ఫీజు రీయింబర్స్ పథకం ఎత్తివేత దిశగా ప్రభుత్వ అడుగులు

ఫీజు రీయింబర్స్ పథకం ఎత్తివేత దిశగా ప్రభుత్వ అడుగులు
* ఈ పథకాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తే.. ఎబివిపి హెచ్చరిక 

పేద,బడుగు బలహీన వర్గాలకు విద్యాప్రదాయినిగా ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసే దిశగా  రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నట్లు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఎబివిపి) రాష్ట్ర కార్యదర్శి మాచెర్ల రాంబాబు ఆరోపించారు. 
ఇటీవల జరిగిన పరిణామాలు చూస్తుంటే ఈ విషయం స్పష్టం అవుతున్నదని తెలిపారు. పేద విద్యార్థుల ఉన్నతవిద్యకు భరోసాగా ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తే విద్యార్థులతో కలిసి ప్రభుత్వ మెడలు వంచుతామని తేల్చి చెప్పారు. 
విద్యా కమిషన్ నివేదికలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకం అవసరం లేదన్నట్లు ప్రస్తావించగా,  ప్రభుత్వం సకాలంలో కౌంటర్ దాఖలు చేయని కారణంగా విద్యార్థుల దగ్గర నుండే ఫీజులు వసూలు చేసుకోవచ్చని  తెలంగాణ హైకోర్టు వ్యాఖ్యానించడం విద్యార్థి సమాజంలో ఆందోళన కలిగిస్తోందని ఆయన చెప్పారు.  ఒక వైపు బకాయిలు విడుదల చేయకుండా ప్రభుత్వం విద్యార్థులను వేధిస్తోందని, మరోవైపు ఏ విధంగా ఈ పథకాన్ని ఎత్తివేయలా అని ప్రణాళిక బద్దంగా పనిచేస్తున్నదని రాంబాబు ధ్వజమెత్తారు.
లక్షల మంది విద్యార్థులు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల కాక సర్టిఫికెట్స్ తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారని, డ్రాపౌట్స్ అవుతున్నారని ఎబివిపి నేత ఆందోళన వ్యక్తం చేశారు.  బకాయిలు విడుదల చేయాలని ఉద్యమించే విద్యార్థులపై, విద్యార్థి సంఘాల నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని తమ కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రవేశపెట్టిందని, దాన్ని బిఆర్ఎస్ నిర్వీర్యం చేయాలని చూస్తోందని ఆరోపించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు నోరుమెదపడం లేదని విమర్శించారు. 
 
సకాలంలో రాష్ట్ర ప్రభుత్వ వాటా చెల్లించకపోవడం వల్ల ఎస్సి, ఎస్టీ విద్యార్థులకు కేంద్రం నుండి వచ్చే నిధులు సైతం తిరిగి వెనక్కి వెళ్తున్నా ప్రభుత్వ స్పందన కరువైందని వాపోయారు. ఇప్పటికైనా విద్యాశాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి మౌనం వీడి ఫీజు రీయింబర్స్మెంట్ పథకంపై స్పష్టమైన ప్రకటన చేయాలని రాంబాబు డిమాండ్ చేశారు.  బకాయిలు వెంటనే విడుదల చేయకపోతే విద్యార్థులు, తల్లిదండ్రులు తిరగబడే రోజులొస్తాయని ఆయన హెచ్చరించారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేయాలని చూస్తే నీ ప్రభుత్వాన్ని ప్రజలే ఎత్తివేస్తారని స్పష్టం చేశారు.