అసోంలో బీజేపీ హ్యాట్రిక్‌.. తమిళనాట ఎన్‌డీఏ, కేరళలో యూడీఎఫ్‌!

అసోంలో బీజేపీ హ్యాట్రిక్‌.. తమిళనాట ఎన్‌డీఏ, కేరళలో యూడీఎఫ్‌!
* బెంగాల్ లో స్వల్ప ఆధిక్యతలో టిఎంసి.. . మాట్రిజ్ పోల్ అంచనాలు 
 
నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారే అవకాశం ఉందని మ్యాట్రిజ్‌ సర్వే సంస్థ తెలిపింది. తమిళనాడులో అన్నాడీఎంకే సారథ్యంలోని ఎన్‌డీఏ, కేరళలో కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్‌ స్వల్ప ఆధిక్యంలో ఉన్నట్లు వెల్లడించింది. పశ్చిమ బెంగాల్ లో పాలక టీఎంసీ, విపక్ష బీజేపీ మధ్య హోరాహోరీ నెలకొన్నా సీఎం మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీయే స్వల్పంగా ముందంజలో ఉందని, అసోంలో బీజేపీ నాయకత్వంలోని ఎన్‌డీఏ వరుసగా మూడోసారి కూడా గెలిచి హ్యాట్రిక్‌ సృష్టించబోతోందని అంచనా వేసింది.  ఈ నాలుగు రాష్ట్రాలపై తన తాజా సర్వే అంచనాల ఫలితాలను మ్యాట్రిజ్‌ సోమవారం విడుదల చేసింది. 
రాబోయే పశ్చిమ బెంగాల్ లో రెండు ప్రధాన ప్రత్యర్థుల మధ్య అత్యంత హోరాహోరీ పోటీని సూచిస్తోంది. బెంగాల్లో టీఎంసీ, బీజేపీల మధ్య ఓట్ల తేడా రెండు శాతమేనని మ్యాట్రిజ్‌ సర్వే వెల్లడించింది. 294 స్థానాల అసెంబ్లీలో మేజిక్‌ మార్కు 148 కాగా.. టీఎంసీకి 140-160 సీట్లు, బీజేపీకి 130-150 రావచ్చని మేట్రిజ్‌ అంచనా వేసింది. 2021 ఎన్నికల్లో టీఎంసీ 215 సీట్లు గెలుచుకుంది. ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు కలిపి సుమారు 8 నుండి 16 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉంది. 
 
బెంగాల్‌లో టిఎంసికి 43% ఓట్లు లభించే అవకాశం ఉండగా, బీజేపీకి 41% ఓట్లు దక్కవచ్చని అంచనా. మిగిలిన ఇతర పార్టీలకు 16% ఓట్లు లభించే అవకాశం ఉంది.  ఓట్ల తేడా తక్కువగా ఉన్నందున బీజేపీ సంచలన విజయం నమోదుచేసినా చేయవచ్చని తెలిపింది.

తమిళనాడులో ఈసారి గాలి మార్పు ఖాయమని మ్యాట్రిజ్‌ అంచనా వేసింది. సీఎం ఎంకే స్టాలిన్‌ నేతృత్వంలోని పాలక డీఎంకే కూటమి ఏకపక్ష విజయం సాధిస్తుందన్న అంచనాలు తల్లకిందులయ్యాయని, ఆ కూటమి గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోందని, విపక్ష అన్నాడీఎంకే కూటమి (ఎన్‌డీఏ)తో హోరాహోరీ తథ్యమని, ఎన్‌డీఏ వైపే మొగ్గు కనబడుతోందని తెలిపింది.  ఎన్‌డీఏ 40 శాతం ఓట్లు సాధిస్తుందని, డీఎంకే కూటమి 38 శాతంతో సరిపెట్టుకుంటుందని వెల్లడించింది.

సినీహీరో విజయ్‌ స్థాపించిన టీవీకే పార్టీ ప్రభావం బాగానే ఉంటుందని, ఆ పార్టీ 16 శాతం ఓట్లు సాధించే అవకాశం ఉందని అంచనా వేసింది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కూటమి 158, అన్నాడీఎంకే కూటమి 67 చోట్ల విజయం సాధించాయి. 230 స్థానాల అసెంబ్లీలో మ్యాజిక్‌ మార్కు 116 కాగా, ఈ సారి ఎన్‌డీఏ 107-120 స్థానాలు గెలుచుకుంటుందని,. డీఎంకే కూటమికి 102-115 స్థానాలు దక్కవచ్చని,  టీవీకేకి 5-12, ఇతరులు 1-6 సీట్లు గెలవొచ్చని పేర్కొంది. .

అస్సాం అసెంబ్లీ ఎన్నికల విషయానికి వస్తే, ఎన్డీయే కూటమికి స్పష్టమైన మెజారిటీ లభించే అవకాశం ఉంది. ఆ కూటమి 92 నుండి 102 స్థానాలను గెలుచుకునే అవకాశం ఉంది. ఇది దాని ప్రత్యర్థులపై ఆ కూటమికి ఉన్న నిర్ణయాత్మక ఆధిక్యాన్ని తెలియజేస్తోంది. దీనికి భిన్నంగా, కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి వెనుకబడి పోతుందని, వారికి సుమారు 22 నుండి 32 స్థానాలు మాత్రమే లభించవచ్చని అంచనా వేస్తున్నారు. 
 
బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే మొత్తం ఓట్ల వాటాలో సుమారు 46% సాధిస్తుందని, కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి దాదాపు 36% ఓట్లను దక్కించుకోవచ్చని అంచనా వేస్తున్నారు. ఇతర పార్టీలన్నీ కలిపి ఓట్ల వాటాలో దాదాపు 18% పొందుతాయని అంచనా. 
కాంగ్రెస్‌ సారథ్యంలోని యూడీఎఫ్‌ పదేళ్ల తర్వాత కేరళలో అధికారంలోకి రానున్నట్లు మ్యాట్రిజ్‌ అంచనా వేసింది. ఈ కూటమి పాలక ఎల్‌డీఎఫ్‌ కంటే స్వల్ప ఆధిక్యంలో ఉందని తెలిపింది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో 140 స్థానాలకు గాను ఎల్‌డీఫ్‌ 99 చోట్ల గెలవగా,  యూడీఎఫ్‌ 41 స్థానాలకే పరిమితమైంది. కేరళలో అధికారం చేపట్టడానికి మ్యాజిక్‌ మార్కు 71.  ఈసారి యూడీఎఫ్‌ కూటమికి 67-73సీట్లు రావచ్చని, ఎల్‌డీఎఫ్‌ 62-68 సీట్లు కైవసం చేసుకునే అవకాశం ఉందని మ్యాట్రిజ్‌ సర్వే తెలిపింది.
బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏకి 5-8 సీట్లు.. ఇతరులు 0-3సీట్లు సాధించే వీలుందని వెల్లడించింది. ఓట్ల పరంగా యూడీఎఫ్‌ 42 శాతం, ఎల్‌డీఎఫ్‌ 39 శాతం, ఎన్‌డీఏ 15 శాతం దక్కించుకోవచ్చని అంచనా వేసింది. ఐదు రాష్ట్రాల్లో సుమారు 17.4 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారని అంచనా, ఇందుకోసం దాదాపు 2.19 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.