ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రాజ్యసభ సభ్యుడైన రాఘవ్ చద్దాపై ఆ పార్టీ చర్యలు చేపట్టింది. 2023 నుంచి రాజ్యసభలో ఉప నేతగా ఉన్న ఆయనను ఆ పదవి నుంచి తొలగించింది. పంజాబ్ ఎంపీ అశోక్ మిట్టల్‌ను రాజ్యసభలో ఆప్ డిప్యూటీ లీడర్‌గా ఆ పార్టీ నియమించింది. ఈ మార్పునకు సంబంధించి అధికారిక లేఖను రాజ్యసభ సచివాలయానికి ఆప్ పంపినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అలాగే సభలో మాట్లాడటానికి రాఘవ్ చద్దాకు సమయం కేటాయించకూడదని కూడా ఆ లేఖలో పేర్కొన్నట్లు తెలిసింది.
ఏడుగురు పంజాబ్, ముగ్గురు ఢిల్లీ సహా రాజ్యసభలో ఆప్‌కు మొత్తం 10 మంది సభ్యులు ఉండగా.. సంజయ్ సింగ్ ఆ పార్టీ నాయకుడిగా ఉన్నారు. రాజ్యసభలో బీజేపీ, కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ తర్వాత సంఖ్యా పరంగా ఆప్ నాలుగో స్థానంలో ఉంది. అయితే, ఒకప్పుడు ఆప్ అగ్రనేతగా, పార్టీలో అధినేత అరవింద్ కేజ్రీవాల్ అంతరంగికుల్లో ఒకరిగా పరిగణించిన రాఘవ్ చద్ధాను ఉపనేత పదవి నుంచి తొలగించడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
వృత్తిరీత్యా చార్టెడ్ అకౌంటెంట్ అయిన 33 ఏళ్ల చద్ధా ఆప్ ఆవిర్భావం నుంచి ఆ పార్టీలో ఉన్నారు. అవినీతి వ్యతిరేక ఉద్యమం సమయంలో కేజ్రీవాల్‌తో చద్ధాకు పరిచయం ఏర్పడింది. తర్వాత కేజ్రీవాల్ ప్రారంభించిన ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. ఢిల్లీ లోక్‌పాల్ బిల్లు ముసాయిదా రూపకల్పనలో పాల్గొన్నారు. ఆప్ జాతీయ అధికార ప్రతినిధిగా ఆ పార్టీ తరఫున తరుచూ టీవీ చర్చలలో కనిపిస్తూ కీలక నేతగా గుర్తింపు పొందారు. 26 ఏళ్ల వయసులో ఆప్ జాతీయ ట్రెజరర్‌గా నియమితులయ్యారు.
ఇక, 2020 ఢిల్లీ ఎన్నికల్లో రాజేంద్ర నగర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఢిల్లీ జల్ బోర్డ్ వైస్-ఛైర్మన్‌గానూ పనిచేశారు. 2022లో ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభకు నామినేట్ చేసింది. ఇదిలా ఉండగా, రాఘవ్ చద్ధాను ఉప నేత పదవి నుంచి తప్పించడానికి గల కారణాలను ఆప్ అధికారికంగా వెల్లడించనప్పటికీ, పార్టీలో ఆయన స్థానం గురించి గత కొన్ని నెలలుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కీలకమైన పార్టీ కార్యక్రమాలకు గైర్హాజరు కావడం, కేజ్రీవాల్, మనీష్ సిసోడియాలకు మద్యం పాలసీ కేసులో కోర్టు క్లీన్ చిట్ ఇవ్వడం వంటి పరిణామాలపై చద్ధా స్పందించకపోవడం అనేక ఊహాగానాలకు దారితీసింది.
కానీ, ఎయిర్‌పోర్టుల్లో ఆహార పదార్థాల అధిక ధరలు, గిగ్ వర్కర్ల హక్కులు, ప్రధాన నగరాల్లో ట్రాఫిక్ రద్దీ వంటి కీలక సమస్యలను రాజ్యసభలో ఆయన లేవనెత్తారు. ఈ పరిణామాలపై చద్ధా కార్యాలయాన్ని మీ డియా సంప్రదించగా ఆయన అందుబాటులోకి రాలేదు. మరోవైపు, ఉపనేతగా తనను నియమించినందుకు కేజ్రీవాల్‌కు అశోక్ మిట్టల్ ధన్యవాదాలు తెలిపారు. ‘‘ఆప్ ఓ ప్రజాస్వామ్య పార్టీ. ప్రతి నాయకుడికి మెళకువలు నేర్చుకోవడానికి అవకాశం ఇస్తుంది. మొదట ఎన్డీ గుప్తా ఉపనేతర్గా ఉన్నారు. ఆ తర్వాత రాఘవ్ చద్ధా ఇప్పుడు నేను’’ అని ఆయన పేర్కొన్నారు.

More Stories
న్యాయాధికారులనే నిర్బంధిస్తారా? బెంగాల్ పై సుప్రీంకోర్టు ఆగ్రహం
`మావోయిస్టులు లేని భారత్’ అవకాశం యుపిఎ ఎలా కోల్పోయింది?
ఇరాన్లో రివల్యూషనరీ గార్డ్ స్వాధీనంలో ప్రభుత్వం?