విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడవద్దని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖను హైకోర్టు హెచ్చరించింది. విశ్రాంత ఉద్యోగులు చాలా సున్నితంగా ఉంటారని, వాళ్లు ప్రభుత్వ సొమ్ము అడగడం లేదని, వారికి సంబంధించిన రిటైర్మెంట్ ప్రయోజనాల బకాయిలనే అడుగుతున్నారని వ్యాఖ్యానించింది. సర్వీసులో ఉన్న ఉద్యోగుల వేతనాలు నిలిపేసినా ఒకటి రెండుసార్లు ప్రభుత్వానికి అవకాశమిస్తాం కానీ రిటైర్డ్ ఉద్యోగుల విషయంలో సహించేది లేదని స్పష్టం చేసింది.
రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించాలని గురువారం నాటి విచారణ జాబితాలో 754 పిటిషన్లు ఉన్నాయని, అందులో ఒక్కో పిటిషన్లో ఒకటి నుంచి పది మంది పిటిషనర్లుగా ఉండే అవకాశం ఉందని తెలిపింది. ఒక్కో పిటిషన్ వారీగా ఎవరెవరికి ? ఎంత ? బకాయిలు చెల్లించారో వివరిస్తూ అమలు నివేదికను సమర్పించాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. విచారణను జూన్ 10కి వాయిదా వేస్తున్నామని, అప్పటివరకు తమకు బకాయిలు రాలేదని ఏ ఒక్కరూ చెప్పకూడదని తెలిపింది.
ఈ ఆదేశాలు అమలు కాకపోతే ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా తమ ఎదుట ప్రత్యక్షంగా హాజరై వివరణ ఇవ్వాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. తమకు రావాల్సిన రిటైర్మెంట్ ప్రయోజనాలను ప్రభుత్వం చెల్లించడం లేదంటూ వివిధ శాఖల నుంచి రిటైర్ అయిన పోలీసులు, టీచర్లు, ఇంజనీర్లు, ఇతర ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు.
వీటిపై గతంలో విచారణ చేపట్టిన జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావు ధర్మాసనం ఏప్రిల్ 9 నాటికి మొత్తం బకాయిలు చెల్లించాలని, లేకపోతే ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి ప్రత్యక్షంగా హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. తాజాగా గురువారం ఈ పిటిషన్లు మళ్లీ విచారణకు వచ్చాయి. ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ గురువారం నాటి విచారణ జాబితాలో మొత్తం 754 పిటిషన్లు ఉన్నాయని, ఇందులో 737 పిటిషన్లలో ఉన్న దాదాపు 4 వేల మందికి చెల్లించామని తెలిపారు.
టోకెన్ నెంబర్ల విషయంలో సాంకేతిక సమస్యలున్న 400 మందికి మాత్రమే నిధులు విడుదల కాలేదని తెలిపారు. ఈ వాదనలను పిటిషనర్ల న్యాయవాదులు వ్యతిరేకించారు. క్లయింట్లతో మాట్లాడామని.. నిధులు రాలేదని, ప్రస్తుతం విచారణ జాబితాలో 754 పిటిషన్లలో కేవలం 221 పిటిషన్లలో మాత్రమే బకాయిలు విడుదలయ్యాయని పేర్కొన్నారు. ఈ వాదనను ప్రభుత్వ న్యాయవాది వ్యతిరేకించారు. తన వద్ద ట్రెజరీ విభాగం అందజేసిన నివేదిక ఉందని, కావాలంటే తనిఖీ చేసుకోవచ్చని పేర్కొన్నారు.

More Stories
ఉత్తమ నటీనటులుగా నాగ చైతన్య, రష్మిక
ఆదిలాబాద్లో అతిపెద్ద విమానాశ్రయం నిర్మాణం
తెలంగాణలో గోరక్ష చట్టాలను కఠినంగా అమలు చేయాలి