞ గల గాయకులలో ఒకరిగా అభివర్ణించారు. ఆమె మరణం తనను తీవ్రంగా బాధించిందని కూడా తెలిపారు. తన చివరి పోస్ట్‌లో ప్రధానమంత్రి, భోస్లే తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటారని, ఆమె పాటలు ప్రజల జీవితాల్లో ఎప్పటికీ ప్రతిధ్వనిస్తూనే ఉంటాయని పేర్కొన్నారు. 

మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ మాట్లాడుతూ, “మూడేళ్ల క్రితం తన 90వ పుట్టినరోజును ఎంతో ఉత్సాహంగా జరుపుకున్న పద్మవిభూషణ్, మహారాష్ట్ర భూషణ్ సీనియర్ గాయని ఆశా భోస్లే మరణవార్త తీవ్ర విచారాన్ని కలిగిస్తోంది” అని తెలిపారు. మంగేష్కర్ కుటుంబం నుంచి మరో తార కన్నుమూశారని ఆయన  నివాళులు అర్పించారు.  ఆశా భోస్లే మరణంపై సంతాపం తెలుపుతూ మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ఎక్స్ లో ఇలా రాశారు, “ఆశా భోస్లే మరణవార్త విని తీవ్రంగా విచారించాను. భారతీయ సంగీత ప్రపంచంలోని ఒక అమర కంఠం ఈరోజు మూగబోయింది. ఆమె స్వరాలు ఎన్నో తరాలకు ఆనందాన్ని పంచాయి, లెక్కలేనన్ని భావోద్వేగాలను తాకాయి.”

ఆశా భోస్లే 1933లో మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లా గోవర్‌లో జన్మించారు. తండ్రి పండిట్ దీనానాథ్ మంగేష్కర్, ప్రముఖ శాస్త్రీయ గాయకుడు, నటుడు. తల్లి శేవంతి మంగేష్కర్. దివంగత గాయనీ లతా మంగేష్కర్, ఆశా భోస్లే సోదరే. మీనా ఖాదికర్, ఉషా మంగేష్కర్, హృదయనాథ్ మంగేష్కర్ ఆమె తొబుట్టువులు.  తండ్రి దీనానాథ్ మంగేష్కర్ ఆమె బాల్యంలోనే మరణించారు. అయితే ఆయన నుంచి వారసత్వంగా అందించిన సంగీతం, ఆమెకు ప్రపంచ స్థాయిలో గుర్తింపునిచ్చింది.

ఆమె సంగీతం ప్రస్థానం 11వ ఏటనే మొదలైంది. 1943లో తొలిసారి మరాఠీ చిత్రం మజాబాల్​లో ‘చలా చలా నవ్ చలా’ అనే పాట పాడారు. అలా ఇప్పటివరకు ఆశా భోస్లే వెయ్యికి పైగా చిత్రాల్లో 12 వేలకుపైగా పాటలకు తన గాత్రం అందించారు. ఇందులో ‘దమ్ మార్ దమ్’, ‘యే మెరా దిల్ ప్యార్​ కా దీవానా’ పాటలు అప్పట్లో సంచలనం సృష్టించాయి. ఏడుసార్లు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు గెలుచుకున్న ఆమె, రెండుసార్లు జాతీయ ఉత్తమ గాయని అవార్డు అందుకున్నారు.

ఇక 2000లో దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డు, 2001లో ఫిల్మ్‌ఫేర్‌ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్, 2002లో బీబీసీ ‘లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్’ పురస్కారం అందుకున్నారు.  2008లో ఆమెను కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్‌ పురస్కారంతో గౌరవించింది. ఇక 2011లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో ఆశా భోస్లేకు చోటు దక్కింది. ఎనిమిది దశాబ్దాలకు పైగా సాగిన ఆమె ప్రస్థానంలో వేల సంఖ్యలో పాటలు పాడి, ప్రపంచంలోనే అత్యధిక రికార్డింగ్‌లు చేసిన గాయనిగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించారు. 

గజల్స్‌, పాప్‌, ప్రైవేట్‌ ఆల్బమ్స్ విభిన్న శైలిల్లో ఆమె శ్రోతలను ఉర్రూతలూగించారు. దశాబ్దాల తరబడి బాలీవుడ్‌లోనే కాదు 20కి పైగా దేశవిదేశీ భాషలలో వివిధ చిత్రాల్లో పాటలు పాడారు. 16 ఏళ్ల వయసున్నప్పుడే ఆశ, 31 ఏళ్ల గణపత్‌ రావ్‌ భోస్లేను ప్రేమ వివాహం చేసుకున్నారు. వీళ్లకు ముగ్గురు పిల్లలు. అయితే పలు కారణాలతో 1960లో తన భర్త నుంచి విడాకులు తీసుకున్నారు.  1980లో ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్‌డీ బర్మన్‌ను వివాహమాడారు. 1994లో ఆయన మృతి చెందారు. అప్పట్నుంచి తన పిల్లలు, మనవడు- మనవరాలే లోకంగా గడుపుతున్నారు.