మూసీ ప్రాజెక్టుపై ఎన్‌జీటీలో ప్రభుత్వానికి ఊరట

మూసీ ప్రాజెక్టుపై ఎన్‌జీటీలో ప్రభుత్వానికి ఊరట

మూసీ నది పునరుజ్జీవం, సుందరీకరణ ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి నేషనల్ గ్రీన్‌ ట్రైబ్యునల్‌ (ఎన్​జీటీ) ఊరటనిచ్చింది. పర్యావరణ అనుమతులు లేకుండా గాంధీ సరోవర్‌ నిర్మాణం చేస్తున్నారంటూ బీఆర్‌ఎస్‌ నేత పటోళ్ల కార్తీక్‌ రెడ్డి తమిళవాడు రాష్ట్రంలోని చెన్నైలోని నేషన్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌ (ఎన్​జీటీ)లో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ డిస్మిస్ చేసింది.

ఈ పిటిషన్‌ను విచారించిన ట్రైబ్యునల్ పిటిషనర్ తన వాదనలకు సంబంధించి ఎటువంటి సాంకేతిక, శాస్త్రీయ ఆధారాలను సమర్పించలేదని పేర్కొంది. కేవలం అనుమానాలతో ప్రాజెక్టును అడ్డుకోలేమని, పర్యావరణ ఉల్లంఘనలు జరుగుతున్నాయని నిరూపించడంలో పిటిషనర్ విఫలమయ్యారని ట్రైబ్యునల్‌ అభిప్రాయపడింది. 

గాంధీ సరోవర్‌, మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు సంబంధించి అన్ని రకాల అనుమతులు తీసుకున్న తర్వాతే ముందుకెళ్తామని ప్రభుత్వ న్యాయవాది ఎన్​జీటీ దృష్టికి తీసుకెళ్లారు. ప్రాజెక్టు సమగ్ర నివేదిక పూర్తి అవుతోందని, గాంధీ సరోవర్‌కు సంబంధించి తుది నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉందని తెలిపారు. అటు తర్వాత పర్యావరణానికి ఏమైనా నష్టం వాటిల్లుతుందా అన్న అంశాన్ని కూడా విశ్లేషిస్తామని ఎన్​జీటీకి హామీ ఇచ్చారు. 

దీంతో ఈ దశలో పటోళ్ల కార్తీక్‌ రెడ్డి పిటిషన్‌ను విచారించలేమని ఎన్​జీటీ స్పష్టం చేసింది. మూసీ పునరుజ్జీవంలో భాగంగా ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంచిరేవుల వద్ద ఓంకారేశ్వరాలయానికి భూమి పూజ కూడా చేసింది. గాంధీ సరోవర్‌కు సంబంధించి నేషల్ గ్రీన్ ట్రిబ్యూనల్‌లో కొంత ఊరట లభించడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మూసీ సుందరీకరణ పనుల్లో వేగం పెంచే అవకాశం ఉంది.  మూసీ నదిలో మురుగునీరు కలవకుండా ఎస్​టీపీల నిర్మాణం, నది పరివాహక ప్రాంతాల్లో రిటైనింగ్ వాల్స్, చెక్ డ్యామ్‌ల ఏర్పాటు వంటి పనులపై అధికారులు కసరత్తు చేస్తున్నారు.