* వైమానిక దాడిలో హెజ్‌బొల్లా నాయకుడి కార్యదర్శి మృతి
అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణకు సంబంధించిన చర్చల్లో పాకిస్థాన్ పాత్రపై ఇజ్రాయెల్ సందేహం వ్యక్తంచేసింది. పాకిస్థాన్ మధ్యవర్తిత్వంపై తమకు నమ్మకం లేదని పేర్కొంది. భారత్ లోని ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్ ఓ వార్తాసంస్థతో మాట్లాడుతూ పాకిస్థాన్‌ను తాము విశ్వసించలేమని, అమెరికా తన స్వప్రయోజనాల కోసం పాక్ మధ్యవర్తిత్వాన్ని ఉపయోగించుకోవాలని నిర్ణయించుకున్నదని తాము భావిస్తున్నట్లు అజార్ తెలిపారు.
ఈ సందర్భంగా ఖతార్, తుర్కియే వంటి సమస్యాత్మక దేశాల ద్వారా హమాస్‌తో అమెరికా కుదుర్చుకున్న ఒప్పందం గురించి అజార్ ప్రస్తావించారు. ఇరాన్‌లో తాము అనుకున్న లక్ష్యాలు సాధించేందుకు యూఎస్ సమన్వయంతో ముందుకుసాగడం తమకు చాలా ముఖ్యమని అన్నారు. ఇక అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణకు మద్దతు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.
అయితే లెబనాన్‌పై మాత్రం తమ సైనిక చర్యలు కొనసాగుతాయని పునరుద్ఘాటించారు. ఇరాన్‌పై జరిపిన ఆపరేషన్‌కు, లెబనాన్‌కు ఎలాంటి సంబంధం లేదని అజార్ స్పష్టం చేశారు. దక్షిణ లెబనాన్ ప్రాంతం నుంచి హెజ్‌బొల్లా మౌలిక సదుపాయాలను పూర్తిగా నిర్మూలించడమే తమ లక్ష్యమని చెప్పారు. అది ఇజ్రాయెల్ బాధ్యతగా అభివర్ణించారు. ఇరాన్‌తో జరగబోయే చర్చల ద్వారా రెండు ప్రధాన ముప్పులు తొలగిపోవాలని ఇజ్రాయెల్ కోరుకుంటోంది.
ఒకటి ఇరాన్ అణు కార్యక్రమం, రెండు బాలిస్టిక్ క్షిపణుల ఉత్పత్తి. ఈ రెండు అంశాల్లో అమెరికా ప్రతిపాదించిన 15 పాయింట్ల ప్రణాళిక అమలు కావాలని అజార్ ఆకాంక్షించారు. మరోవంక, ఇజ్రాయెల్, లెబనాన్‌ల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న నేపథ్యంలో, బుధవారం బీరూట్‌పై జరిపిన వైమానిక దాడుల్లో హెజ్‌బొల్లా సెక్రటరీ-జనరల్ నయీమ్ ఖాసెమ్ వ్యక్తిగత కార్యదర్శి అలీ యూసుఫ్ హర్షీని హతమార్చినట్లు ఇజ్రాయెల్ రక్షణ దళాలు గురువారం ప్రకటించాయి.

More Stories
చంద్రుడిని చుట్టి భూమికి చేరిన ఆర్టెమిస్-2 వ్యోమగాములు
యుద్ధాన్ని వ్యాపారంగా మార్చుకున్న వైట్‌హౌస్
సామాజిక విప్లవకారుడు మహాత్మా జ్యోతి రావు ఫూలే