పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో హార్ముజ్ జలసంధి మూసివేయడం, విదేశాల నుంచి చమురు రాకపోవడంతో పాకిస్తాన్ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కుంటోంది. చమురు కొరత ప్రభావంతో ఇప్పటికే దేశంలో పలు ఆంక్షలు విధించిన పాక్ ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో ‘స్మార్ట్ లాక్డౌన్’ విధిస్తూ పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆదేశాలు జారీ చేశారు.
భారత్, నేపాల్, బంగ్లాదేశ్ వంటి దేశాలు యుద్ధం ప్రభావాన్ని తగ్గించడానికి చర్యలు తీసుకుంటుండగా పాక్ మాత్రం దాని పర్యవసానాలను అదుపు చేయలేక సతమతమవుతోంది. చమురు కొరతపై రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం అనంతరం ప్రధాని ఈ నిర్ణయం తీసుకున్నారు. చమురు వినియోగాన్ని తగ్గించేందుకు, ఉన్న నిల్వల్ని కాపాడుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పాక్ ప్రధాని చెప్పారు.
‘స్మార్ట్ లాక్డౌన్’ పై స్థానిక రేడియో వెల్లడించిన వివరాల ప్రకారం పాక్‌లోని పంజాబ్, ఖైబర్ పక్తుంఖ్వా, బలూచిస్తాన్, ఇస్లామాబాద్, గిగ్లిత్ బల్తిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ వంటి ప్రాంతాల్లో పలు ఆంక్షలు విధించారు. మార్కెట్లు, షాపులు, ఇతర కమర్షియల్ స్పేసెస్ అన్నీ రాత్రి ఎనిమిది గంటలకు మూసేయాలి. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే మినహాయింపులు ఇచ్చారు. అక్కడ రాత్రి 9 గంటల వరకు అనుమతి ఉంటుంది.
జనరల్ స్టోర్స్, డిపార్ట్మెంట్ స్టోర్స్ వంటివి ఎనిమిది గంటలకే మూసేయాలి. అలాగే, బేకరీలు, రెస్టారెంట్లు, ఇతర ఫుడ్ ఔట్లెట్లు మాత్రం రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉంచొచ్చు. అలాగే, పెళ్లి వేడుకలపై కూడా ఆంక్షలు విధించారు. రాత్రి 10 గంటల తర్వాత ఇళ్లల్లో మాత్రమే పెళ్లి వేడుకలు తక్కువ మందితో నిర్వహించుకోవాలి. మెడికల్ స్టోర్స్, ఫార్మసీలు మాత్రం ఎల్లప్పుడూ తెరిచి ఉంటాయి. ఈ ఆంక్షలన్నీ మంగళవారం నుంచే అమలు చేయబోతున్నట్లు ప్రభుత్వం తెలిపింది. కొన్ని చోట్ల ప్రైవేటు వాహనాలపై నిషేధం విధించారు.
అలాగే, కొన్ని నగరాల్లో ఉచిత ప్రజా రవాణా సౌకర్యాలు కల్పించనున్నట్టు పాక్ వెల్లడించింది. గిల్గిట్, ముజఫరాబాద్ నగరాలలోని ప్రజలకు నెల రోజుల పాటు ఉచిత ప్రజా రవాణా కల్పించినట్టు షెహబాజ్ ప్రభుత్వం తెలిపింది. హార్ముజ్ జలసంధి తెరిచి, చమురు అందుబాటులోకి వచ్చే వరకు ఈ పరిస్థితి ఉంటుందని పాక్ అధికార వర్గాలు తెలిపాయి.

More Stories
అపస్మారక స్థితిలో ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా
కాల్పుల విరమణకు ఇరాన్ విముఖత…యుద్ధ విరమణ జరగాలి!
యురేనియం దోపిడీకే అమెరికా డేరింగ్ ఆపరేషన్!