తెలంగాణ వ్యాప్తంగా భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. వేసవి తీవ్రత రోజురోజుకూ పెరుగుతుం డటంతో ఎండలు మండుతున్నాయి. ఉదయం తొమ్మిది గంటల నుంచే సూర్యుడు తన భగభగలను మొదలుపెడుతుండటంతో జనం బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. రానున్న మూడు రోజుల్లో ఎండలు మరింత ముదిరే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
ఏప్రిల్ 12 నుంచి రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఉష్ణతరంగ పరిస్థితులు ఏర్పడనున్నాయి. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదయ్యే అవకాశం ఉంది. ఉత్తర, తూర్పు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో తీవ్ర పరిస్థితులు నెలకొని, కొన్ని చోట్ల ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల వరకు చేరే అవకాశం ఉంది. హైదరాబాద్ నగరంలో కూడా ఏప్రిల్ 12 నుంచి 22 వరకు వరుసగా 10 రోజుల పాటు 40-41 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.
ఈ క్రమంలోనే రెండు రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేస్తూ, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. బుధవారం రాష్ట్రంలో 26 జిల్లాలో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ క్రమంలో రాష్ట్రంలో శుక్రవారం నల్గొండ, సూర్యాపేట, వనపర్తి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇవ్వగా, శనివారం 18 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మిగిలిన జిల్లాలకు వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ఆరెంజ్ ఆలర్ట్ జిల్లాల్లో ఎండల తీవ్రత ప్రమాదకర స్థాయికి చేరుకునే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక్కడ ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉన్నట్లుగా అంచనా వేసింది. మధ్యాహ్నం వేళల్లో వేడి గాలులు వీచే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రాకపోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు

More Stories
విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగుల జీవితాలతో చెలగాటం వద్దు
ఉత్తమ నటీనటులుగా నాగ చైతన్య, రష్మిక
ఆదిలాబాద్లో అతిపెద్ద విమానాశ్రయం నిర్మాణం