* కేంద్ర బలగాల మోహరింపుకు, సిబిఐ/ఎన్ఐఎ దర్యాప్తుకు ఆదేశం
ఎస్‌ఐఆర్ వీధుల్లో భాగంగా బంగాల్లోని మాల్డా జిల్లాలో ఏడుగురు న్యాయాధికారులను తొమ్మిది గంటలపాటు నిర్బంధించిన ఘటనపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన దాడి అని ధర్మాసనం అభివర్ణించింది. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్యా బాగ్చి, జస్టిస్ విపుల్ ఎమ్ పంచోలీతో కూడిని ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది.
బంగాల్‌లో శాంతిభద్రతల వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిందన్న సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, ఈ ఘటనపై తగిన వివరణ ఇవ్వాలని రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి, డీజీపీకి నోటీసులు జారీ చేశారు. ముగ్గురు మహిళలు సహా ఏడుగురు న్యాయాధికారులను కొన్ని అసాంఘిక శక్తులు నిర్బందించాయని, ఈ అర్థరాత్రి వరకు తాను స్వయంగా పరిస్థితిని పర్యవేక్షించాల్సి వచ్చిందని సీజేఐ తెలిపారు.
ఇది న్యాయాధికారులను భయపెట్టడమే కాకుండా కోర్టు అధికారాన్ని నేరుగా సవాలు చేయడమేనని ధర్మాసనం పేర్కొంది. న్యాయాధికారులపై మానసిక దాడులకు పాల్పడేందుకు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకునే హక్కు ఎవరికీ లేదని తేల్చిచెప్పింది. జ్యుడీషియల్ అధికారుల భద్రత కల్పించడంతో పాటు ఎస్ఐఆర్ ప్రక్రియకు ఆటంకం కలగకుండా ఉండేందుకు కేంద్ర బలగాలను మోహరించాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది.
రాష్ట్రంలో రాజకీయాలకే ప్రాధాన్యత ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు. ఈ ఘటన పట్ల సీబీఐ లేదా ఎన్ఐఏతో దర్యాప్తు చేపట్టాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశిస్తున్నట్లు సుప్రీంకోర్టు పేర్కొన్నది. ఆ దర్యాప్తును తాము మానిటర్ చేస్తామని కోర్టు చెప్పింది.
“జ్యుడీషియల్ అధికారుల మనోధైర్యాన్ని దెబ్బకొట్టి ఎస్ఐఆర్ ప్రక్రియను ఆపేందుకు కుట్రపూరితంగా ఈ ఘటనకు పాల్పడ్డారు. ఆందోళనకారుల ఘెరావ్ గురించి మధ్యాహ్నమే సమాచారం అందినా, రాష్ట్ర అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. సాయం కోసం స్వయంగా కలకత్తా హైకోర్టు చీఫ్ జస్టిస్, రాష్ట్ర హోం సెక్రటరీ, డీజీపీకి ఫోన్ చేయాల్సి వచ్చింది” అని సుప్రీంకోర్టు గుర్తు చేసింది.
“వారి నుంచి ఆదేశాలు అందినా జిల్లా సీనియర్ అధికారులు ఘటనా స్థలానికి వెళ్లలేదు. రాత్రి 11 గంటల వరకూ వారికి ఎలాంటి సాయం అందలేదు. ఈ ఘటనలో రాష్ట్ర అధికారుల ప్రవర్తన అత్యంత బాధాకరం. ఇది కోర్టు అధికారాన్ని సవాల్ చేసినట్లే. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడానికి మేం ఎన్నటికీ అనుమతించబోం” అని స్పష్టం చేసింది.
బంగాల్‌లో ఓటర్ల జాబితా సమగ్ర సర్వే(ఎస్ఐఆర్) పేరుతో పెద్ద ఎత్తున ఓటర్ల పేర్లను తొలగిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఓటర్ల జాబితా నుంచి పేర్లను తొలగించడాన్ని నిరసిస్తూ మాల్డా జిల్లాలో ఆందోళనకారులు బుధవారం ఆందోళనకు దిగారు. మొదట న్యాయాధికారులతో సమావేశం కావాలని నిరసనకారులు కోరారు. అందుకు అనుమతి నిరాకరించడంతో నిన్న సాయంత్రం 4 గంటల సమయంలో కార్యాలయం చుట్టూ చేరి అధికారులను నిర్బంధించారు.
దాంట్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. బుధవారం మధ్యాహ్నం ఆ ఆఫీసర్లను ఘెరావ్ చేశారు. మధ్యరాత్రి వాళ్లను రెస్క్యూ చేశారని చీఫ్ జస్టిస్ తెలిపారు. రాత్రి 2 గంటల వరకు ఈ ఘటనను మానిటర్ చేయాల్సి వచ్చిందని సూర్యకాంత్ పేర్కొన్నారు. అన్ని రాజకీయ పార్టీలు నిన్న జరిగిన ఘటనను ముక్తకంఠంతో ఖండించాలని జస్టిస్ జోయ్‌మాల్యా బాగ్చి స్పష్టం చేశారు.
స్పెషల్ ఆఫీసర్లను రక్షించేందుకే తాము ఉన్నామని, వాళ్లు ఇచ్చే ఆదేశాలు కోర్టు ఇచ్చిన ఆదేశాలుగా పరిగణిస్తామని బాగ్చి తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం తక్షణమే బలగాలను తీసుకువచ్చి జుడిషియల్ ఆఫీసర్లకు రక్షణ కల్పించాలని జస్టిస్ బాగ్చి చెప్పారు. అర్థరాత్రి విడుదలై ఇంటికి వెళ్తున్న సమయంలోనూ ఆ ఆఫీసర్ల వాహనాలపై రాళ్లు రువ్వినట్లు కూడా సీజేఐ చెప్పారు.
జుడిషియల్ అధికారుల్ని బెదిరించడం అంటే న్యాయవ్యవస్థను సవాల్ చేయడమే అవుతుందని, ఇదేమీ రొటీన్‌గా జరిగే ఘటన కాదు అని, కానీ ఓ పక్కా ప్లాన్ ప్రకారం , జడ్జీలను నిర్వీర్యం చేయాలన్న ఉద్దేశంతో చేసినట్లుగా ఉందని సీజే ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోనివ్వబోమని, ఆఫీసర్లను మానసిక క్షోభకు గురిచేయనివ్వబోమని హెచ్చరించారు.
బెంగాల్ సర్కారు ఈ ఘటన పట్ల వివరణ ఇవ్వాలని, ముందుగా చెప్పినా ఎందుకు ఆ ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోలేదని కోర్టు ప్రశ్నించింది. సీబీఐ లేదా ఎన్ఐఏ ఇచ్చే నివేదికను తమకు నేరుగా సమర్పించాలని కోర్టు తెలిపింది. కాగా, సమాచారం అందుకున్న భద్రతా సిబ్బంది అర్ధరాత్రి ఒంటి గంట తర్వాత అక్కడికి చేరుకొని జ్యుడీషియల్ అధికారులను సురక్షితంగా కాపాడారు. అడ్డుకున్న ఆందోళనకారులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడంతో ఉద్రిక్తతలు నెలకొన్నాయి.
అధికారులను రక్షించిన తర్వాత కూడా జాతీయ రహదారిపై దిగ్బంధం కొనసాగింది. అనంతరం అదనపు జిల్లా మేజిస్ట్రేట్ సంఘటనా స్థలానికి చేరుకుని నాలుగు రోజుల్లోగా అర్హులైన ఓటర్ల పేర్లను ఓటర్ల జాబితాలో చేర్చుతామని హామీ ఇచ్చిన తర్వాతే పరిస్థితి సద్దుమణిగింది. ఆ హామీ తరువాత నిరసనకారులు ఆందోళనలను విరమించుకున్నారు.
More Stories
మొలకెత్తిన ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వమే కొనాలి
నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ప్రెసిడెంట్‌గా అనుపిందర్ సింగ్ గ్రేవాల్
టూరిస్ట్ వీసాపై వచ్చిన ముగ్గురు మతబోధకులపై వేటు!